Chicken Prices: కార్తీక మాసం ఎఫెక్ట్.. ఒక్కసారిగా పడిపోయిన చికెన్, గుడ్ల ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?

కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కిలోపై రూ.50 వరకు దిగొచ్చాయి. దీంతో మాంసాహార ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కోడి గ్రుడ్ల ధరలు కూడా పడిపోయాయి. అయితే వచ్చే నెలలో క్రిస్మస్ ఉండటంతో ధరలు పెరిగే ఛాన్సుంది.

Chicken Prices: కార్తీక మాసం ఎఫెక్ట్.. ఒక్కసారిగా పడిపోయిన చికెన్, గుడ్ల ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
Chicken Prices

Updated on: Nov 28, 2026 | 2:00 PM

తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం ప్రస్తుతం చికెన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కార్తీక మాసం దీక్షలు, పూజలు, అయ్యప్ప, శివమాల వ్రతాలు వంటివి మాంసాహార వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయి. ఫలితంగా చికెన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పడిపోవడంతో ధరలు భారీగా దిగొచ్చాయి. ఈ పరిస్థితి ఒకవైపు మాంసాహార ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తుండగా.. మరోవైపు పౌల్ట్రీ రైతులకు, వ్యాపారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత వారం వరకు కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.300 దాటిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో అదే చికెన్ అనేక ప్రాంతాల్లో రూ.250 లోపే లభిస్తోంది. కిలో చికెన్‌పై ఏకంగా రూ.50 తగ్గింది. చికెన్‌తో పాటు కోడిగ్రుడ్ల ధరలు కూడా పతనమయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్, గుడ్డు ధరలు

మార్కెట్ రేటు ప్రకారం హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.252గా ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రేటు రూ.223 వద్ద కొనసాగుతోంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ రూ.144కు లభిస్తోండగా..ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ ధర రూ.117గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 12 కోడి గ్రుడ్ల డజన్ ధర రూ.74గా ఉంది. మొన్నటివరకు డజన్ కోడి గ్రుడ్ల ధర రూ.90గా ఉండగా.. ఇప్పుడు దిగొచ్చాయి. ఇక విజయవాడ జోన్‌ పరిధిలో కూడా చికెన్ ధరలు పడిపోయాయి. మొన్నటివరకు కిలో చికెన్ రూ.300 వరకు పలకగా.. ఇప్పుడు కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.249గా ఉంది. డ్రస్స్‌డ్ చికెన్ రూ.220కే విక్రయిస్తుండగా.. రిటైల్ లైవ్ బర్డ్ రూ.142, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.115కు లభిస్తోంది. ఇక విజయవాడ జోన్‌లో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.80గా కొనసాగుతోంది. కార్తీక మాసం రావడంతో చాలామంది నాన్ వెజ్‌కు దూరంగా ఉంటారు. దీంతో కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గడం, సరఫరా ఎక్కువగా ఉండటంతో ధరలు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

వచ్చే నెలలో పెరుగుతాయా..?

అయితే వచ్చే నెలలో క్రిస్మస్ పండుగ రానుంది. అలాగే కార్తీక మాసం కూడా ముగియనుంది. ఈ కారణాలతో వచ్చే నెలలో చికెన్ ధరలు పెరగవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా చికెన్‌కు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దీంతో వచ్చే నెలలో చికెన్ ధరలు పెరిగే అవకాశముంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us