పోలవరానికి జగన్.. ఏపీ ఇక సస్య శ్యామలం ?

ఏపీని సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశించిన జాతీయ ప్రాజెక్టు..పోలవరంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను అధికారులతో సమీక్షించిన ఆయన.. నేరుగా ఈ ప్రాజెక్టు సందర్శనకు నడుం కట్టారు. అసలు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే పోలవరం పనుల మీద జగన్ ఫోకస్ పెట్టడం విశేషం. అంతకు ముందు మూడు సార్లు ఆయన తన పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాజెక్టును సందర్శించిన నేపథ్యంలో దీనిపై ఆయనకు అప్పుడే ఒక అవగాహన ఏర్పడింది. భూ నిర్వాసితులతో మాట్లాడడం, వారికి పరిహారం చెల్లింపు, ఇదివరకటి టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులపై చేసిన సమీక్షలు.. తదితరాలను ఆయన నాడే వైసీపీ అధినేతగా అన్నింటినీ ఆకళింపు చేసుకున్నారు. ఇక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి సిఎం అయ్యాక, కాక ముందు కూడా జగన్ ఈ ప్రాజెక్టు విషయంలో చూపిన శ్రధ్ధ అంతాఇంతా కాదు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయక ముందే జగన్.. మే 26 న ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయి.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు. అనంతరం మే 30 న ప్రమాణ స్వీకరణానంతరం.. ఈ నెల 3 న శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పైగా కేంద్రం నుంచి నిధుల విడుదలకు మార్గం సుగమం చేసేందుకు జలవనరుల శాఖ ప్రినిసిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ను ఢిల్లీకి పంపారు. ఇంతే కాదు.. ఈ నెల 15 న ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలోనూ జగన్ పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రాజెక్టు పనులపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ 2011 లో జారీ చేసిన పనుల నిలిపివేత ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు.

ఏపీ రూపు రేఖలు మార్చివేసే పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన 1941 నుంచే తెరపైకి వచ్చింది. 2005 లో దివంగత సిఎం వైఎస్. రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఆయన ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 5,135.87 కోట్లు ఖర్చయ్యాయి. ఈ ప్రాజెక్టు స్పిల్ వే కాంక్రీట్ పనులు 2016 డిసెంబరు 30 న ప్రారంభం కాగా.. గత ఏడాది డిసెంబరు 24 న గేట్లు ఏర్పాటు చేశారు. ఎర్త్, రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం 2017 ఫిబ్రవరి 1 న మొదలయింది. 2018 లో అప్పటి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు 9 వేల కోట్లు కేటాయించింది. అదే ఏడాది జూన్ లో కేంద్రం రూ. 14 వేల మంజూరుకు అంగీకరించింది. ఆ సంవత్సరమే అదే నెల నాటికి రూ. 13 వేల కోట్లను వ్యయం చేశారు. అటు-అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డ్యాం, స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. ఇక వీటితో బాటు హెడ్ వర్క్స్, కుడి, ఎడమ కాలువల అనుసంధానాలు, నేవిగేషన్ కెనాల్, పవర్ ప్రాజెక్ట్, భూసేకరణ నిర్వాసితుల పునరావాసం తదితరాలపై జగన్ అధికారులకు దిశా నిర్దేశం చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *