రాగితో కరోనావైరస్ దరి చేరదంటా..!

యాంటీ బాక్టీరియల్ గుణాలున్న రాగి.. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది

రాగితో కరోనావైరస్ దరి చేరదంటా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 01, 2020 | 3:20 PM

కొత్త తరంలో ఎన్నో టెక్నాలజీలు ఆవిష్కృతమవుతున్నా పాత తరం వస్తువుల మక్కువ తగ్గడంలేదు. ప్రతి ఫ్యామిలీలో రాగికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. గతంలో ప్రతి వస్తువును రాగితో తయారు చేసిన వాటినే ఉపయోగించేవారు. తాజాగా కరోనా మహమ్మారీ విజృంభిస్తున్నవేళ రాగి పాత్రల వినియోగంతో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు.

యాంటీ బాక్టీరియల్ గుణాలున్న రాగి.. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది ఈ లోహంతో తయారు చేసిన పాత్రలో నిల్వచేసిన నీటిని తాగుతారు. అంతేగాక గాయాలను త్వరగా నయం చేయడమే గాకుండా రక్తహీనతను అరికట్టే శక్తి దీనికి ఉన్న ప్రత్యేక గుణం. ఇక రాగిని శరీరానికి అందించడం ద్వారా కొవ్వును కరిగించుకోవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు గతంలో వెల్లడించారు. ఇవే కాకుండా మరెన్నో గొప్ప లక్షణాలున్న రాగితో తయారు చేసిన పాత్రలు, రాగి పూత ఉన్న వస్తువుల వాడకం మహమ్మారి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉపయోగపడుతుందని బ్రిటీష్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ విలియం కీవిల్ తాజాగా వెల్లడించారు. మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు కనిపెడతారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో కలిసి జీవిస్తూనే…వైరస్ మన దరి చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడమే ఉత్తమైన మార్గమని నిపుణులు అంటున్నారు. సామాజిక దూరాన్ని తప్పనిసరి చేసిన ప్రపంచ దేశాలు.. అధిక జనసంచారం ఉండే రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులతో సహా ఇంట్లోనూ రాగి పూత ఉన్న వస్తువులను వాడేలా ప్రజలను ప్రోత్సహించాలంటున్నారు ప్రొఫెసర్ విలియం కీవిల్. యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ సీనియర్ మైక్రోబయోలజిస్ట్ అయిన ప్రొఫెసర్ విలియం దాదాపు రెండు దశాబ్దాలుగా వివిధ లోహాల యాంటీ బాక్టీరియల్ గుణాలపై పరిశోధనలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తన పరిశోధనలు మరింత ముమ్మరం చేసిన ఆయన.. రాగితో తయారు చేసిన లేదా రాగి పూత ఉన్న వస్తువులపై వైరస్ చేరినట్లయితే కేవలం నాలుగు గంటల్లోనే అది అంతమవుతుందని పేర్కొన్నారు. కాపర్ పై వైరస్ చేరినపుడు దానిలోని అయాన్లు, ఎలక్ట్రాన్లు వైరస్ మెంబ్రేన్ పై దాడి చేసి.. డీఎన్ఏను నిర్వీర్యపరిచి.. దానిని పూర్తిగా నాశనం చేస్తుందని వెల్లడించారు. స్టీలుపై కరోనా మూడు రోజుల పాటు బతికి ఉంటుంది. అదే రాగిపై కేవలం నాలుగు గంటలు మాత్రమే జీవించి ఉండగలదు. మనం రోజూ ఎక్కువగా ఉపయోగించే డోర్ హ్యాండిల్స్, షాపింగ్ ట్రాలీలు, హ్యాండ్ రెయిల్స్, జిమ్ పరికరాలు, క్యాష్ మెషీన్లపై కాపర్ పూత వేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని ప్రొఫెసర్ విలియం పేర్కొన్నారు. ఇక వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న యూకేలో జనసమ్మర్ధం ఉన్నచోట రాగి పూత వేసిన వస్తువులు ఎక్కువగా వాడాల్సి ఉందని విలియం సూచించారు. పోలాండ్ బస్సుల్లో రాగితో తయారు చేసిన హ్యాండ్రెయిల్స్ వాడుతున్నారని, చిలీ ఎయిర్ పోర్టుల్లో, బ్రెజిల్ ఇమ్మిగ్రేషన్ కియోస్కుల్లో రాగి వాడకం ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. యూకేలోనూ ప్రభుత్వ భవనాలు, రైల్వే, బస్సు స్టేషన్లలో రాగి హ్యాండ్ రెయిల్స్, తలుపు బెడాలను ఉపయోగించడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో అమెరికా శాస్త్రవేత్తల బృందం సైతం.. ఇంటెన్సివ్ కేర్ లో రాగి పూత ఉన్న పరికరాలను ఉపయోగించడం వల్ల బాక్టీరియాను చంపగల శక్తి 95 శాతం ఎక్కువగా ఉందని వెల్లడించింది. అదే విధంగా దక్షిణ కరోలినాలోని ది మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక వెంటిలేషన్ సరిగా లేని చోట్ల వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వుహాన్ వైద్య నిపుణులు తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. శాస్ర్త సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందినప్పటికీ పాత తరం పద్ధతులతోనే ఆరోగ్యం పదిలమని స్పష్టమవుతోంది.