ఆ రెండు జాతీయపార్టీలు ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్ చేశాయి. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. క్యాడర్‌ను పెంచుకోవడమే కాదు కొత్త లీడర్లను తయారు చేసుకుంటున్నాయి. పార్టీ పురోగతి కోసం బీజేపీ.. పునర్ వైభవం కోసం కాంగ్రెస్ చెమటోడుస్తున్నాయి. వాస్తవానికి, తెలంగాణలో జాతీయ పార్టీలు మాంచి ఊపు మీదున్నాయి. కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోగా.. బీజేపీ గతంలో కన్నా ఎక్కువ స్థానాలను గెలిచి దూకుడుగా వ్యవహరిస్తోంది. కానీ ఏపీలో ఈ రెండు పార్టీల పరిస్థితి అంతగా బాగాలేదు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ బీజేపీకి సొంత బలం లేదు. అటు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ముఖ్యనేతలు మౌనంతో క్యాడర్ చిన్నాభిన్నమైంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి.
ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు స్థానిక నాయకత్వం తీవ్రంగా కృషి చేస్తోంది . పార్టీ మెంబర్‌షిప్ డ్రైవ్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 25లక్షల మందికి సభ్యత్వాలు ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. 45 రోజులుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. నవంబర్ 15 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగనుంది.
ఏపీకి కేంద్రం అన్నిరకాలుగా అండగా ఉంటుందని.. ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తోందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ హైకమాండ్ స్థానిక నాయకత్వానికి సూచించింది. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులు, నిధుల విషయాలను ప్రతీ మీటింగ్‌లో ప్రస్తావిస్తున్నారు కమలనాథులు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా ఏపీలో పుంజుకోవాలని భావిస్తోంది బీజేపీ.
మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఏపీలో పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని యత్నిస్తోంది. ఏపీలో బలమైన నేతలు ఉన్నప్పటికీ వాళ్లంతా యాక్టివ్ మోడ్‌లో లేరు. దీంతో భారమంతా పీసీసీ చీఫ్ షర్మిలపైనే పడింది. పార్టీని జిల్లా, మండలస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు.
కూటమి ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్నారు షర్మిల. ప్రభుత్వ నిర్ణయాలపై బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. సామాన్యులపై భారం పడే ఏ నిర్ణయాన్ని సహించబోమంటున్నారు షర్మిల. విద్యుత్ చార్జీల పెంచితే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామంటున్నారు.
ప్రజా సమస్యలపై పోరాడుతూనే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం తీసుకొచ్చిన పథకాలను గుర్తు చేస్తున్నారు షర్మిల. పార్టీలో చేరికలపైనా ఫోకస్ చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల లోగా ఈ రెండు జాతీయ పార్టీలు ఎంతమేరకు పుంజుకుంటాయో చూడాలి మరి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..