Global Indians: మహిళల్లో అత్యధికంగా కనిపించే రొమ్ము క్యాన్సర్ ను నివారించడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏటా ఎన్నో వేల మంది మహిళల్ని బలితీసుకుంటున్న ఈ వ్యాధి నివారణ కోసం ప్రపంచవ్యాప్తంగా వందలాది పరిశోధనలు జరిగాయి. ఇప్పటివరకూ రొమ్ముక్యాన్సర్ కు సంబంధించి ఉపశమనానికి కొద్దిపాటి విధానాలు తప్ప నివారణకు సంబంధించి పెద్దగా పురోగతి కనిపించడం లేదు. అయితే, ఇప్పుడు ఏకంగా రొమ్ముక్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ కనిపెట్టారు. ప్రయోగదశలో ఉన్న ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందరిలోనూ ఆశలను రేకెత్తిస్తోంది. అయితే, ఈ అద్భుతమైన ఘనత సాధించింది ఒక ప్రవాస భారతీయ డాక్టర్ కావడం విశేషం. అజ్మీర్ కు చెందిన డాక్టర్ ఛవీ జైన్ ఆమె సహచరులు అమెరికాలో జంతువులపై ఇప్పటికే ఈ వ్యాక్సిన్ విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు ఈ బృందం మహిళలపై క్లినికల్ ట్రైల్స్ నిర్వహిస్తున్నాయి.
ఎవరీ డాక్టర్ ఛవీ జైన్..
డాక్టర్ ఛవీ జైన్ తండ్రి డాక్టర్ సంజీవ్ జైన్ అజ్మీర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ హాస్పిటల్‌లో పీడియాట్రిషియన్. తల్లి డాక్టర్ నీనా జైన్ అనస్థీషియా విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ అదేవిధంగా మాజీ విభాగాధిపతి కూడా. ఆమె తన ప్రారంభ విద్యను అజ్మీర్ లోని సోఫియా-పీకాక్ స్కూల్ లో చేశారు. తరువాత పూణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫర్మేటిక్స్ అండ్ బయోటెక్నాలజీ నుండి M.Tech, స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (EPFL) యూనివర్సిటీ, స్విట్జర్లాండ్ నుండి PhD తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలోని లెర్నర్ ఇన్‌స్టిట్యూట్ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడ నుంచే ఆమె డాక్టర్ థామస్ బడ్.. డాక్టర్ విన్సెంట్ ట్వోహీ పరిశోధన ఆధారంగా క్యాన్సర్ వ్యాక్సిన్ ట్రయల్ టీమ్‌లో పాల్గొంటున్నారు. ఆమె ప్రస్తుతం అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి ఫిమేల్ రీసెర్చ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు.
డాక్టర్ ఛవీ జైన్ తన చదువు గురించి చెబుతూ మంచి ఇమేజ్ ప్రకారం నేర్చుకునే శక్తి , నా లెర్నింగ్ పవర్ బాగానే ఉండేదని చెప్పారు. ఒక్కసారి చదివితే ఏదైనా బాగా గుర్తుండిపోతుందనీ, తన చెల్లెలు చాలా బాగా చదువుకునేది అని చెబుతుంది. ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుని చదువుకోవడం ఇష్టం ఉండేది కాదు. దీంతో మా తల్లిదండ్రులు ఎప్పుడూ చెల్లిని చూసి నేర్చుకోమని చెబుతూ ఉండేవారు అని నవ్వుతూ చెప్పారు.
ఇంజనీర్ కావాలనుకుని..
ఆమె మొదట ఇంజనీర్ కావాలనుకుంది. అందుకే, మయూర్ స్కూల్‌లో 11వ తరగతిలో మ్యాథ్స్ సబ్జెక్టు తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత బయో చదవాలనే కోరిక ఏర్పడి స్కూల్ యాజమాన్యం అనుమతి తీసుకుని ఒకరోజు బయో క్లాస్‌కు హాజరైంది. అక్కడ చాలా బాగుంది.. సబ్జెక్ట్ మీద ఆసక్తి కూడా పెరిగింది. తర్వాత రిక్వెస్ట్ చేసి మ్యాథ్స్‌తోపాటు బయో సబ్జెక్ట్ కూడా తీసుకుంది. సెలవుల్లో ఇంజినీరింగ్ కోచింగ్ ప్రారంభించినా.. కొద్ది రోజుల్లోనే మనసు మార్చుకున్న ఆమె మెడికల్ కోచింగ్‌లో చేరారు. ఎంబీబీఎస్ చేసి ఫిజీషియన్ కావాలనే కోరిక కూడా అప్పట్లో ఉండేది. తరువాత ఆమె తల్లి జన్యు చికిత్సలో పరిశోధన చేయమని ప్రోత్సహించడంతో ఈ రంగంలోకి వచ్చారు. ఈ రోజు నేను ఏదైనా సాధించాను అంటే అది మా తల్లిదండ్రుల ప్రోత్సాహం.. ప్రేరణ ఫలితమే అని ఆమె చెబుతున్నారు.
