Women Missing Cases: మహిళలు, బాలికల అదృశ్యం అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. వాలంటీర్లపై ఆరోపణల సందర్భంలో పవన్ కళ్యాణ్ వెల్లడించిన వివరాలపై రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన అంశాలతో పవన్ కళ్యాణ్ మరోమారు తన ఆరోపణలను సమర్థించుకుంటే, దీన్ని ప్రభుత్వం సహా పోలీసు యంత్రాంగం తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. అవగాహన లేకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు అంశంపై స్పందిస్తూ స్వయంగా డీజీపీ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రకు చెందిన ఎన్‌సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఫౌజియా ఖాన్ బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రశ్న వేశారు. గడచిన ఆరు నెలల కాలంలో మహారాష్ట్రంలో 3,594 మంది బాలికలు, మహిళలు అదృశ్యం అయ్యారని, రాష్ట్రాలవారీగా, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా వివరాలు ఇవ్వాలని, అలాగే వీటి నివారణకు తీసుకుంటున్న చర్యలను తెలపాల్సిందిగా ఆయన తన ప్రశ్నల్లో కోరారు. దీనికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా పూర్తి వివరాలతో సమాధానం ఇచ్చారు. 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై నమోదైన వివరాలను వెల్లడించారు. 18 ఏళ్లలోపు బాలికలు, 18 ఏళ్లకు పైబడ్డ మహిళల అదృశ్యంపై గణాంకాలను ఆయన సభకు తెలిపారు.
ఈ వివరాల ప్రకారం 2021 సంవత్సరంలో మొత్తంగా 3.75 లక్షల మంది బాలికలు, మహిళలు అదృశ్యమైనట్టుగా నేషనల్ క్రైం రికార్డ్స్ పేర్కొంది. ఇందులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ప.బెంగాల్ రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ 10వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉంది.
నేషన్ క్రైం రికార్డ్స్ బ్యూరోకు ప్రత్యేక మైన వ్యవస్థ అంటూ ఏమీ ఉండదు. ఆయా రాష్ట్రాలు పోలీసు శాఖలు ఇచ్చే సమాచారాన్నే డేటాగా స్వీకరిస్తారు. ప్రతిరాష్ట్రంలో కూడా స్టేట్ క్కైం రికార్డ్స్ బ్యూరో అని, జిల్లాల్లో కూడా డిస్ట్రిక్ క్రైం బ్యూరో రికార్డ్స్ అని, ఉంటాయి. ఆయా పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు, విచారణ, శిక్షలపై ఎప్పటికప్పుడు డేటాను అప్‌లోడ్ చేస్తుంటాయి. అంటే వివరాల నమోదు అన్నది ఆయా రాష్ట్రాలు పోలీసు శాఖల చేతిలో ఉంటుంది. ప్రోయాక్టివ్‌గా పనిచేసే పోలీసు వ్యవస్థలు ఉన్న రాష్ట్రాల్లో సహజంగానే కేసుల నమోదు, విచారణ, శిక్షలు సంఖ్య పెరుగుతుంది. దీని అర్థం ఈ గణాంకాల ఆధారంగా ఆయా పోలీసు శాఖల పనితీరును అంచనా వేయడం సరికాదన్నది సీనియర్ పోలీసు అధికారులు చెప్తున్న మాట.
గణాంకాలు చూస్తే.. సహజంగానే మన సమాజంపై భయం పుట్టే పరిస్థితి. కాని వాస్తవంలో అలా ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పోలీసు యంత్రాంగం పనితీరు బాగుంటుందని, మహిళలు, బాలికల రక్షణ విషయాల్లో దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో పోలీసు శాఖలు చురుగ్గానే ఉంటాయని ఉన్నతస్థాయి పోలీసు అధికారులు చెప్తున్నారు. సహజంగా పోలీసు స్టేషన్‌కు తమ అమ్మాయి కనిపించడంలేదని, లేదా మహిళలు కనిపించడంలేదని ఫిర్యాదు రాగానే, సున్నితమైన అంశంగా పరిగణించి పోలీసులు వెంటనే మిస్సింగ్ కేసులుగా నమోదుచేయడం రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ. ఎందుకంటే.. ఎదైనా జరగరానిది, జరిగితే… పోలీసులకు చెడ్డపేరు వస్తుందన్న కారణంతో వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేస్తారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీ సహాయం వారిని వెతికిపట్టి వారి వారి కుటుంబాలకు అప్పగిస్తారు. మన రాష్ట్రంలో ఇలాంటి కేసుల పరిష్కారాన్ని అత్యంత వేగంగా చేస్తారు. ఎక్కువ శాతం చదువుల వల్ల భయమో, ప్రేమ వ్యవహారాలో, కుటుంబ కలహాలో… దీనికి ప్రధాన కారణాలుగా ఉంటాయి. అంతమాత్రాన వీరంతా ఎప్పటికీ అదృశ్యమైన కేసులుగా చూడాల్సిన అవసరం లేదని పోలీసు అధికారుల వాదన.
రాజకీయ కారణాలతో ఈ గణంకాలను వాడుకోవడం మొదలుపెడితే, రేపు పోలీసుస్టేషన్లకు వచ్చే బాధితులకు నష్టం కలుగుతుందని, ఏదైనా జరిగితే వెంటనే రిపోర్ట్ చేసే వెసులుబాటు, అవకాశం ప్రజలకు ఉండాలని, పోలీసులు కూడా వాటిని తీసుకుని ముందుకు వెళ్లే పరిస్థితులు ఉండాలని పోలీసు అధికారులు అంటున్నారు.
సరైన దర్యాప్తు, సకాలంలో ఛార్జిషీట్లు, వేగంగా శిక్షలు వీటిని ప్రమాణాలుగా చూడలంటున్నారు పోలీసు అధికారులు. ఈ విషయంలో ఏపీ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే చాలా ముందంజలో ఉందని వారు చెప్తున్నారు.
రాష్ట్రంలో ఆచూకీ లభించనవారి జాబితా సంవత్సరాల వారీగా చూస్తే 2015లో 2,506 మంది, 2016లో 2990, 2017లో 1792, 2018లో 1542, 2019లో 1855, 2020లో 2236, 2021లో 2711 మంది ఉన్నట్టు ఎన్‌సీఆర్‌బీ వివరాలు చెప్తున్నాయి. ఇవికూడా గణాంకాలు సవరించుకోవాల్సిన అవసర ఉందని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఒక ఏడాదిలో పరిష్కారం కాని కేసులు మరుసటి ఏడాదిలో పరిష్కారం అవుతాయని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. అలాగే చాలామంది మహిళలు తిరిగి ఇళ్లకు చేరుకున్నా పోలీసు స్టేషన్లకు సమాచారం ఇవ్వని సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసకుంటే… 2015 నుంచి 2018 వరకూ 18 ఏళ్లలోపు బాలికలు ఇప్పటివరకూ ఆచూకీ తెలియని వారి సంఖ్య 258 మంది ఉన్నారు. అలాగే 2019 నుంచి 2021 వరకూ ఆచూకీ తెలియని వారి సంఖ్య 469 మంది ఉన్నారు.
అలాగే 18 ఏళ్లకు పైబడ్డ వారి వయస్సులో ఆచూకీ తెలియని వారి సంఖ్య 2015 నుంచి 2018 వరకూ 18 ఏళ్ల పైబడ్డ మహిళల్లో ఆచూకీ తెలియని వారి సంఖ్య 1284 మంది ఉన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..