ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో వీరిద్దరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక, బీజేపీ ప్రతిపాదనపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటన వివరాలను చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకొచ్చినట్లు సమాచారం.. అంతే కాకుండా తాజా రాజకీయ పరిణామాలు సైతం ప్రస్తావనకు వచ్చాయి. కాకినాడలో రేషన్ బియ్యం మాఫియా పైనా సీఎం, డిప్యూటీ సీఎం చర్చించారు. ఇక సోషల్ మీడియాలో పోస్టులపై తీసుకుంటున్న చర్యలపైనా ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది..
వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన మూడు స్థానాల్లో.. ఎన్నికలు జరగనున్నాయి.. రేపటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్న తరుణంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడం ఆసక్తి రేపింది.. ఈ భేటీలో రాజ్యసభకు వెళ్లే వారి పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.. టీడీపీకి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిథ్యం లేదు. దీంతో ఈ ఉప ఎన్నిక ద్వారా పెద్దల సభలోకి మళ్లీ ఎంట్రీ అవ్వాలని భావిస్తోంది..
అయితే.. రాజ్యసభ రేసులో టీడీపీ నుంచి మాజీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, ఇక గుంటూరు ఎంపీ సీటును త్యాగం చేసిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.. జనసేన కూడా ఓ స్థానాన్ని అడుగుతున్నట్లు సమాచారం.. పొత్తు ధర్మంలో భాగంగా.. అనకాపల్లి లోక్ సభ సీటుని త్యాగం చేసిన మెగాబ్రదర్ నాగబాబు కూడా రేసులో ఉన్నారని సమాచారం.. దీంతో ఆయనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలన్న వాదన వినిపిస్తోంది. ఇక బీజేపీ కూడా మిత్రధర్మంగా తమకు ఒక సీటును ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆపార్టీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి రేసులో ఉన్నట్లు సమాచారం.. ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది..
రాజ్యసభకు డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు డిసెంబర్ 13. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనుంది ఎన్నికల సంఘం.. కాగా.. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.. ప్రస్తుతం వైసీపీ బలం 11 మాత్రమే. అందువల్ల ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచే అవకాశం లేదు. దీంతో మొత్తం రాజ్యసభ స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నాయి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..