ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డ్యూటీ..ఫారెస్ట్ సిబ్బంది

అసలే అడవిలో ఎర్రచందనం స్మగ్లర్ల దాడులతో ప్రాణాలకు తెగించి ఫారెస్ట్ సిబ్బంది విధులు నిర్వహించాల్సి వస్తోంది. మరో పక్క క్రూర మృగాల దాడులు. అయిన్నప్పటికీ తమకు సరైన రక్షణ ఆయుధాలు, రవాణా సదుపాయాలు కూడా లేకపోవడంతో..

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డ్యూటీ..ఫారెస్ట్ సిబ్బంది
Follow us

|

Updated on: Nov 05, 2020 | 7:34 PM

అసలే అడవిలో ఎర్రచందనం స్మగ్లర్ల దాడులతో ప్రాణాలకు తెగించి ఫారెస్ట్ సిబ్బంది విధులు నిర్వహించాల్సి వస్తోంది. మరో పక్క క్రూర మృగాల దాడులు. అయిన్నప్పటికీ తమకు సరైన రక్షణ ఆయుధాలు, రవాణా సదుపాయాలు కూడా లేకపోవడంతో కాళ్ళు ఈడ్చుకుంటూ విధులు నిర్వహిస్తూ.. మాకెక్కడ రక్షణ అంటూ ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ సిబ్బంది వాపోతున్నారు. దీనికి ఎలుగుబంటి దాడే నిదర్శనం అంటున్న ఫారెస్ట్ బీట్ వాచర్ బాబు, భాస్కర్ రెడ్డిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కడప జిల్లా పుల్లంపేట మండలంలోని శేషాచలం అడవుల్లో అటవీశాఖ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇంతలో శేషాచలం అడవిలోని బీడి బావి సమీపంలోని బేస్ క్యాంప్ వద్ద బుధవారం రాత్రి ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ బాబు పై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మరో వాచరు భాస్కర్ రెడ్డి మాత్రం స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. వీరిని ఫారెస్ట్ అధికారులు చికిత్స నిమిత్తం రాజపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రక్షణ ఆయుధాలు లేకుండా అడవిలో విధులు నిర్వహించాలంటే చాలా కష్టంగా ఉందంటూ గాయపడిన వాచర్ బాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ పక్క స్మగ్లర్ల దాడులు, మరో పక్క క్రూర మృగాల దాడులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డ్యూటీ చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా సరైన రక్షణ కల్పించే విధంగా విధులు రూపకల్పన చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం గాయపడ్డ ఇరువురు ఫారెస్ట్ వాచర్లు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. అయితే ఇరువురికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.