Pawan Kalyan’s Varahi Yatra: వారాహి యాత్ర రెండో దఫాకు పవన్ రెడీ.. గోదావరి జిల్లాల్లో జనసేన ముందున్న సవాళ్లు ఇవే..

| Edited By: Janardhan Veluru

Jul 07, 2023 | 6:50 PM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నుంచి ఈనెల 9న జనసేన రెండో దఫా వారాహి యాత్ర ప్రారంభం కాబోతుంది. అయితే పవన్ అభిమానులు మినహా జనసేన జనసమీకరణలో మాత్రం ఆశించిన పురోగతి లేదని ఆ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డ్ వాపోతున్నారంటే క్షేత్ర స్ధాయిలో ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో తెలుసుకోవచ్చు.

Pawan Kalyans Varahi Yatra: వారాహి యాత్ర రెండో దఫాకు పవన్ రెడీ.. గోదావరి జిల్లాల్లో జనసేన ముందున్న సవాళ్లు ఇవే..
Pawan Kalyan
Follow us on

ఏలూరు: గోదావరి జిల్లాల్లో వైసిపికి ఒక్క సీటు కూడా రానివ్వను అని అనాలంటే చాలా ధైర్యం కావాలి. ఒక పార్టీ అధ్యక్షుడు ఈ పదం వాడారాంటే ఆయన ఎంతో ఆలోచించి మాట్లాడారని పక్కా వ్యూహంతో నే ఈ స్టేట్మెంట్ ఇచ్చారని అందరూ అనుకుంటారు. అయితే రాజకీయ విమర్శకులు జనసేనపై చేస్తున్న విమర్శలకు పార్టీ వ్యవహారశైలి చాలా దగ్గరగా ఉంటుంది. వైసిపి ప్రధానంగా జనసేన పై తిరుగులేని బాణం తన విమర్శల్లో ఎక్కుపెట్టింది. కేవలం చంద్రబాబును సీఎం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే జనసేన అధ్యక్షుడు పవన్ ప్రయత్నిస్తున్నారని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు. వాస్తవానికి జనసేన బలం కాపులు. కాపు సామాజిక వర్గం ఆర్ధిక పరంగా, రాజకీయంగా గోదావరి జిల్లాల్లో కీలకంగా ఉన్నది. ఇలాంటి చోట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహీ యాత్రను అన్నవరం టు భీమవరం చేపట్టి చాలా బహిరంగసభలను నిర్వహించారు. ఇదే సమయంలో గోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉండటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వారాషి యాత్ర రెండో దఫాకు జనసేనాని వవన్ కల్యాణ్ సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు ఏయే అంశాలపై ఫోకస్ చేయాలో ప్రత్యేక కథనం ఇది..

జనసేన లో గ్రూప్ వివాదాలు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నుంచి ఈనెల 9న జనసేన రెండో దఫా వారాహి యాత్ర ప్రారంభం కాబోతుంది. అయితే పవన్ అభిమానులు మినహా జనసేన జనసమీకరణలో మాత్రం ఆశించిన పురోగతి లేదని ఆ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డ్ మీడియా ముందు వాపోతున్నారంటే క్షేత్ర స్ధాయిలో ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో తెలుసుకోవచ్చు. మరోవైపు జనసేన బలంగా ఉన్న చోట గ్రూపు గొడవలు తలనొప్పిగా తయారయ్యాయి. నరసాపురం జన సేన పార్టీలో ఇన్ఛార్జి బొమ్మిడి నాయకర్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసి రెండో స్థానంకు పరిమితమయ్యారు. అయితే మత్స్యకార సామాజిక వర్గం కు చెందిన ఆయనకు లోకల్ గా బలమైన సామాజిక వర్గమైన కాపులకు రోజు రోజుకూ గ్యాప్ పెరిగుతుంది. ముఖ్యంగా ఇక్కడ కాపు సామాజిక వర్గంకు చెందిన జనసేన నేత చాగంటి చిన్న కు ఇన్ ఛార్జ్ నాయకర్‌కు గ్యాప్ పెరిగింది. దీంతో రెండు గ్రూప్ లుగా వీరు రాజకీయాలు చేస్తున్నారు. పవన్ వారాహి యత్రలోనూ వీరిద్దరూ తమ బలాబలాలు చూపేందుకు వేరు వేరుగా ఫ్లెక్సీలు,కటౌట్ లను పట్టణంలో పెట్టారు. పార్టీ ఇంఛార్జి గా ఉన్న బొమ్మిడి నాయకర్ ఖర్చు విషయంలో వెనకడుగు వేస్తున్నారని పార్టీ నాయకులు గుసగుసలు ఆడుతున్నారు. వీరిని ఏకతాటి పై తీసుకు వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు జనసేన నుంచి కనిపించటంలేదు. ఇక భీమవరం పవన్ పోటీ చేయబోతున్న అసెంబ్లీ నియోజకవర్గం అయితే అక్కడ జనసేన జిల్లా అధ్యక్షుడుగా ఉన్న గోవిందరావు, జెడ్.పి. టి.సి జయప్రకాష్ నాయుడుకి మధ్య దూరం పెరిగిందని స్థానికంగా టాక్ వినిపిస్తోంది. ఇక క్రియాశీలకంగా ఉండే కనకరాజు సూరి వంటి నేతలకు సైతం తగిన ప్రాధాన్యత లేకుండా పోయిందని అంతర్గతంగా మదనపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

జనసేనకు ఇన్ ఛార్జ్ లు ఏరి?

