కొలువు కోసం వచ్చాడు.. కానరాని లోకాలకు చేరాడు.. నేవీ మైదానంలో కుప్పకూలి యువకుడి దుర్మరణం..!

దేశ రక్షణశాఖలో ఉద్యోగం అనగానే చేరాలనే తపన.. సర్వశక్తులొడ్డి జాబ్ లో చేరాలని యావ.. శక్తికి మించి ప్రయత్నాలు.. అంతలోనే అనంతలోకాలకు చేరాడు.

  • Balaraju Goud
  • Publish Date - 3:37 pm, Sat, 28 November 20

దేశ రక్షణశాఖలో ఉద్యోగం అనగానే చేరాలనే తపన.. సర్వశక్తులొడ్డి జాబ్ లో చేరాలని యావ.. శక్తికి మించి ప్రయత్నాలు.. అంతలోనే అనంతలోకాలకు చేరాడు. ఇందు కోసం తన అక్క వివాహ ముహూర్తాన్నే మార్చుకుని… ఎంపిక పరీక్షలకు హాజరైన ఓ యువకుడు సెలెక్షన్ పరేడ్ లోనే ప్రాణాలొదిలిన ఘటన విశాఖపట్నంలో జరిగింది. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి బక్కయ్య, కేదారీశ్వరి దంపతుల కుమారుడు సాయికృష్ణ(19) ఇండియన్‌ నేవీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఫిజికల్ టెస్టుకు హాజరు కావాలని కాల్ లెటర్ అందింది. అయితే అదే రోజు సోదరి వివాహ ముహూర్తం కుదిరింది. పరీక్ష కోసం వివాహ తేదీని డిసెంబరు 9వ తేదీకి మార్చారు.

సాయికృష్ణ తన స్నేహితుడితో కలిసి ఈ నెల 26న విశాఖ చేరుకున్నాడు. ఉదయం 10:30 గంటలకు పైపులైన్‌ జంక్షన్‌ వద్ద ఉన్న నేవీ మైదానంలో ఎంపిక పరీక్షలకు హాజరయ్యాడు. తొలుత 100 మీటర్ల పరుగు పూర్తి చేసి, వెంటనే పులప్స్‌ తీస్తుండగా ఒక్కసారిగా గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. తక్షణమే నేవీ సిబ్బంది ఐఎన్‌ఎస్‌ కల్యాణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటాక సాయికృష్ణ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న మల్కాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కింగ్‌జార్జ్‌ ఆస్పత్రికి తరలించారు. పది రోజుల్లో సోదరి పెళ్లి ఉండటంతో ఈ ఘటనతో బాధిత కుటుంబంలో అంతులేని విషాదం మిగిల్చింది. చేతికందిన కొడుకు కళ్ల ముందు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.