అమెరికాను కరోనా మెల్లగా వణికిస్తోంది. ఈ వ్యాధికి గురై తాజాగా ఫ్లోరిడాలో ఇద్దరు మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 17 మందికి పెరగగా.. 330 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు ట్రంప్ నిన్న అత్యవసరంగా 8.3 బిలియన్ డాలర్ల వ్యయానికి ఉద్దేశించిన ప్యాకేజీపై సంతకం చేశారు. అటు -న్యూయార్క్ సిటీలో కొత్తగా 22 కేసులు నమోదు కాగా..మొత్తం ఈ సంఖ్య 44 కి పెరిగింది. మరోవైపు- ఇజ్రాయెల్ అనుకూల లాబీ వాషింగ్టన్ లో నిర్వహించిన సభకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఇతర ఎంపీలు హాజరయ్యారు. న్యూయార్క్ లో కరోనాకు గురైన ఓ జంట కూడా ఈ కాన్ఫరెన్స్ కు వఛ్చినట్టు తెలియడంతో అంతా ‘అలర్ట్’ అయ్యారు. టెస్టుల్లో ఈ జంటకు కరోనా వైరస్ లక్షణాలు పాజిటివ్ అని వెల్లడైందని అమెరికన్-ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ.. ఈ-మెయిల్ ద్వారా ఈ సభకు హాజరైనవారందరికీ తెలిపింది. పైగా ఈ విషయాన్ని ట్విటర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది కూడా..