Live Encounter Reporting: ఫిబ్రవరి 18.. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి కారు-బాంబు దాడి జరిపి అప్పటికే 3 రోజులు గడిచిపోయి 4వ రోజుకు చేరుకుంది. ఆర్మీ, పారామిలటరీ బలగాల్లో ఉగ్రవాదులపై ప్రతీకార జ్వాల రగులుతోంది. దాడికి పాల్పడిన జైష్-ఏ-మొహ్మద్ ఉగ్రవాదుల కోసం జమ్ము-కాశ్మీర్ పోలీసులు, పారా మిలటరీ, ఆర్మీ జాయింట్ సెర్చ్ ఆపరేషన్లు అప్పటికే మొదలయ్యాయి. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ను సంక్షిప్తంగా కాసో (CaSO) అని అక్కడ పిలుస్తుంటారు. పుల్వామా ఘటనా స్థలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో హైవే నుంచి లోపల ఉన్న పింగ్లాన్ గ్రామంలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన భద్రతా బలగాలు, వాళ్లు దాక్కున్న ఇంటిని చుట్టుముట్టాయి. కాల్పులు – ఎదురుకాల్పులతో ఆ ప్రాంతం మార్మోగిపోతోంది. సమాచారం అందిన వెంటనే బయల్దేరాం. మేం బుక్ చేసుకున్న కార్ డ్రైవర్ స్థానికుడే కాబట్టి ఊరు పేరు చెప్పగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లాడు. మధ్యలో కొందరు స్థానికులు అడ్డుకున్నా.. వారికి కశ్మీరీ భాషలో సర్దిచెప్పాడు.
ఎలాగైతేనేం.. ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నాం. కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. కశ్మీర్‌లో జరిగే ఎన్‌కౌంటర్లలో ఆర్మీ మొదటి వరుసలో ఉండి ఎదురుకాల్పులు జరుపుతుంది. వారికి అండగా రెండో అంచెలో సీఆర్పీఎఫ్ ఉంటుంది. ఆ తర్వాత మూడో అంచెలో జమ్ము-కాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూపు ఉంటుంది. వాళ్లు ఎన్‌కౌంటర్ ప్రాంతానికి సామాన్యులు రాకుండా నియంత్రిస్తూ ఉంటారు. ఊరి చివర్లో ఉన్న ఇంట్లో ఉగ్రవాదులు నక్కి భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతున్నారు. దాంతో మధ్యలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కెమేరా జూమ్ చేస్తే కాల్పులు – ఎదురుకాల్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కణ్ణుంచి లైవ్ రిపోర్టింగ్ చేద్దామంటే మొబైల్ ఇంటర్నెట్ అప్పటికే బంద్. అక్కడి పరిస్థితిని చూపిస్తూ, నా స్వరంతో వినిపిస్తూ రికార్డు చేసుకుని ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ప్రాంతానికి వెళ్లి పంపించాలి. ఈ లోపు ఉగ్రవాదుల కాల్పుల్లో సౌత్ కాశ్మీర్ డీఐజీ అమిత్ కుమార్, లెఫ్టనెంట్ కల్నల్, కెప్టెన్ ర్యాంక్ అధికారులకు బుల్లెట్ గాయాలయ్యాయి. అప్పటికే ఆర్మీ మేజర్ వీఎస్ దొండియాల్ సహా మొత్తం నలుగురు ఆర్మీ జవాన్లు, అధికారులు బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ బ్రిగేడియర్ హర్బీర్ సింగ్ గాయపడ్డారు. పుల్వామా దాడికి మాస్టర్ మైండ్ అని భావిస్తున్న కమ్రాన్ అలియాస్ ఘాజీ రషీద్ ఈ ఎన్‌కౌంటర్లో చనిపోయాడు.