పాత ప.గో జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉంటే వాటిలో నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు, గోపాలపురం, ఉండి , ఉంగుటూరు , దెందులూరు నియోజకవర్గాలకు కనీసం ఇన్ ఛార్జ్ ను సైతం జనసేన పార్టీ నియమించలేదు. ఉంగుటూరు లో ధర్మరాజు తానే అక్కడ ఇన్ ఛార్జ్ ప్రచారం చేసుకుని కార్యక్రమాలు చేస్తుంటే ఇటీవల ఆ పదవి మీకు ఎవ్వరూ ఇవ్వలేదని పార్టీలో కీలక నేత హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అటు వారాహి యాత్రతో పాటు జనసేన లో నెంబర్ 2నేతగా చెలామణి అవుతున్న నేత చుట్టూ చెక్కర్లు కొడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఉంగుటూరులో వట్టి వసంత్ కుమార్ మరణం తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా ఉన్న పవన్, పుప్పాల శ్రీనివాస్, తూర్పు లో మహసేన రాజేష్ వంటి వారు జనసేనలో చేరేందుకు ఆసక్తి ఉన్నా.. వారితో నేతలు చర్చించే పరిస్థితి లేదని జనసేన నేతలే చర్చించుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాలకు. ఇన్ ఛార్జ్ లు నిర్మించలేకపోవటం, కనీసం కార్యకర్తలతో కమిటీలు సైతం వేయకపోవడం జనసేన పార్టీ బలహీనతగా కనిపిస్తుంది. ఇక దెందులూరు లాంటి చోట ఘంటశాల మహాలక్ష్మి, ఆది శేషు వంటి వారు ఉన్నా అక్కడ ఎవరు నాయకులో తెలియని కన్ఫ్యూజన్ కనిపిస్తుంది.

వారాహి యాత్ర ఖర్చు సుమారు రూ.25లక్షలు

ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఆ పార్టీ లో చేరిన వారు, పోటీ చేసి ఓడి పోయిన వాళ్లు చేసిన విమర్శలు ఇప్పటికి ఆ పార్టీ వ్యవస్థాపకుడు మెగాస్టార్ చిరంజీవి ని రాజకీయంగా చాలా నష్టపరిచాయి. కాని అదే పరిస్థితి జనసేన విషయంలో పునరావృతం అవుతాయని సగటు జనసేన కార్యకర్త ఆవేదన చెందుతున్నారని ఆ పార్టీ నాయకులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. గ్రూపులు ఉన్న చోట జిల్లా, రాష్ట్ర నాయకత్వం వాటిని సర్దుబాటు చేయకపోవటం, ఎలాంటి పదవి ఇవ్వకుండా లక్షల రూపాయలు ఖర్చు చేయించటం తర్వాత సమస్యలు తీసుకువస్తాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు వారాహి విజయాత్ర కోసం సుమారు ఒక్కో నేత సుమారు రూ.25 నుంచి 30లక్షలు ఖర్చు పెడుతున్నారు. స్ధానికంగా వంద గదులు బుక్ చేయటం, భోజనాలు, ప్రచారం కోసం వ్యయం ఇవన్ని ఇపుడు చిన్నా చితక నేతలకు భారంగా మారినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు జనసేన పార్టీ లో గ్రూపులు కట్టడి చేసే ప్రయత్నం జరగకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు పార్టీ ఎదుర్కొంటుందనేది పలువురు నుంచి వినిపిస్తున్న మాట. నష్ట నివారణ చర్యలతో బలహీనతలను సరిదిద్దుకుంటే.. 2024 ఎన్నికలలో నరసాపురంలో జనసేన పార్టీ మెరుగైన ఫలితాన్ని సాధించొచ్చని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేనకు సొంత బలం లేనకపోవటం బలహీనత కాదు సొంత బలం పెంచుకోలేక పోవటం ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. ఈ విషయంలో పార్టీ ప్రయాణమే ఆ పార్టీ మనుగడ, వికాసం పై ప్రభావం చూపుతుంది.

రిపోర్టర్: బండికట్ల రవి కుమార్, స్పెషల్ కరస్పాండెంట్, టివి9 తెలుగు (పశ్చిమ గోదావరి జిల్లా)

మరిన్ని ఏపీ వార్తలు చదవండి