అనేక అవార్డులు..
ఆమె తన అత్యుత్తమ పనికి క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అగ్ర నాయకత్వం నుంచి ప్రశంసలు, ఎక్సలెన్స్ అవార్డు.. క్వార్టర్ ఎంప్లాయీ అవార్డును అందుకున్నారు. కేస్‌వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ నుంచి ఫెలోషిప్ కూడా పొందారు. మానవులపై మొదటి అధ్యయనం కోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆమోదం పొందడంలో ఆమె విజయం సాధించారు. దీనికి ముందు, ఛవి చిన్నప్పటి నుండి ప్రతి పనిలో బాగా రాణించి పాఠశాల, కళాశాల స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకుంది. ఆమె ప్రస్తుతం అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి ఫిమేల్ రీసెర్చ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు.
ప్రస్తుతం వ్యాక్సిన్ ఏ స్థాయిలో ఉంది..
ప్రస్తుతం వ్యాక్సిన్ దుష్ప్రభావాలు పరీక్షిస్తున్నారు. జంతువులపై టీకా విజయవంతమైన పరీక్ష తర్వాత, ఇది ఇప్పుడు మానవులపై పరీక్షించబడుతోంది. క్లినికల్ ట్రయల్ మొదటి దశలో, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న 18-24 సంవత్సరాల వయస్సు గల మహిళలకు రెండు వారాల వ్యవధిలో మూడు మోతాదులు ఇస్తారు. ఈ టీకా ఆల్ఫా-లాక్టాల్బుమిన్ అనే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రొటీన్‌పై దాడి చేస్తుంది. ఈ ప్రొటీన్ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో 70 శాతం ఉంటుంది. టీకా వల్ల మహిళల్లో వచ్చే దుష్ప్రభావాల గురించి ఈ బృందం ప్రస్తుతం పరిశీలిస్తుంది.
భారత్ వస్తారా?
డాక్టర్ ఛవీ ఇప్పటికిప్పుడు భారత్ రావాలనే కోరిక లేదని చెప్పారు. కొత్త రోగాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డ్రగ్స్ రంగంలో ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశ్యం ఉంది. అయితే, భవిష్యత్ లో నేను కచ్చితంగా భారతదేశానికి వచ్చి ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను అని వివరించారు.
మొదటి నుండి తెలివైనదే.. కానీ ఎప్పుడూ చదువుకోవడం చూడలేదు
డాక్టర్ ఛవీ జైన్ తల్లి నీనా జైన్ మాట్లాడుతూ నా కుమార్తె ఇంత చదువుతుందని నాకూ తెలియదు అని చెప్పారు. అయితే, ఆమె తెలివైనదని అన్నారు. చదువు కోసం ఛావితో ఎప్పుడు మాట్లాడినా నువ్వు ఏమైనా అడుగు అని చెప్పేది. ప్రశ్నలు అడిగినప్పుడు, ఆమె ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చేది. ఆమె ఎప్పుడూ స్కూల్‌లో, క్లాస్‌లో టాపర్‌గా ఉండేది. కానీ, ఇంటి దగ్గర కూచుని చదవడం మాకు తెలీదు. ఎప్పుడైనా ఆమె మార్కులు చూసి మాకు ఆశ్చర్యంగా ఉండేది. ఇలా ఎలా అని అడిగితే.. పూర్తి శ్రద్ధతో స్కూల్‌లో చదువుతానని చెప్పేది అంటూ ఆమె తల్లి చెప్పారు. ఛవీ పీహెచ్‌డీ కోసం 2010లో స్విట్జర్లాండ్‌కు వెళ్ళింది. కృషి, అంకితభావం కారణంగా, ల్యాబ్‌లోని డాక్టర్ నినా జైన్ కూడా పీహెచ్‌డీ సమయంలో మారిపోయారని చెప్పారు. ఆ తర్వాత 2016లో జబల్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఛవీ భర్త డాక్టర్ ప్రంతేష్ జైన్ కూడా అమెరికాలో డాక్టర్. ఆ తర్వాత ఆమె కూడా అక్కడే స్థిరపడింది. అని ఆమె తల్లి వివరించారు.
భారతీయ మహిళల్లో ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం..
భారతీయ మహిళల్లో ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. వాతావరణం, జీవనశైలి, స్థూలకాయం, పోషకాహార లోపం, జన్యుపరమైన మార్పులు దీనికి ప్రధాన కారణాలు. దీనికి ఇంకా సమర్థవంతమైన చికిత్స లేదు. ఛావి తల్లి డాక్టర్ నీనా జైన్ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వసాధారణం, అయితే ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు భారతదేశంలో కూడా చాలానే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: Dating Apps: వేగంగా విస్తరిస్తోన్న డేటింగ్ సంస్కృతి.. టాప్‌లో హైదరాబాద్.. సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..