Andhra Pradesh: యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి.. విచారించగా పోలీసుల మైండ్ బ్లాంక్..!

Andhra Pradesh: విధి కూడా చాలా విచిత్రమైనది. ఓ దొంగ.. దొంగతనం చేసుకుని వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దొంగతనం..

Andhra Pradesh: యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి.. విచారించగా పోలీసుల మైండ్ బ్లాంక్..!
Man Died
Follow us

|

Updated on: Jul 02, 2022 | 8:28 PM

Andhra Pradesh: విధి కూడా చాలా విచిత్రమైనది. ఓ దొంగ.. దొంగతనం చేసుకుని వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దొంగతనం చేసిన స్కూటీతో.. ఆగి ఉన్న లారీని ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. అతని దగ్గర ఉన్న మొబైల్ మోగడంతో.. కాల్ లిఫ్ట్ చేసిన పోలీసులకు.. మరో షాక్ తగిలింది. మొబైల్ కూడా దొంగతనం చేసిందేనని ఆ యజమాని కాల్ చేయడంతో తేలింది. అప్పటివరకు గుర్తుతెలియని వ్యక్తిగా భావిస్తున్న పోలీసులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి దొంగగా నిర్ధారించుకున్నారు. అయితే.. ఆ దొంగ ఎవరు..? పేరు ఊరు ఏంటి అనేది మాత్రం ఆధారాలు లభించలేదు. దీంతో మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచి మృతుడి వివరాల కోసం ఆరాతీస్తున్నారు పోలీసులు.

వివరాల్లోకెళితే.. అనకాపల్లి జిల్లా లంకెలపాలెం జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి వున్న లారీని డీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అతని దగ్గర కనీస ఆధారాలు లేవు. అతని వద్ద ఉన్న మొబైల్ స్వాధీనం చేసుకోవడంతో.. ఆ మొబైల్ కు ఒక్కసారిగా కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసిన పోలీసులు.. అవతలి వ్యక్తి కోసం ఆరా తీశారు. దాంతో పోలీసులకు షాక్ తగిలినంత పని అయింది. ఎందుకంటే మృతదేహం వద్ద లభించిన మొబైల్ చోరీ చేసి తెచ్చినది. అదే సమయంలో తన స్కూటీ కూడా ఎవరో ఎత్తుకుపోయారని అవతల వ్యక్తి ఫోన్లో పోలీసులకు చెప్పాడు. దీంతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తిని పోలీసులు పిలిపించుకొని విచారించారు. మృతదేహాన్ని, మొబైల్‌ను, స్కూటీని చూపించారు. దీంతో ఆ స్కూటీ, మొబైల్ చోరీ చేసి తెచ్చినవని నిర్ధారించుకున్నారు పోలీసులు.

ఆశ్రయం ఇచ్చిన పాపానికి..! ప్రమాదం జరిగిన స్పాట్‌కు వచ్చిన వాళ్ళతో మృతుడు గురించి ఆరాతీసారు పోలీసులు.. వారి రిప్లై విని మరోసారి కంగు తిన్నారు. ఎందుకంటే.. రెండు రోజుల క్రితం విశాఖలో ఓ షిప్పింగ్ కార్యాలయం భవనంలో పని చేస్తున్న ఉద్యోగులు.. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని గుర్తించారు. ఏమైందని ప్రశ్నించే సరికి.. తనది తెలంగాణ ప్రాంతమని.. ఓ పని మీద విశాఖ వచ్చానని చెప్పుకొచ్చాడు. తన దగ్గరున్న నగదు పూర్తిగా అయిపోనందువల్ల.. భోజనం ఏర్పాటు చేయాలని కోరాడు. దీంతో ఆ ఉద్యోగి తన స్నేహితులు ఉంటున్న వన్ టౌన్ ప్రాంతానికి తీసుకెళ్లి.. మానవతా దృక్పథంతో అక్కడ షెల్టర్ ఏర్పాటు చేశాడు. భోజనం పెట్టి రాత్రికి అక్కడ బస ఏర్పాటు చేశాడు. ఉదయం లేచి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్లిపోయారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి కూడా అక్కడ నుంచి బయలుదేరాడు.

మరుసటి రోజు రాత్రి యధావిధిగా షిప్పింగ్ ఉద్యోగులు తాము ఉంటున్న ప్రాంతానికి వచ్చి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం లేచేసరికి.. అక్కడ పార్కు చేసి ఉన్న స్కూటీ.. రెండు మొబైల్ ఫోన్లో మాయమైనట్టు గుర్తించారు. దీంతో వన్ టౌన్ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. కట్ చేస్తే.. ఈరోజు ఉదయం లంకెలపాలెం జంక్షన్లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు పద్మనాభం పోలీసులు. మృతుడు ఎవరనే దానిపై విచారణ ప్రారంభించారు. అదే సమయంలో అతని వద్దనున్న మొబైల్ ను స్వాధీనం చేసుకునే సరికి.. మొబైల్ కు వచ్చిన కాల్ ఆధారంగా చనిపోయిన వ్యక్తి దొంగగా గుర్తించారు. బాధితులను పరవాడ పోలీసులు పిలిపించి మృతదేహాన్ని, స్కూటీ, మొబైల్ ను చూపించారు. ఆ ముందు రోజు తమ వద్ద ఆశ్రయం పొందిన వ్యక్తి, మృతి చెందిన వ్యక్తి ఒక్కరేనని.. స్కూటీ, మొబైల్స్ కూడా తమవేనని వాళ్లు చెప్పడంతో.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి దొంగగా గుర్తించారు పోలీసులు.

అతని వివరాలు అవేనా..?! అయితే.. స్కూటీ మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు తాను కార్తీక్ అని చెప్పుకొచ్చాడని.. తెలంగాణ ప్రాంతంలోని ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడుని చెప్పినట్టు వాళ్లు పోలీసులు వివరించారు. అయితే.. అందుకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా మృతుడి వద్ద లేకపోవడంతో పోలీసులు.. ఆ సమాచారం సరైనదని కూడా నిర్ధారించలేకపోతున్నారు. గుర్తుతెలియని వ్యక్తిగా ప్రాథమికంగా నిర్ధారించి.. మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురిలో భద్రపరిచారు. ఇది.. కనికరించి మానవ దృక్పథంతో ఆశ్రయం ఇచ్చిన పాపానికి.. వారి స్కూటీ మొబైల్స్ ని దొంగలించాడు ఆ వ్యక్తి. దొంగలించిన సొత్తుతో వెళ్తూ.. రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. – ఖాజా, టీవీ9 తెలుగు, వైజాగ్.