కళ్లముందు కాల్పుల హోరు.. బుల్లెట్ల వర్షం.. ఆ ధాటికి ఉగ్రవాదుల దాక్కున్న ఇళ్ల సముదాయంలో ఒక ఇంటి నుంచి దట్టమైన పొగలు అలుముకుని ఆకాశంలో అంతెత్తున్న కనిపిస్తున్నాయి. దాంతో మేం ఓ నాలుగడుగులు ముందుకేసి మరింత స్పష్టంగా కనిపించేలా కెమేరాను జూమ్ చేసి మాక్ లైవ్ రికార్డ్ చేస్తున్నాం. అంతలో పోలీస్ సిబ్బంది “డౌన్.. డౌన్..” అంటూ అరుపులు వినిపించాయి. వాళ్లు ఏం చెబుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే.. పక్కనే ఉన్న ఓ హిందీ ఛానెల్ రిపోర్టర్.. కింద కూర్చో.. లేదా పడుకో అని చెబుతున్నారు.. ఫైరింగ్ రేంజిలో ఉన్నాం అంటున్నాడు అని చెప్పాడు. నిజానికి అది చూడ్డానికి నటన అనుకుంటారేమోనని సందేహిస్తుండగా.. పోలీసులు “అర్థం కావడం లేదా, చావడానికి వచ్చారా ఇక్కడికి.. దూరంగా వెళ్లండి లేదా కింద కూర్చోండి” అంటూ మళ్లీ అరిచాడు. అప్పటికే రికార్డింగ్ మధ్యలో ఉంది. దూరం వెళ్లడం కంటే కూర్చోవడం నయం అనుకుని నేను, కెమేరామన్ కింద కూర్చుండి కాల్పులు, ఇల్లు తగలబడే దృశ్యాలు చూపిస్తూ మాక్ లైవ్ రికార్డింగ్ పూర్తి చేశాం.
అది పంపించాలంటే మాకు రాంకీ గ్రూప్ క్యాంప్ తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు. అక్కడికి సుమారు 6 కి.మీ దూరంలో ఉన్న క్యాంప్ దగ్గరకు వెళ్లేందుకు బయల్దేరాం. 5 కి.మీ ప్రయాణించి హైవే చేరుకుంటుండగా మా మొబైల్ ఫోన్లలో వాట్సాప్ మెస్సేజులు ఒక్కసారిగా వరద ప్రవాహంలా రావడం మొదలయ్యాయి. అందులో చూస్తే 4జీ సిగ్నల్ కనిపిస్తోంది. అంతే వెంటనే అక్కడే కారు ఆపేసి, 4జీ కిట్ ఆన్ చేసి రికార్డు చేసిన ఫుటేజి మొత్తం పంపించేశాం. మళ్లీ వెంటనే ఎన్‌కౌంటర్ స్పాట్‌కు పరుగులు తీశాం.
ఇదిలా ఉంటే అప్పటికే మేం యాక్షన్‌లో దిగడంతో మా బ్యాకప్ టీమ్ ఢిల్లీకి తిరుగు ప్రయాణమైంది. మాతో పాటు వచ్చిన టీవీ9 కన్నడ రిపోర్టర్ హరీశ్ కూడా వారితో పాటు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కేశాడు. అయితే నేను పంపించిన ఫుటేజి వెంటనే టెలీకాస్ట్ అవడంతో కాల్పులు-ఎదురుకాల్పుల దృశ్యాలు, తగలబడుతున్న ఇల్లు, అక్కడి ఉద్రిక్త వాతావరణం, చనిపోయిన ఆర్మీ జవాన్లు, అధికారులతో ఆ ఎన్‌కౌంటర్ తీవ్రత అందరికీ అర్థమైంది. పుల్వామా దాడుల సూత్రధారి చిక్కుకున్న ఎన్‌కౌంటర్ వార్తను యావత్ లోకం ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా చూస్తున్నారని కూడా అర్థమైంది. అంతే.. హెడాఫీస్ మరో ఇద్దరిని కశ్మీర్ లోయకు పంపించాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంది. దేవి నాగవల్లి, హసీనాలను పంపేందుకు సిద్ధమైంది. అయితే వాళ్లిద్దరితో పాటు మరో ఇద్దరు కెమేరామెన్‌ను హైదరాబాద్ నుంచి శ్రీనగర్ పంపించడం కంటే, అప్పటికే విమానం ఎక్కిన మా బ్యాకప్ టీమ్‌లోని కెమేరామన్ ప్రభును దింపేస్తే బెటర్ అని భావించారు.
