
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలపై ఉన్నఉపరితల ఆవర్తనం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు వీచే అవకాశం ఉండటంతోప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి జిల్లా రేణిగుంటలో 85.7మిమీ, ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 81.9మిమీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె 59.5మిమీ, బాపట్ల జిల్లా ఇడుపులపాడులో 57.9మిమీ, తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో 54.7మిమీ, తిరుపతి అర్బన్ లో 46.6మిమీ, కడప జిల్లా వీరపునాయునిపల్లెలో 45.8మిమీ, చిత్తూరు జిల్లా పలమనేరులో 44మిమీ, కొత్తకోటలో 41.8మిమీ, కోనసీమ జిల్లా మామిడికుదురులో 41.5మిమీ, పల్నాడు జిల్లా జొన్నలగడ్డలో 37మిమీ, నెల్లూరు జిల్లా అక్కంపేటలో 37మిమీ, పోలవరం జిల్లా వైరామవరంలో 36మిమీ, చిత్తూరు అర్బన్ లో 34.9మిమీ చొప్పున వర్షపాతం రికార్డైందని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
తెలంగాణలో కూడా రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశముంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు. వర్షాల క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పలు సూచనలు పాటించాలని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది.