
పశువుల పెంపకంలో రైతులకు ఎదురయ్యే సాధారణ సమస్యలలో ఆవులు తమ పొదుగు పాలను తామే తాగేయడం (Self-Suckling) ఒకటి. ఈ అలవాటు వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా, పొదుగులో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. చాలామంది రైతులు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతూ పలు పద్ధతులు ప్రయత్నిస్తుంటారు.
కొన్ని ఆవులు మెడను బాగా వెనక్కి వంచి తమ పొదుగును చేరుకుని పాలు తాగేస్తాయి. దీనిని అడ్డుకునేందుకు రైతులు మెడ చుట్టూ కట్టెలు కట్టడం, ముట్టికి ప్రత్యేక నోస్ రింగ్‌లు పెట్టడం వంటి పద్ధతులు ఉపయోగిస్తారు. అయితే, కొన్ని తెలివైన ఆవులు ఇవి ఉన్నప్పటికీ తమ పాలను తాగేందుకు మార్గం కనుగొంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాటు రావడానికి ఒక్క కారణం మాత్రమే ఉండదు. పోషకాహార లోపం, ఖనిజాల కొరత, పాల ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఒత్తిడి , లేదా అలవాటుగా మారిపోవడం వంటి కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్, ఇతర మినరల్స్ లోపం ఉన్నప్పుడు కొన్ని ఆవుల్లో ఈ ప్రవర్తన కనిపించవచ్చు. అందుకే పశువైద్యుల సలహాతో మినరల్ మిక్చర్లు, సరైన పశుగ్రాసం ఇవ్వడం చాలా అవసరం. ఈ సమస్యను తగ్గించేందుకు రైతులు ఉపయోగించే మరో ప్రభావవంతమైన పద్ధతి గాలి నింపిన ట్యూబ్ లేదా ప్రత్యేక “నెక్ క్రేడిల్” ను ఆవు మెడ చుట్టూ అమర్చడం. ఇది ఆవు తన తలను పూర్తిగా వెనక్కి తిప్పకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా పొదుగును చేరుకోవడం కష్టమవుతుంది.
అంతేకాకుండా, రైతులు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని పశువైద్యులు సూచిస్తున్నారు. ఆవును సమయానికి పితకడం, పొదుగులో ఎక్కువసేపు పాలు నిల్వ ఉండకుండా చూడడం, సమతుల్యమైన ఆహారం, మినరల్ మిక్స్ ఇవ్వడం, ఒత్తిడి తగ్గించే విధంగా శుభ్రమైన వాతావరణం కల్పించడం, ఈ అలవాటు ఉన్న ఆవులను కొంతకాలం విడిగా ఉంచడం వంటివి చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ అలవాటు చాలా ఎక్కువైతే శస్త్రచికిత్స కూడా చేస్తారు. అయితే ఇది చివరి దశలో మాత్రమే పశువైద్యుల సూచనతో చేపడతారు. రైతులు ఇంటి చిట్కాలకే పరిమితం కాకుండా, సమస్య మొదలైన వెంటనే పశువైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. సరైన పోషకాహారం, శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే ఆవులు తమ పాలను తామే తాగే సమస్యను చాలావరకు నియంత్రించవచ్చు.