నాటి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నేటి మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గారు ప్రభుకు ఫోన్ చేసి అర్జంటుగా విమానం దిగిపోవాల్సిందిగా ఆదేశించారు. అప్పటికే చెకిన్ పూర్తయింది. కెమేరా బ్యాగ్ మినహా బట్టలున్న బ్యాగు, కెమేరా ట్రైపాడ్ చెకిన్ లగేజిలో వెళ్లిపోయాయి. బట్టల బ్యాగ్ రిటర్న్ ఇచ్చినా, ఇవ్వకపోయినా శ్రీనగర్ లో కొనుక్కోవచ్చు ముందు దిగిపో అన్న ఆదేశాలతో ప్రభు విమానం దిగేందుకు ప్రయత్నించగా ముందు ఎయిర్‌లైన్ సిబ్బంది ఏమాత్రం అంగీకరించలేదు. తాను మీడియా ప్రతినిధినని ఐడెంటిటీ కార్డు చూపించి, ఏ సందర్భంలో దిగాల్సి వస్తుందో వివరించాక, అదే సమాచారాన్ని గ్రౌండ్ స్టాఫ్ కి చెప్పి, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తించే సీఐఎస్ఎఫ్‌కు, జమ్ము-కాశ్మీర్ పోలీసు విభాగానికి సమాచారం ఇచ్చి కిందకు దింపారు. వారంతా ఒక్కొక్కరుగా సవాలక్షా ప్రశ్నలు సంధించారు. వారి భయం వారిది. ఉగ్రవాదులు ఏ రూపంలోనైనా రావొచ్చు. ప్రయాణికుడి రూపంలో విమానం ఎక్కి అందులో ఏదైనా బాంబు పెట్టి దిగిపోవచ్చు. అందుకే గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ప్రభు దగ్గరున్న అన్ని రకాల ఐడీ కార్డుల ఫొటో కాపీలు తీసుకున్నారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యే వరకు బయటకు వదిలేది లేదు అని చెప్పారు. ఈలోపు ఎయిర్‌లైన్ గ్రౌండ్ స్టాఫ్ ప్రభుకు చెందిన బట్టల బ్యాగ్, ట్రైపాడ్ తీసుకొచ్చి అందించారు. గంట ప్రయాణం అనంతరం విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యే వరకు ప్రభుకు వివిధ విభాగాల ఇంటరాగేషన్ జరిగింది. ఆ తర్వాత బయటకు వదిలేయడంతో ప్రభు హుటాహుటిన టీవీ9 భారత్‌వర్ష్ (అప్పటికి ఛానెల్ ఇంకా లాంచ్ అవలేదు) రిపోర్టర్‌తో కలిసి ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి మరోవైపు నుంచి చేరుకున్నాడు. ఎన్‌కౌంటర్ కారణంగా సగం ఊరిని ఖాళీ చేయించడంతో ఊళ్లో వాళ్లంతా ఆ మార్గంలో ఉన్నారు. మా భారత్‌వర్ష్ రిపోర్టర్ స్థానిక కశ్మీరీ అయినప్పటికీ, అతణ్ణి నిలువరించి బెదిరించి ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. మీడియా అంతా ఆర్మీకి మద్ధతుగా ఉంటుందని, కశ్మీరీల గొంతు వినిపించదు అని ఊరి జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అప్పటికే అక్కడున్న మరొక స్థానిక విలేకరి వారికి సర్దిచెప్పడంతో ప్రభు కెమేరా తీసి షూటింగ్ చేయడం సాధ్యపడింది. అక్కడికి కొన్ని బుల్లెట్లు, ఊరి జనం అటువైపుగా రాకుండా నియంత్రించేందుకు పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్స్ వచ్చి పడ్డాయి. వాటన్నింటినీ ప్రభు తన కెమేరాలో చిత్రీకరించాడు.
మేం అప్పటికే రెండో రౌండ్ ఎన్‌కౌంటర్ దృశ్యాలు చిత్రీకరించి వాటిని పంపించడం కోసం హైవే మీదకొచ్చాం. అప్పటికి ఉదయం నుంచి ఏమీ తినలేదన్న స్పృహ కూడా మాకు లేదు. తిందామన్నా హైవే మీద ఏమీ దొరకడం లేదు. ఓ మెకానిక్ షాప్ పక్కన బడ్డీ కొట్టులో బ్రెడ్ పకోడా కనిపించింది. కానీ స్పాంజ్‌లా ఉండే బ్రెడ్ ముక్కను శనగ పిండిలో ముంచి మరిగే నూనెలో వేయించే ఆ వంటకం అంటేనే నాకు చాలా భయం. ఎందుకంటే దాన్ని గట్టిగా పిండింతే రెండు కూరలకు సరిపడా నూనె బయటికొస్తుంది. కానీ అతికష్టం మీద సగం ముక్క తిని మళ్లీ స్పాట్‌కు పరుగులు తీశాం. ఎన్‌కౌంటర్ చివరి దశకు చేరుకుంది. ముగ్గురు ఉగ్రవాదుల్లో అప్పటికే ఇద్దరు హతమయ్యారు. ఇంకొక్కడు లేదా ఇద్దరు ఉండొచ్చన్న అనుమానంతో కాల్పులు కొనసాగుతున్నాయి. మా మిత్రుడు మెహరాజ్ అహ్మద్ ఫోన్ చేసి జాగ్రత్తలు చెబుతున్నాడు. “ఎన్‌కౌంటర్ ముగిసేలోగా ఆ ప్రాంతం ఖాళీ చేయాలి.. లేదంటే స్థానికుల నుంచి చాలా ప్రమాదం” అని కాస్త గట్టిగానే చెప్పాడు. అందుకు తగ్గట్టే మేం హైవే నుంచి ఎన్‌కౌంటర్ స్పాట్‌కు వెళ్తుంటే దారి పొడవునా జనం పోగై కనిపిస్తున్నారు. మేం చేరుకునే సరికి మూడో ఉగ్రవాదిని కూడా హతమార్చారని తెలిసింది. ఇల్లు తగలబడుతూ పెద్ద ఎత్తున మంటలు కనిపిస్తున్నాయి. వెంటనే ఆ పరిస్థితిని కెమెరాలో రికార్డు చేసుకుని అక్కణ్ణుంచి బయటపడ్డాం. దారి మధ్యలో యువకులు కారును ఆపారు. మా డ్రైవర్‌ను ఆపకుండా ముందుకు పోనీయమని చెబుతున్నా అతను వినలేదు. అప్పటికే మా కెమేరా యూనిట్ ఏదీ కనిపించకుండా కార్ డిక్కీలో భద్రంగా పెట్టేశాం. మా మీడియా ఐడీ కార్డులు దాచి పెట్టాం. కార్ డ్రైవర్ కశ్మీరీ భాషలో యువకులకు సర్ది చెప్పాడు. డ్రైఫ్రూట్ వ్యాపారులని, హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పినట్టు అర్థమైంది. క్రాస్ చెకింగ్ కోసం మమ్మల్ని ప్రశ్నిస్తారేమోనని భయపడ్డాం. కానీ అదేమీ లేకుండానే వదిలేశారు. తర్వాత మా డ్రైవర్‌ని అడిగితే అప్పుడు చెప్పాడు “కార్ ఆపకపోతే రాళ్ల వర్షం కురిసేది. కారు పాడవడం మాట పక్కనపెడితే ఏం జరిగేదో కూడా ఊహించలేం” అని చెప్పాడు. హమ్మయ్య.. మొత్తానికి ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డాం అని ఊపిరి పీల్చుకుని నేరుగా గెస్ట్ హౌజ్ చేరుకున్నాం. అక్కడే రాత్రికి భోజనాలు ఆర్డర్ చేసి ఉదయం నుంచి మాకు తెలీకుండా చేసిన ఉపవాసాన్ని ముగించాం.
Contd.. తరువాతి భాగం మాట జారితే.. అంతే సంగతులు