కాలగర్భంలో కలిసిపోయి.. 2,000 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం!

Facial Reconstruction : బ్రిటన్ లోని ఇన్వెరెస్క్ ప్రాంతం రోమన్ కోట వద్ద 2,000 ఏళ్ల క్రితం జీవించిన వ్యక్తి అస్థిపంజరాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికితీశారు.  రోమన్ గా గుర్తించి పుర్రె, ఎముకలు, డీఎన్‌ఏ ఆధారంగా ఆ వ్యక్తి ముఖాన్ని డిజిటల్ పద్ధతిలో పునర్నిర్మించారు. అస్థిపంజరాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలకు అతడి జీవితానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. 

కాలగర్భంలో కలిసిపోయి.. 2,000 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం!
Facial Reconstruction Reveals Face Of Man Who Lived 2,000 Years Ago

Updated on: Oct 29, 2026 | 4:54 PM

Facial Reconstruction :   బ్రిటన్ లోని ఇన్వెరెస్క్ ప్రాంతం రోమన్ల కోట వద్ద 2,000 ఏళ్ల క్రితం జీవించిన వ్యక్తి అస్థిపంజరాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికితీశారు.  రోమన్ గా గుర్తించి పుర్రె, ఎముకలు, డీఎన్‌ఏ ఆధారంగా ఆ వ్యక్తి ముఖాన్ని డిజిటల్ పద్ధతిలో పునర్నిర్మించారు. అస్థిపంజరాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలకు అతడి జీవితానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.

స్కాట్లాండ్‌లో బయటపడిన 2,000 ఏళ్ల నాటి అవశేషాలు

దాదాపు 2,000 ఏళ్ల క్రితం రోమన్ సామ్రాజ్య సరిహద్దు ప్రాంతం స్కాట్లాండ్‌లో ఈ వ్యక్తి జీవించాడు. ఆధునిక ఎడిన్‌బరో నగరానికి సమీపంలోని ఇన్వెరెస్క్ ప్రాంతంలో రోమన్ కోట దగ్గర అతడి సమాధిని గుర్తించారు. అక్కడ మరికొందరి అవశేషాలు కూడా బయటపడ్డాయి. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ అవశేషాలను పరిశీలించి, అతడి ముఖాన్ని కంప్యూటర్ సాయంతో పునర్నిర్మించింది. ఈ ప్రక్రియలో అధునాతన డీఎన్‌ఏ పరీక్షలు, ఎముకల విశ్లేషణ, ముఖ నిర్మాణ నమూనాలను ఉపయోగించారు. పునర్నిర్మించిన ముఖాన్ని, అసలు పుర్రెను వచ్చే నెలలో స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరోలో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ స్కాట్లాండ్‌లో ప్రజల సందర్శనార్థం ప్రదర్శించనున్నారు.

కత్తి పట్టలేని స్థితిలో కుడి చేయి!

ఈ వ్యక్తి క్రీ.శ. 140 నుంచి 165 మధ్య కాలంలో మరణించి ఉండవచ్చని అంచనా వేశారు. మరణించే సమయానికి అతడి వయసు 50 ఏళ్లు. అతడి అస్థిపంజరాన్ని పరిశీలించినప్పుడు పాత గాయాలకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. అతడి ముక్కు ఒకప్పుడు విరిగి, తర్వాత నయమైనట్లు గుర్తించారు. కుడి మోచేతి దగ్గర ఎముకపై అసాధారణ పెరుగుదల కీళ్ల వాపు తో ఏర్పడి ఉండొచ్చనీ, గాయాలను బట్టి అతడు సైనికుడు కాకపోవచ్చని  అంచనా వేశారు. ఎందుకంటే కత్తి పట్టడానికి అతడి చేతి కదలికలు సరిపోవు.

ఆరుగురిలో నలుగురి తలలు వేరు చేశారు!

ఈ పరిశోధనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం సమాధుల వద్ద బయటపడింది. ఇన్వెరెస్క్ ప్రాంతంలో గుర్తించిన ఆరుగురు పురుషుల సమాధుల్లో నలుగురి తలలను మరణించిన తర్వాత శరీరాల నుంచి వేరు చేసినట్లు ఆధారాలు లభించాయి. ముఖ పునర్నిర్మాణం చేసిన వ్యక్తి కూడా వారిలో ఒకడు. అయితే, ఈ వ్యక్తుల తలలను ఎందుకు వేరు చేశారనే దానిపై స్పష్టత లేదు. అది శిక్షలో భాగమా? అప్పటి ప్రజల సాంస్కృతిక ఆచారమా? లేక మరణానికి సంబంధించిన మూఢనమ్మకాల ప్రభావమా? అనే కోణాల్లో పరిశోధకులు పరిశీలిస్తున్నారు.

పురావస్తు పరిశోధనలో కొత్త ముందడుగు

ఇన్వెరెస్క్ ప్రాంతంలో లభించిన అవశేషాలపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నప్పటికీ, ఈ ముఖ పునర్నిర్మాణం ద్వారా అక్కడ నివసించిన వ్యక్తి ఎలా ఉండేవాడో తెలిసిందని స్కాట్లాండ్‌కు చెందిన పురావస్తు నిపుణుడు డాక్టర్ ఫ్రేజర్ హంటర్ తెలిపారు. ఎముకల పరిశీలన, డీఎన్‌ఏ పరీక్షలు, ఆధునిక ముఖ నమూనాల సాయంతో గతంలో జీవించిన వ్యక్తుల జీవితాల గురించి మరింత తెలుసుకోవచ్చని చెప్పారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us