
పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాల్చుతున్నాయి. లేటెస్ట్గా ఏపీలో మరో భారీ పెట్టుబడికి లైన్ క్లియర్ అయ్యింది. 1.27 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్రంలో భారీ రిఫైనరీని భారత్ పెట్రోలియం నిర్మించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని రామాయపట్నంలో భారీ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్టు భారత్ పెట్రోలియం బోర్డు- స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ-సెబీకి లేఖ రాసింది. సుమారు 1.27 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టును నిర్మిస్తామని బీపీసీఎల్ ప్రకటించింది. బీపీసీఎల్ అనుబంధ సంస్థ WOS ద్వారా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారు. ఈ కాంప్లెక్స్‌కు ఏటా 9 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడిచమురు ప్రాసెసింగ్ సామర్థ్యంతో పాటు, 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఇథిలీన్ క్రాకర్ యూనిట్ ఉంటుంది. మొత్తం 10.5 మిలియన్ MMTPA సామర్థ్యంతో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టును 2032 జులై నాటికి పూర్తి చేసి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అలాగే అనుబంధ సంస్థలో 44,330 కోట్ల వరకు ఈక్విటీ పెట్టుబడులు పెట్టేందుకు కూడా బీపీసీఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ, ఇతర నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. ప్రస్తుతం బీపీసీఎల్‌కు 35.3 MMTPA రిఫైనింగ్ సామర్థ్యం ఉండగా, ఈ కొత్త ప్రాజెక్టుతో మరో 9 MMTPA సామర్థ్యం అదనంగా తోడవుతుంది. దేశంలో పెరుగుతున్న ఇంధన, పెట్రోకెమికల్ అవసరాలను తీర్చడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ భారీ ప్రాజెక్టు రాకతో ఆంధ్రప్రదేశ్‌లో అనుబంధ కెమికల్, పాలిమర్ పరిశ్రమల అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు ఊతమివ్వనుంది.
రామాయపట్నంలో అత్యాధునిక రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ ఆమోదం తెలపడంపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. 9 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ రిఫైనరీ.. దేశ ఇంధన భద్రతను, శుద్ధి సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి అవకాశాలు, సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.