ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. పశుగ్రాసం సాగుకు ఎకరాకు రూ.69 వేలకుపైగా సాయం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు సొంత భూముల్లో పశుగ్రాసం సాగు చేసే అర్హులైన రైతులకు రెండేళ్లలో ఎకరానికి గరిష్ఠంగా రూ.69,781 ఆర్థిక ప్రోత్సాహకం అందించనుంది. వీబీ జీరామ్‌జీ పథకం అనుసంధానంతో ఈ సాయం అందించనున్నారు.

ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. పశుగ్రాసం సాగుకు ఎకరాకు రూ.69 వేలకుపైగా సాయం!
Andhra Pradesh Farmers

Updated on: Oct 13, 2026 | 11:52 AM

ఆంధ్రప్రదేశ్‌లో పశుపోషణను ప్రోత్సహించడంతో పాటు రైతులపై ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యాచరణ చేపట్టింది. వ్యక్తిగత భూముల్లో పశుగ్రాస పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. అర్హులైన రైతులకు రెండేళ్ల వ్యవధిలో ఎకరానికి గరిష్ఠంగా రూ.69,781 వరకు ప్రోత్సాహకం లభించనుంది. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత ఏర్పడే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. వీబీ జీరామ్‌జీ పథకంతో అనుసంధానం చేసి పశుగ్రాస సాగుకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించనున్నారు. ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు అర్హులు. అయితే, వారికి వీబీ జీరామ్‌జీ జాబ్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలి.

పశువుల సంఖ్యను బట్టి సాగు విస్తీర్ణం

రైతుల వద్ద ఉన్న పశువుల సంఖ్య ఆధారంగా ఎంత భూమిలో పశుగ్రాసం సాగు చేయవచ్చో నిర్ణయించనున్నారు. రెండు పశువులు ఉన్నవారు 25 సెంట్లలో, మూడు నుంచి ఐదు పశువులు ఉన్నవారు 50 సెంట్లలో పశుగ్రాసాన్ని పండించుకోవచ్చు. ఐదు కంటే ఎక్కువ పశువులు ఉన్నవారికి ఒక ఎకరం వరకు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద ప్రయోజనం పొందే రైతుల వివరాలతో పాటు సాగు చేయనున్న భూమి వివరాలను సంబంధిత గ్రామసభ ఆమోదించాల్సి ఉంటుంది. పశుగ్రాస సాగు ద్వారా పశువులకు అవసరమైన మేతను సొంతంగా సమకూర్చుకోవడంతో పాటు పశుపోషణకు అయ్యే వ్యయాన్ని తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రైతులు తమ సొంత భూముల్లో పశుగ్రాస పంటలను సాగు చేసి, పశుపోషణను మరింత లాభదాయకంగా మార్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.

పశువుల ఆరోగ్య రక్షణకు రూ.36 కోట్లు

మరోవైపు, రాష్ట్రంలో పశువుల ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయించింది. పశువుల్లో వ్యాధుల నివారణ, నియంత్రణ కార్యక్రమాల నిర్వహణ కోసం రూ.36 కోట్లను విడుదల చేస్తూ పశుసంవర్ధకశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. పశుగ్రాస సాగుకు ప్రోత్సాహం, పశువుల ఆరోగ్య సంరక్షణకు నిధుల కేటాయింపుతో పశుపోషకులకు ఆర్థికంగా ఊరట కలగడంతో పాటు పశుసంపద పరిరక్షణకు దోహదపడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us