బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే.. పదేళ్ల క్రితం ఉక్రెయిన్‌లో జరిగిన పరిణామాలు గుర్తుకొస్తున్నాయి. అప్పటి వరకు మిత్రరాజ్యాలుగా ఉన్న దేశాలే ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయిన పరిస్థితి ఉక్రెయిన్ – రష్యా మధ్య చోటుచేసుకోగా.. ఇప్పుడు బంగ్లాదేశ్-భారత్ మధ్య సంబంధాలు సైతం అదే మాదిరిగా మారాయి. సరిగ్గా పదేళ్ల క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పెద్ద ఎత్తున ప్రజాందోళన చెలరేగింది. నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఇందులో కొందరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు మరింత ఉధృతంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా నాటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యంకోవిచ్ గద్దె దిగాల్సి వచ్చింది. అంతేకాదు, తన ప్రాణాలు కాపాడుకోడానికి రష్యాలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. విక్టర్ యంకోవిచ్ రష్యా అనుకూల వైఖరిని అవలంబించారు. యురోపియన్ యూనియన్, నాటో (NATO)లో ఉక్రెయిన్ చేరాలన్న ప్రతిపాదనలను ఆయన వ్యతిరేకించారు. ఈ క్రమంలో యంకోవిచ్‌ను ఆ పదవి నుంచి తప్పించడం కోసం అగ్రరాజ్యం అమెరికానే కుట్ర చేసిందని అప్పట్లో అనేక కథనాలు, విశ్లేషణలు వచ్చాయి. ఉక్రెయిన్ ప్రజాందోళన వెనుక అమెరికా మద్దతు ఉందన్న విషయాన్ని ఆ దేశానికి డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా పనిచేసిన విక్టోరియా నులాండ్ స్వయానా అంగీకరించారు.
ఉక్రెయిన్ ప్రజాందోళనలు కేవలం అధ్యక్షుణ్ణి గద్దె దించడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం వరకే పరిమితం కాలేదు. అంతటితో ఉద్యమం ముగియలేదు. ఉక్రెయిన్‌లో రష్యన్ భాష ఎక్కువగా మాట్లాడే క్రిమియా, డాన్‌బాస్ ప్రాంతాల్లో ఆందోళనలు దారితప్పాయి. రష్యన్ భాష మాట్లాడే ప్రజలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. ఈ పరిస్థితుల్లో రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్న క్రిమియాను రష్యా ఆక్రమించుకుని, తమ భూభాగంలో కలుపుకుంది. ఆనాడు రగులుకున్న నిప్పు.. దశాబ్దకాలంగా కొనసాగుతూ 2022లో రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. తీరా ఇంతజరిగినా ఇప్పటికీ ఉక్రెయిన్ యురోపియన్ యూనియన్‌లో, నాటో (NATO)లో సభ్యత్వం పొందలేకపోయింది. మొత్తంగా ఒకనాటి సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న ఉక్రెయిన్, రష్యా ప్రభావం నుంచి బయటపడాలన్న ఆలోచనతో మొదలైన ప్రజా ఉద్యమంచి వరకు ఆ దేశాన్ని అమెరికా కబంధ హస్తాల్లోకి నెట్టేసింది. పేరుకు ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలా కనిపిస్తున్నప్పటికీ.. అది అమెరికా – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధమని, మధ్యలో ఉక్రెయిన్ బలి పశువుగా మారిందని ప్రపంచ పరిణామాల గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది.
బంగ్లాదేశ్‌లోనూ ఉక్రెయిన్ తరహా పరిస్థితులు
సరిగ్గా ఉక్రెయిన్ తరహాలో పదేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో దేశాధినేతను గద్దె దించడమే లక్ష్యంగా ప్రజా ఉద్యమం ఎగిసిపడింది. 2024 జూన్ నెలలో మొదలైన ఉద్యమం, జులై నాటికి తీవ్రరూపం దాల్చి హింసాత్మకంగా మారింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఆందోళనల్లో పలువురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ఆగస్ట్ నాటికి ఆ ఆందోళనలు దేశ ప్రధాని షేక్ హసీనా నివాసాన్ని ముట్టడించే వరకు చేరుకున్నాయి. విధిలేని పరిస్థితుల్లో హసీనా దేశాన్ని విడిచి తాత్కాలికంగా భారత్‌లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఉక్రెయిన్ మాదిరిగానే ప్రజాందోళనలు దేశాధినేతను గద్దె దించాయి. సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండి, విడిపోయి స్వతంత్ర రాజ్యంగా ఉన్న ఉక్రెయిన్ తమ మాతృదేశం లాంటి రష్యాతో కయ్యం పెట్టుకోగా.. ఇప్పుడు ఒకనాటి బ్రిటీష్ ఇండియాలో భాగంగా భారత్‌లో అంతర్భాగంగా ఉండి, 1947లో విడిపోయి ఈస్ట్ పాకిస్తాన్‌గా, ఆ తర్వాత భారత్ చొరవతో స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్‌లో కూడా భారత్ వ్యతిరేక భావజాలమే ప్రస్తుతం కనిపిస్తోంది. నిరసనకారులు షేక్ హసీనాను ‘భారత ఏజెంట్’ అని నిందించడమే కాదు, భారత్ అనుకూల వైఖరిని తప్పుబట్టారు. ఇక్కడ కూడా ప్రజాందోళనలు హసీనాను గద్దె దించడంతో శాంతించలేదు. భారత్ అనుకూల వైఖరితో ఉండే మైనారిటీ వర్గాలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు, హింసకు పాల్పడుతున్నారు. అయితే ఈ ఆందోళనల వెనుక కూడా అమెరికా హస్తం ఉందన్నది షేక్ హసీనా ఆరోపణ. బంగ్లాదేశ్‌లోని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తమ సైనిక అవసరాల కోసం ఇవ్వాల్సిందిగా అమెరికా అడిగిందని, అందుకు తాను అంగీకరించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని హసీనా వెల్లడించారు.
భారత్-బంగ్లా మైత్రి కొనసాగేనా?
అసలే భారత వ్యతిరేక వైఖరితో ఉన్న నిరసనకారులు.. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య కొనసాగిన సత్సంబంధాలు, మైత్రిని ప్రశ్నార్థకంలో పడేసేలా ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ వైఖరి కనిపిస్తోంది. ఆ దేశంలో భారత్ వస్తువులను బహిష్కరిస్తున్నారు. భారతీయులపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో హిందీ భాష వాడకంపై బంగ్లాదేశ్‌లో వ్యతిరేకత వ్యక్తమైంది. హిందీ భాషను ఉపయోగించడాన్ని నిరసనకారులు బంగ్లాదేశ్‌కే అవమానకరమని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇదంతా ఒకెత్తయితే..షేక్ హసీనా అధికారంలో ఉండగా భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW)ను ఉపయోగించుకుని తనకు వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై మారణహోమానికి పాల్పడ్డారని నిందిస్తున్నారు. తాత్కాలికంగా ఏర్పడ్డ మధ్యంతర ప్రభుత్వం ఇప్పటికే అనేక మంది రా ఏజెంట్లను అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనం. మొత్తంగా బంగ్లాదేశ్ సర్వసత్తాక స్వతంత్ర రాజ్యంగా అవతరించడానికి సహకరించిన భారతదేశంపై కృతజ్ఞతాభావం ఉండాల్సిన చోట బంగ్లాదేశ్ కొత్త తరాన్ని భారత్ పట్ల విషాన్ని నింపుతోంది. యువతను రెచ్చగొడుతోంది. షేక్ హసీనా పాలనలో వాణిజ్యం, సరిహద్దులు, రక్షణ సహా అనేక ఇతర రంగాల్లో పరస్పర సహకారానికి ద్వైపాక్షిక ఒప్పందాలు, నదీ జలాల ఒప్పందాలు చేసుకున్న భారత్‌కు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిణామాలు ఆందోళన కల్గిస్తున్నాయి. కొత్త ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు కొనసాగించాలన్న భారత్ ప్రయత్నాలకు ఇవన్నీ అడ్డంకిగా మారాయి.
హసీనాను అప్పంగించండి
బంగ్లాదేశ్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు.. షేక్ హసీనాను బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలని భారతదేశాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాందోళనలను అణిచివేసే క్రమంలో జరిగిన కాల్పులు, నిరసనకారుల మరణాలపై షేక్ హసీనాను హత్యానేరం కింద కేసులు పెట్టాలన్నది వారి డిమాండ్‌గా ఉంది. మరోవైపు తమ ఉద్యమానికి ఎలాంటి విదేశీశక్తుల సహాయం లేదని చెబుతున్నారు. తమ ఉద్యమాన్ని కించపరిచేందుకు భారత్ చేస్తున్న కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు. ఆ దేశంలో మైనారిటీలపై ఎలాంటి దాడులు జరగలేదని, కేవలం భారత్ చేస్తున్న దుష్ప్రచారమేనని నిందిస్తున్నారు. మొత్తంగా నిన్నమొన్నటి వరకు ప్రపంచమంతా మెచ్చుకున్న భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ మాదిరిగా మారడం అందరికీ ఆందోళన కల్గిస్తోంది. ఇది భవిష్యత్తులో భారత్ – పాకిస్తాన్ తరహా ఉద్రిక్త పరిస్థితులకు దారితీయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.