ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ అకస్మాత్తు హస్తిన పర్యటన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు కేంద్ర పెద్దలను కలవలేదని, మర్యాదపూర్వకంగా కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడానికి ముందు కాసేపు ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఉన్నారు. అక్కడి నుంచి అమిత్ షా నివాసానికి బయలుదేరే ముందు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పొడిపొడిగా సమాధానమిచ్చారు. సమావేశం ఎజెండా ఏంటన్నది ఆయన చెప్పలేదు. మొత్తమ్మీద సాయంత్రం గం. 6.30 సమయంలో అమిత్ షాతో సమావేశమైన పవన్ కళ్యాణ్, 15 నిమిషాల పాటు చర్చించి నేరుగా విమానాశ్రయానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ భేటీలో ఏం చర్చించారన్నది అటు పవన్ కళ్యాణ్ లేదా ఇటు అమిత్ షాకు తప్ప మరెవరికీ తెలియదు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
దేశ ఆర్థిక రాజధానిని కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అధికార, విపక్షాలకు కీలకంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో భారతీయ జనతా పార్టీ (BJP) సారథ్యంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (NDA) ఉంది. స్థానికంగా ‘మహాయుతి’ పేరుతో పిలుస్తున్న ఈ కూటమి గెలుపు కోసం ఎన్డీఏ మిత్రపక్షాల సహాయం తీసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. నవంబర్ 5 (మంగళవారం) సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్డీఏ మంత్రుల సమావేశంలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న ఢిల్లీలో కూటమి ఉమ్మడి ప్రచార వ్యూహాల గురించి చర్చించారు. దీనికి కొనసాగింపుగా బుధవారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకుని అమిత్ షా తో సమావేశం కావడంతో.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ సేవలు ఉపయోగించుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు సినీ రంగంలో తిరుగులేని ఆదరణ కల్గిన పవన్ కళ్యాణ్, తాజా ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తన పదునైన ప్రసంగాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆయన చేసిన ప్రసంగాలు తెలుగు నేలపైనే కాదు, తమిళనాట కూడా ప్రకంపనాలు సృష్టించాయి. తమిళంలోనూ అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం కల్గిన పవన్ కళ్యాణ్, అక్కడి అధికార ద్రవిడ మున్నేట్ర కళగం (DMK) పార్టీ పెద్దలను ఉద్దేశించి పరోక్షంగా చేసిన విమర్శలు విస్తృత చర్చకు దారితీశాయి. హిందూ జాతీయవాద భావజాలం కల్గిన శివసేన మాదిరిగానే జనసేన కూడా జాతీయవాదంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా నినాదాలు చేయడం కమల దళపతులకు ఉత్సాహాన్ని కల్గించాయి. తాము నేరుగా విస్తరించలేకపోతున్న రాష్ట్రాల్లో భావసారూప్యత కల్గిన పార్టీల ద్వారా పాగా వేయాలని చూస్తున్న కాషాయ నేతలకు పవన్ కళ్యాణ్ దక్షిణాదిన బలమైన హిందూ నేతగా కనిపించారు. సినీ ప్రపంచంలో తిరుగులేని క్రేజ్ కల్గిన పవన్ కళ్యాణ్, రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకోవడంతో ఆయనను ఒక ఆయుధంగా మలచుకోవాలని చూస్తున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో.. ముంబై కేంద్రంగా ఉన్న బాలీవుడ్ సినీ పరిశ్రమతో సంబంధాలతో పాటు ముంబై, పూణే సహా మహారాష్ట్రలో స్థిరపడిన తెలుగు సముదాయాలను ఆకట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రచారం ఉపయోగపడుతుందని కమలనాథులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరాఠీ భాషలోనూ మాట్లాడగలరని, తద్వారా ఆ రాష్ట్రంలో శివసేనకు జనసేనాని తోడైతే మహాయుతికి తిరుగు ఉండదని బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ అంశం గురించి చర్చించి పవన్ కళ్యాణ్‌ను ఒప్పించడం కోసమే అమిత్ షా ఆహ్వానం పంపి రప్పించారని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ ఇలా ఉంటే.. తెలుగు రాజకీయవర్గాల్లో మాత్రం మరోలా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై అసహనం వ్యక్తం చేస్తూ పీఠాపురంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర నాట తీవ్ర ప్రకంపనాలు సృష్టించాయి. రాష్ట్ర హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు, హోంశాఖను తాను తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందంటూ చేసిన హెచ్చరికలు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి రాజకీయాస్త్రాలుగా మారాయి. ఇది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన కూటమి సర్కారును ఇరకాటంలో పెట్టినట్టయింది. ఇలాంటి అంశాలను బహిరంగంగా వేదికలపై మాట్లాడేకంటే.. అంతర్గతంగా కూర్చుని మాట్లాడుకోవడమే ఉత్తమమని బీజేపీ అగ్రనాయకత్వం కూడా భావించినట్టుగా చర్చ జరుగుతోంది. జనసేనానికి ఆగ్రహం, అసహనం తెప్పించిన ఘటనలేంటో తెలుసుకుని, వాటిని ఎలా పరిష్కరించాలో సూచించడంతో పాటు తదుపరి ‘కూటమి’ ప్రభుత్వానికి ఇబ్బంది కలుగకుండా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్‌కు చెప్పడం కోసమే ఢిల్లీకి పిలిపించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటు ఢిల్లీలో, అటు ఏపీలో జరుగుతున్న చర్చలు, ఊహాగానాల సంగతెలా ఉన్నా… డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి రావడంతో అందరి దృష్టి ఈ పర్యటనపై పడింది. పైగా కమలదళంలో… కేంద్ర ప్రభుత్వంలో నెంబర్-2 గా ఉన్న అమిత్ షాతో సమావేశం కావడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫొటోలను ట్వీట్ చేశారు తప్ప సమావేశం సందర్భం ఏంటన్నది కూడా ప్రస్తావించలేదు. అధికారికంగా అటు బీజేపీ లేదా ఇటు జనసేన నుంచి ఒక ప్రకటన జారీ చేసే వరకు ఈ తరహా చర్చలు, ఊహాగానాలకు బ్రేకులు ఉండేలా లేవు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..