బాబు కేబినెట్‌లో దక్కని చోటు.. పగలు సెగలు రేగే పల్నాడుకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిందా..?

పగలు సెగలు రేగే పల్నాడుకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిందా..? చంద్రబాబు నాయుడు మంత్రి మండలిలో చోటు దక్కకపోవడం ఏం సూచిస్తోంది..? గత ప్రభుత్వంలోలాగే రెండున్నరేళ్ల పాటు పల్నాడును పక్కన పెట్టేశారా..? ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత కూడా దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన పల్నాడు ప్రస్తుతం తన పొలిటికల్ పవర్ కోల్పోయిందన్న ప్రచారం జరుగుతోంది.

బాబు కేబినెట్‌లో దక్కని చోటు.. పగలు సెగలు రేగే పల్నాడుకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిందా..?
CM Chandrababu Naidu
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 16, 2024 | 8:12 PM

పగలు సెగలు రేగే పల్నాడుకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిందా..? చంద్రబాబు నాయుడు మంత్రి మండలిలో చోటు దక్కకపోవడం ఏం సూచిస్తోంది..? గత ప్రభుత్వంలోలాగే రెండున్నరేళ్ల పాటు పల్నాడును పక్కన పెట్టేశారా..? ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత కూడా దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన పల్నాడు ప్రస్తుతం తన పొలిటికల్ పవర్ కోల్పోయిందన్న ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడుది ప్రత్యేక స్థానం. చారిత్రక నేపథ్యం కలిగిన పల్నాడు అభివృద్దిలో వెనుక పడినా రాజకీయ ప్రాధాన్యతలో మాత్రం ముందంజలో ఉండేది. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరూ నేతలు కాసు బ్రహ్మానంద రెడ్డి, భవనం వెంకట్రామ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కాగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కోడెల శివ ప్రసాద్ ముఖ్య నేతగా ఎదిగారు. కోడెలకు పోటీగా కాసు క్రిష్ణారెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీరిద్దరిలో ఎవరో ఒకరు మంత్రి మండలిలో ఉండేవారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004, 2009 లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన సమయంలో కాసుకు మంత్రి పదవి దక్కింది. ఇక 2014లో రాష్ట్ర విభజన తర్వాత కోడెల ఏకంగా శాసన సభ స్పీకరే అయ్యారు. కోడెలతో పాటు పల్నాడు ప్రాంతానికే చెందిన ప్రత్తిపాటి పుల్లారావుకు మంత్రి పదవి దక్కింది. అప్పటి వరకూ పల్నాడు నేతల హవా కొనసాగింది. 2019లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ పల్నాడు నేతలను పక్కనే పెట్టేశారు. తనకు నమ్మినబంటు పిన్నెల్లి కూడా మంత్రి మండలిలో చోటు ఇవ్వలేదు. ఇక అంబటి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. పల్నాడులోని ఏడు అసెంబ్లీ స్తానాల్లో విజయం సాధించిన మంత్రి మండలిలో మాత్రం జగన్ అవకాశం కల్పించకపోవడంతో నేతలు అంసతృప్తికి లోనయ్యారు.

అయితే రెండోసారి చేసిన మంత్రి వర్గ విస్తరణలో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరూ నేతలు కేబినెట్‌లో చోటు దక్కించుకోవడంతో పల్నాడు ప్రాంతం తిరిగి ప్రాధాన్యతను సంతరించుకుంది. అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రి కాగా, విడదల రజిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. అయితే గత నెలలో జరిగిన ఎన్నిల్లో పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసిపి అభ్యర్ధులు ఓడిపోయారు. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లోనే అనుభవం ఉన్న నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని, జివిఎస్ ఆంజినేయులు వంటి నేతలు గెలుపొందారు. దీంతో వీరిలో ఎవరో ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే వీరందరిని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారు. దీంతో గత ప్రభుత్వంలోలానే పల్నాడు తన ప్రాంత ప్రాముఖ్యతను కోల్పోయినట్లు స్థానికులు భావిస్తున్నారు.

ఎన్నికల సమయంలో చెలరేగిన హింసతో దేశ వ్యాప్తంగా పల్నాడు పేరు మారుమ్రోగింది. అయితే ఎన్నికల సంఘం, పోలీసులు కఠిన చర్యలు తీసుకొని పరిస్థితులు చక్కదిద్దారు. వర్గ రాజకీయాలకు పేరుగాంచిన పల్నాడులో ప్రధాన పార్టీలు ముఖ్య నేతలను పక్కన పెట్టడం నేతలకు ఇబ్బందికరంగానే మారింది. అయితే నేతలు వచ్చే రెండేళ్ల తర్వాతైన తమ ప్రాంతానికి తమకు సరైన గుర్తింపు లభిస్తుందన్న ఆశతో ఉన్నారు..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles