
మురసు తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మూడు రోజులుగా కుండపోత వానలు కుమ్మేస్తున్నాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పెదనందిపాడు సమీపంలో నల్లమడ వాగు తీవ్ర రూపం దాల్చింది. నల్లమడ వాగు, నక్క వాగుకు గండ్లు పడ్డాయి. దీంతో.. పెదనందిపాడు, నాగులపాడు, కాకుమాను మండలంలోని కొమ్మూరు, గార్లపాడు గ్రామాలను వరద చుట్టుముట్టింది. భారీ వర్షాలతో రోడ్లు జలమయం అయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఉభయగోదావరి జిల్లాలను మురసు తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడులో చెరువుకు గండిపడటంతో వరద రోడ్డుపైకి పోటెత్తింది. భీమవరం పట్టణం జలమయం అయింది. తుఫాన్ దెబ్బకు వేల ఎకరాల్లో పంటల పొలాలు నీట మునిగాయి. గోపాలపురంలో పాపమ్మచెరువుకు వరద పోటెత్తింది. వరద ప్రవాహానికి కార్లు, బైకులు, పశువులు కొట్టుకుపోయాయి. ఇళ్లలో నుంచి వరద ప్రవహిస్తుండటంతో జనం ఇళ్లపైకెక్కి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
నల్లజర్ల-తాడేపల్లిగూడెంలో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. నల్లజర్ల-తాడేపల్లిగూడెం రోడ్డు జలమయం అయింది. బుట్టాయిగూడెం మండలం విప్పలపాడు హైవే పై నుంచి వరద భారీగా పోటెత్తుతోంది. వరద ప్రవాహం ధాటికి హైవే బ్రిడ్జి సెంట్రింగ్ కొట్టుకుపోయింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాపైనా వరుస తుఫాన్లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అర్నబ్ బీభత్సం నుంచి కోలుకోక ముందే.. మురసు తుఫాన్ మరింత దెబ్బ తీస్తోంది. ఎన్టీఆర్ జిల్లా వినగడప–తోటమూల మధ్యలోని కట్టలేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో.. 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు నేలవాలాయి. చేతికొచ్చిన పంటలు నేలపాలు అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్లలో తుఫాన్ నష్టాన్ని పరిశీలించారు. ఆ తర్వాత.. తుఫాన్ పరిస్థితులపై ఆర్టీజీఎస్లో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులను ఆరా తీశారు. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో మరింత వరద వచ్చే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే.. ముంపు ప్రాంతాలను త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయడంతోపాటు.. రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. మొత్తంగా.. వరుస తుఫాన్లు ఏపీని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి.