Andhra Pradesh: తప్పు చేయడం.. తప్పించుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేయడం.. ఆ తర్వాత దొరికిపోవడం షరా మామూలే. కాస్త లేటయితే కావొచ్చు.. కానీ చట్టానికి ఎవరైనా చిక్కాల్సిందే. శిక్ష అనుభవించాల్సిందే. అయితే విజయవాడలో వ్యాపారి షేక్ అస్లాం హత్య కేసులో నిందితుడు రిలీజ్ చేసిన వీడియో.. సంచలనంగా మారింది. అంతేకాదూ.. వ్యవస్థల పనితీరును ఎండగట్టింది. వివరాల్లోకెళితే.. విజయవాడకు చెందిన షేక్ అస్లాం, నసీమా దంపతులు. కానీ, నసీమా అన్వర్‌కి ప్రేమ పేరుతో దగ్గరైంది. చాలా రోజులు వీరి మధ్య రిలేషన్ నడిచింది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 15న అస్లాం చనిపోయాడు. ఓ వైపు హార్ట్ ఎటాక్ అనుమానాలు.. మరోవైపు పక్కా హత్యేనన్న కుటుంబసభ్యుల ఆరోపణలతో కేసు నమోదైంది. జనవరి 20న రీ పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు.
అయితే ఈ మధ్య అన్వర్ సెల్ఫీ వీడియో తెరపైకి రావడం కలకలం రేపింది. అస్లాం చనిపోయి దాదాపు 8 నెలలైంది. ఉన్నట్లుండి సీన్‌లోకొచ్చిన అన్వర్.. ‘ప్రామిస్ గా చెప్తున్నాను అస్లాంను చంపింది నేనే’ అంటూ వీడియోలో అంగీకరించాడు. అస్లాం భార్య నసీమాతో కలిసి అతన్ని ఎలా చంపారో కూడా రివీల్ చేశాడు అన్వర్. అంతేకాదు.. నేరం చేశాక ఎవరైనా దొరికిపోతారు. కానీ వారెందుకు దొరకలేదో కూడా వివరించాడు అన్వర్.
ఇలా ఒక నేరస్తుడు తాను చేసిన నేరాన్ని బయటపెట్టేదాకా మ్యాటర్ తెలియలేదంటే తప్పు ఎక్కడ జరిగింది? పోలీసులు అస్లాం మర్డర్‌ని లైట్‌గా తీసుకున్నారా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మెడికల్ పరిభాషలో పరీక్షలు నిర్వహించకపోవడం కారణంగానే డ్రగ్ విషయం బయటకు రాలేదని స్పష్టమవుతోంది. ఫైనల్‌గా అస్లాం రెండో భార్య కరిమున్నీసా కంప్లైంట్ ఆధారంగా ఖననం చేసిన డెడ్‌బాడీకి అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఎమ్మార్వో సమక్షంలో వీడియోగ్రఫీ కూడా చేశారు. డాక్టర్లు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారన్నది కీలకంగా మారింది.
మరి అన్వర్ చెప్పిన దాంట్లో నిజమెంత? ఆ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశాడు? రిలీజ్ చేయడం వెనుక మతలబేంటి? చెప్పినట్టు అలాగే చంపేశారా? ఇంకేమైనా ట్విస్ట్‌లు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి నసీమా ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చింది. తాను కటకటాలెక్కిస్తుంటే ఇద్దరు పిల్లలు మాత్రం అనాథలుగా మారారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..