
కొలంబియాలో ఆగస్ట్ 10న సంభవించిన భూకంపం ఊహకందని విషాదాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా దక్షిణ అమెరికా దేశంలో విరుచుపడిన ప్రకృతి విపత్తు లక్షలాది మంది జీవితాలను అతలాకుతలం చేసింది. కన్న వాళ్లను కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు, షాక్ నుంచి ఇంకా తేరుకోని వారినీ ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. శిథిలాల కింద నుంచి ఎప్పుడు తమ వారు బయటికొస్తారా అని నాలుగు రోజులుగా ఎదురుచూస్తున్నారు. అంతటి విషాదంలోనూ ఓ చిన్ని ప్రాణి “నేను బతికే ఉన్నాను” అంటూ బయటికొచ్చి కొత్త ఆశలను రేకెత్తించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారు జీవించే ఉండి ఉంటారన్న నమ్మకాన్ని ఇతరుల్లో కలిగించింద. నాల్గవ రోజు సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది శిథిలాల కింద సజీవంగా ఉన్న పిల్లి పిల్లను చూసి ఆనందంతో కేరింతలు కొట్టారు. నీరసించిన ఆ చిన్ని ప్రాణిని వెంటనే వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. దీంతో తమ వారిని ప్రాణాలతో చూస్తామన్న నమ్మకం అక్కడున్న కొందరికి కలిగింది. సోమవారం సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు దాదాపు 268 మంది మృతి చెందారు. 3 వేల మందికి పైగా గల్లంతయ్యారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా పశ్చిమ కొలంబియాలో భారీ ప్రాణనష్టం నమోదైంది. 70కి పైగా భూ ప్రకంపనలు అనంతరం విరుచుకుపడ్డాయి. భయంతో ఇళ్లల్లో తలదాచుకోలేకపోతున్న జనం. ఇళ్లకు వెళ్లలేక ఆరుబయటే ఆశ్రయం పొందుతూ అక్కడే నిద్రిస్తున్నారు. పెరీరా నగరంలో భూకంపం తీవ్రత ఎక్కువగా నమోదుకావడంతో శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక చర్యలను ముమ్మరం చేసారు. నాలుగంతస్థుల భవనాలు సైతం పేకమేడల్లా కూలిపోవడంతో సహాయకసిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాఫీ సాగుకు పేరు పొందిన మానిజాలెస్ పర్వత ప్రాంతంలో భారీ ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. పశ్చిమ కొలంబియాలోని మరికొన్ని నగరాలలో కూడా భూకంపం ఊహించని విధ్వంసం మిగిల్చింది. గల్లంతైన 3 వేల మంది కోసం ఆర్మీ గాలింపు చర్యలు చేపడుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాలి నగరంలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం శిథిలాల కింద నుంచి ఆరు నెలల పసిపాపను వెలికితీసారు. నూతన అధ్యక్షుడు అబెలార్డో గాబ్రియెల్ డి లా ఎస్ప్రియెల్లా నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ఈ భూకంపం తొలి సవాలుగా మారింది. జూన్ నెలలో పక్కనే ఉన్న వెనిజులాలో సంభవించిన భూకంపం తాలూకు విషాదం ఇంకా మరువక ముందే కొలంబియాలో ఈ దారుణం జరిగింది.