పోలీస్‌ కానిస్టేబుల్ ఫిజికల్‌ ఈవెంట్స్‌లో ముంచుకొచ్చిన మృత్యువు.. పరుగు పందెంలో కుప్పకూలి యువకుడు మృతి

|

Jan 03, 2025 | 9:17 AM

తనను పెంచి పెద్దవాడిని చేసేందుకు రెక్కలు ముక్కలు చేసుకున్న తల్లి రుణం తీర్చుకోవాలని.. కోటి ఆశలతో మైదానంలో అడుగుపెట్టిన కానిస్టేబుల్ అభ్యర్ధి పరుగు పందెంలో గమ్యం చేరకముందే మృతి చెందాడు. మూడు రౌండ్లు పూర్తి చేసిన యువకుడు నాలుగో రౌండ్ లో మరో నాలుగు అడుగులు వేస్తే గమ్యం చేరేవాడు. కానీ ఇంతలో మృత్యువు ముంచుకొచ్చింది..

పోలీస్‌ కానిస్టేబుల్ ఫిజికల్‌ ఈవెంట్స్‌లో ముంచుకొచ్చిన మృత్యువు.. పరుగు పందెంలో కుప్పకూలి యువకుడు మృతి
Constable Aspirant
Follow us on

మచిలీపట్నం, జనవరి 3: భవిష్యత్తుపై కోటి ఆశలతో, కలల కొలువు సాధించాలన్న తపనతో తీసిన పరుగు గమ్యం చేరకముందే అర్ధాంతరంగా ఆగిపోయింది. రాష్ట్రంలో కానిస్టేబుల్‌ పోస్టుల ఎంపిక కోసం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షకు హాజరైన ఓ యువకుడు 1600 మీటర్ల పరుగులో మృత్యువాత పడ్డాడు. మరికొన్ని క్షణాల్లో పరుగు ముగుస్తుందనగా.. ట్రాక్‌పైనే కుప్పకూలిపోయాడు. ఏపీఎస్‌ఎల్‌పీఆర్బీ ఆధ్వర్యంలో సోమవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన దేహదారుఢ్య పరీక్షలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం జీలగొండి గ్రామాని­కి చెందిన దరావతు చంద్రశేఖరరావు (21) డిగ్రీ, డీఈడీ పూర్తి చేశాడు. తండ్రి దేవ చనిపోవడంతో తల్లి మణి రెక్కలు ముక్కలు చేసుకుని కొడుకును పెంచి పెద్దవాడిని చేసింది. కుమార్తెకు కూడా వివాహం జరిపించింది. కొడుకు ప్రయోజకుడై ఆదుకుంటాడని తల్లి మణి ఆశపడింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కానిస్టేబుల్ నియామకాల్లో జిల్లా నుంచి 7,098 మంది మహిళా, పురుష అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షకు ఎంపికయ్యారు. నిబంధనల మేరకు సుమారు 600 మంది చొప్పన అభ్యర్థులను అనుమతిస్తున్నారు. సోమవారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవగా చంద్రశేఖరరావు గురువారం హాజరయ్యారు. ఉదయం 1600 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొన్న చంద్రశేఖరరావు.. చివరిదైన నాలుగో రౌండ్‌ ముగించేందుకు కొద్ది దూరంలో ఉండగా రన్నింగ్‌ ట్రాక్‌పై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

వెంటనే మైదానంలో ఉన్న వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, సమీపంలోని సర్వజనాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు. కార్డియాక్‌ అరెస్ట్‌తో చంద్రశేఖరరావు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రి బెడ్‌పై విగత జీవిగా పడిఉన్న కొడుకును చూసి తల్లి పేగు తల్లడిల్లింది. కుమారుడి మృతదేహాన్ని చూడగానే స్పృహ తప్పిపడిపోయింది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన తల్లి మణి రోదనలు చూపరులను కలచివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.