
ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలన్న నినాదంతో ఇరాన్ మహిళలు తమ పెళ్లి ఉంగరాలను సైతం విరాళంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో ‘రింగ్స్ ఆఫ్ రివెంజ్’ (ప్రతీకార ఉంగరాలు) ప్రచారం చేపట్టారు.
ఇరాన్‌కు చెందిన తెహ్రాన్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం.. ‘మదరానేహ్’ (మాతృత్వం) అనే మహిళా బృందం ప్రచారాన్ని ప్రారంభించింది. అక్టోబర్ 22, గురువారం రాత్రి టెహ్రాన్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ‘రస్తాఖిజ్ ఆఫ్ తెహ్రాన్ ఉమెన్’ (టెహ్రాన్ మహిళల తిరుగుబాటు) పేరుతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి వివిధ రంగాలకు చెందిన వందలాది మంది మహిళలు హాజరయ్యారు. విద్యార్థినులు, స్వచ్ఛంద కార్యకర్తలతో పాటు ఇటీవలి ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి భార్యలు, కుమార్తెలు పాల్గొన్నారు. ప్రసంగాలు, బృందగానాలు, సంతాప గీతాలతో కార్యక్రమం సాగింది. సమావేశంలో ప్రధానంగా ప్రతీకారం తీర్చుకోవాలనే అంశానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘రింగ్స్ ఆఫ్ రివెంజ్’ ప్రచార కాంపెయిన్ ను ప్రకటించారు.
పెళ్లి ఉంగరాలతో పాటు బంగారం, నగదును విరాళంగా ఇచ్చే ‘గోల్డెన్ రిట్రిబ్యూషన్’ (బంగారంతో ప్రతీకారం) ప్రచారంలో మహిళలు పాల్గొంటున్నారు. ఇరాన్ మాజీ నేత హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే తమ లక్ష్యానికి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ‘నెహ్జత్-ఎ మదారి’ బృందం.. బంగారం విరాళంగా ఇచ్చిన వారికి బుల్లెట్ ఆకారంలో బ్రేస్ లెట్లను అందచేస్తున్నట్లు తెహ్రాన్ టైమ్స్ తెలిపింది. ప్రతీకారం తీర్చుకోవాలనే తమ సంకల్పానికి గుర్తుగా వీటిని ఇస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రాజకీయ, సైనిక, భద్రతా రంగ ప్రముఖులను కోల్పోయింది. వీరిలో ఇరాన్ మాజీ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ, జాతీయ భద్రతా అధిపతి అలీ లారిజానీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఉన్నతాధికారులు ఉన్నారు.
ఇరాన్‌పై సైనిక చర్య విషయంలో ఇజ్రాయెల్‌లో రాజకీయ నాయకత్వానికి, సైనిక ఉన్నతాధికారులకు మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఖండించారు.ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసినట్లు మీడియా కథనం తెలిపింది. అయితే ఇరాన్ ముందుగా దాడి చేస్తే తీవ్రంగా స్పందిస్తామని కాట్జ్ హెచ్చరించారు.