
బంగాళాఖాతంలో వాయుగుండం ఉగ్రరూపం దాల్చింది. కళింగ పట్నానికి నైరుతి దిశలో అర్థరాత్రి తీవ్రవాయుగుండం తీరం దాటింది. గత అర్ధరాత్రి 11 గంటల తర్వాత తీవ్ర వాయుగుండం తీరాన్ని తాకింది.. తీరాన్ని తాకిన తర్వాత.. ఈ ప్రక్రియ 3 గంటల పాటు కొనసాగింది. కొన్ని గంటల అనంతరం తీవ్రవాయుగుండం తీరాన్ని దాటింది. తీరం దాటినప్పటికీ తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ గుర్తించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. భారీ వర్షాలతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉందని తెలిపింది. ఈనెల 27 వరకు సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు చేసింది.
కాగా.. తుఫాన్ తీరం దాటినప్పటికీ.. చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నేడు కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. అలాగే.. తెలంగాణలో కూడా మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో సెలవులు ప్రకటించారు.
అల్పపీడనం ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం నాగ్‌పూర్‌కు దారి మళ్లించారు. రాత్రి 8.45 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX 1373 .. భోగాపురం లో ల్యాండింగ్‌కు రెండుసార్లు ప్రయత్నించినా ప్రతికూల వాతావరణంతో విఫలం అయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విమానాన్ని నాగ్‌పూర్‌కు ఎయిర్‌లైన్స్ అధికారులు దారి మళ్లించారు. విమానంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. విమానంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఆయన కుమార్తె అనూష, పలువురు విశాఖ వైసీపీ నేతలు కూడా ఉన్నారు. భోగాపురంలో ల్యాండింగ్ సాధ్యం కాకపోవడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగింది.. చివరకు నాగ్‌పూర్ లో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు.