
బషీర్ బలూచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు BLA ప్రకటించిన వెంటనే బలూచ్ ఆచూకీపై రకరకాల కథనాలు తెరపైకి వచ్చాయి. పాకిస్థాన్ సైన్యం అనుకూల సోషల్ మీడియా ఆయనపై హత్యాయత్నం జరిగిందంటూ ప్రచారం చేసాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌లో బషీర్ బలూచ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తే విష ప్రయోగానికి పాల్పడ్డాడనీ పరిస్థితి విషమించడంతో సైనిక ఆసుపత్రికి తరలించినట్లు ప్రచారం జరిగింది. సెప్టెంబర్‌లో ఆఫ్ఘనిస్థాన్ భూభాగంలో పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో ఆయన హతమైనట్లు ప్రచారం జరిగింది. ఆయన గాయపడ్డారా? లేక రహస్యంగా తలదాచుకున్నారా? అన్నది మిస్టరీగా ఉంది.
బషీర్ బలూచ్ పేరు అంతర్జాతీయ భద్రతా వర్గాల్లో చర్చకు రావడానికి ప్రధాన కారణం BLA చేపట్టిన ‘ఆపరేషన్ హెరోఫ్’. ఆ సమయంలో విడుదలైన వీడియోలు సంచలనం సృష్టించాయి. ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా బషీర్ బలూచ్ మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఓ సాయుధ సంస్థకు నాయకత్వం వహించే వ్యక్తి ఇలా బహిరంగంగా కనిపించడం భద్రతా, నిఘా వర్గాల దృష్టిని ఆకర్షించింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు అకస్మాత్తుగా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించేందుకు BLA అధికారిక ప్రకటన విడుదల చేసింది. సీనియర్ కమాండ్ కౌన్సిల్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం సంస్థ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. బషీర్ బలూచ్ ఇకపై సంస్థ కమాండర్-ఇన్-చీఫ్‌గా కొనసాగరని స్పష్టం చేసింది.
కొత్త నాయకుడిని ఎంపిక చేసే వరకు పరిపాలన, సైనిక కార్యకలాపాలు, విధానపరమైన నిర్ణయాల బాధ్యతలను సీనియర్ కమాండ్ కౌన్సిల్‌కు అప్పగించినట్లు తెలిపింది. ఇదే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అనీ, నాయకత్వ మార్పు జరిగినప్పటికీ తమ కార్యకలాపాలు ఆగవని స్పష్టం చేసింది. సైనిక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. అంటే నాయకుడు మారినా సంస్థ కార్యకలాపాల్లో అంతరాయం ఉండబోదని చెప్పే ప్రయత్నం చేసింది.
తమ సంస్థలో నాయకత్వ మార్పు కొత్త విషయం కాదని BLA తన ప్రకటనలో వివరించింది. 2018లో సంస్థ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు వ్యవస్థాపకుడు ఉస్తాద్ అస్లాం బలూచ్ కీలక మార్పులు తీసుకొచ్చారు.
వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతూ సంస్థను ప్రతిభ, పారదర్శకత, సంస్థాగత నిబంధనల ఆధారంగా నడపాలని నిర్ణయించారు. ఎంతటి ప్రతిభావంతుడైన నాయకుడైనా జీవితాంతం కమాండర్-ఇన్-చీఫ్‌గా కొనసాగకూడదనే నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు.
ఈ నిబంధన ప్రకారం అక్టోబర్ 16న సంస్థలోని అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించినట్లు BLA తెలిపింది. ఈ సమావేశంలో సంస్థ రాజ్యాంగం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కార్యకలాపాలకు కొత్త ఊపునిచ్చేందుకు నాయకత్వ మార్పు చేయాలని కమాండర్లందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు.
బషీర్ బలూచ్ స్థానంలో కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌ను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందని BLA తెలిపింది. కొత్త నాయకుడి పేరును త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అప్పటివరకు సీనియర్ కమాండ్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే అన్ని వ్యవహారాలు కొనసాగుతాయనీ చెప్పింది.
అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. నిజంగానే ఇది సంస్థ రాజ్యాంగం ప్రకారం జరిగిన సాధారణ నాయకత్వ మార్పేనా? లేక బషీర్ బలూచ్ కనిపించకుండా పోవడానికి వెనుక మరేదైనా కారణం ఉందా? ఆయనపై విష ప్రయోగం జరిగిందనే ప్రచారం నిజమా? వైమానిక దాడిలో మరణించారనే వార్తల్లో వాస్తవమెంత? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
ప్రస్తుతానికి BLA మాత్రం నాయకత్వ మార్పు సంస్థాగత నిర్ణయమేనని చెబుతోంది. మరోవైపు బషీర్ బలూచ్ ఆచూకీపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. కొత్త కమాండర్ ప్రకటనతో పాటు ఆయన పరిస్థితిపై కూడా ఏదైనా సమాచారం బయటకు వస్తుందా అన్నది వేచి చూడాలి.