జననాయకుడు జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిలో కూటమినేతల కుట్ర ఉందని ఆరోపించారు పోతిన మహేష్. ఇటీవల జనసేనలో ఉండి సీటు ఆశించి భంగపడ్డ మహేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ తరుణంలో సీఎం జగన్పై జరిగిన దాడి గురించి స్పందించారు. ఈ కుట్రలో బలమైన నాయకులు ఉన్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇందులో పెద్దల హస్తంతో పాటు చాలా పెద్ద కుట్ర దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. సీఎం జగన్ ప్రాణానికి హాని ఉందనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ నగరంలో ప్రవేశించిన మేమంతా సిద్దం బస్సు యాత్రకు మహిళలు, యువత, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలకి ఉన్న సంతృప్తి ఆనందానికి ఇదే నిదర్శనమని ఈ సందర్భంగా కొనియాడారు. సీఎం జగన్కు వస్తున్న అపూర్వ స్పందన చూసి ఓర్వలేకే కుట్ర పన్నారని ఆరోపించారు. కూటమి నేతలకు ప్రజాస్పందన కరువైందని ఎద్దేవా చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్లు కేంద్రానికి వెంటనే నివేదిక పంపాలని కోరారు. దాడి చేసిన వారిపైనే కాకుండా కుట్రలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాళ్ల దాడి ఘటన నేపథ్యంలో సీఎం జగన్ భద్రత పెంచాలని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..