PM Modi to Meet US President: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత తొలిసారి జో బైడెన్.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతున్నారు. అది కూడా వర్చువల్ సమావేశంలో. ఆస్ట్రేలియా నిర్వహింస్తున్న క్వాడ్ సమావేశంలో సభ్యదేశాలైన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా దేశాధినేతలు కీలక అంశాలపై చర్చించనున్నారు. చైనా ఆధిపత్యాన్ని ఢీకొట్టేందుకు క్వాడ్ గ్రూపును 2007లో ఏర్పాటు చేశారు.
కరోనా కట్టడికి వ్యాక్సిన్ల అభివృద్ధితో పాటు .. వాటిని వీలైనంత ఎక్కువ మందికి త్వరగా అందించేలా ఈ సమావేశంలో వ్యూహం సిద్ధం చేశారు. వ్యాక్సిన్ల ఉత్పత్తితోపాటు అరుదైన లోహాల ఉత్పత్తి, రవాణా గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. చైనాకు ధీటుగా తయారీ రంగానికి ప్రోత్సాహం అందించడం, పెట్టుబడుల పైనా దేశాధినేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇటీవల చైనాతో అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు కయ్యానికి దిగడం, పన్నుల యుద్ధం తర్వాత ఈ సమావేశం జరుగుతూ ఉంది. డ్రాగన్ విషయంలో బైడెన్ కూడా ట్రంప్ విధానాన్నే ఫాలో అవుతున్నారు. అమెరికా విదేశాంగ విధానాన్ని ప్రకటించిన బైడెన్.. బీజింగ్ దురాక్రమణ విధానాన్ని సహించేది లేదని.. స్నేహంగా ఉంటే ఎవరితోనైనా చేయి కలుపుతామని స్పష్టం చేశారు. తాజాగా తైవాన్, టిబెట్ విషయంలో చైనా వైఖరిని అమెరికా తప్పు పట్టింది.
భారత్‌తోనూ చైనా లఢక్ సరిహద్దుల వద్ద కయ్యానికి దిగింది. పాంగాంగ్ సరస్సు నుంచి బలగాలను ఉపసంహరించుకున్నా.. సరిహద్దు పొడవునా నిఘా పెంచింది. ఆధునిక ప్రపంచంలో దురాక్రమణవాదానికి కాలం చెల్లిందంటూ పరోక్షంగా చైనాను హెచ్చరించారు. ఈ పరిస్థితులన్నింటి మధ్య ఇవాళ జరగనున్న క్వాడ్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, రాజకీయ, ఆర్థిక స్థిరత్వం కోసం ఈ నాలుగు దేశాల అధ్యక్షులు నిర్మాణాత్మకంగా కలిసి పని చేయాలనేది క్వాడ్ సమావేశం లక్ష్యం. ఈ సమావేశం అజెండా ఏర్పాట్ల గురించి అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యాక్షురాలితో కొన్ని వారాల క్రితమే చర్చించారు ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్. ఈ వర్చువల్ మీటింగ్‌లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు అమెరికా అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు .
ఇందులో భాగంగా చైనా వ్యాక్సిన్ దౌత్యానికి చెక్ పెట్టే ఉద్దేశంతో ఇండియాలో వ్యాక్సిన్ల తయారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆర్థిక సాయం ప్రకటించనున్నారు. అమెరికా ఫార్మా సంస్థలు నొవావ్యాక్స్, జాన్సన్ & జాన్సన్‌లకు ఇండియాలో వ్యాక్సిన్లను తయారు చేసే సంస్థలే లక్ష్యంగా ఈ ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, కరోనా మ్యుటేషన్లను అంతం చేయడం కోసమే క్వాడ్ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియాలో అదనపు వ్యాక్సిన్ ఉత్పత్తి వల్ల ఆగ్నేయ ఆసియా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. ఇండియా కూడా వ్యాక్సిన్ల తయారీలో పెట్టుబడి పెట్టాల్సిందిగా క్వాడ్ సభ్య దేశాలను కోరింది. క్వాడ్ కూటమి ఏర్పాటైన తర్వాత విదేశాంగ ప్రతినిధులే సమావేశాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఆ కూటమి ఏర్పాటైన ఇన్నేళ్లకి తొలిసారిగా దేశాధినేతలు సమావేశం అవుతున్నారు.