అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్!

Updated on: Jun 11, 2026 | 1:08 PM

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ మహిళ, తను నడుపుతున్న ఇండియన్ రెస్టారెంట్‌లో భారతీయులను ఉద్యోగంలోకి తీసుకోబోనని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆమె కామెంట్లపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ముంబైలో పుట్టి టెక్సాస్‌లో స్థిరపడ్డారు రష్మీ భట్ . ఆమెకు న్యూ బ్రాన్‌ఫెల్స్‌లో '7 మాంక్స్ కేఫ్' పేరుతో ఇండియన్, మెడిటరేనియన్ రెస్టారెంట్‌ ఉంది. ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఆమె ఏం చెప్పారంటే.. తన ఇండియన్ రెస్టారెంట్‌లో భారతీయులను నియమించుకోను అన్నారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాయి.

ఈ వ్యాఖ్యల వెనుక కారణాన్ని ఆమె స్పష్టంగా వివరించారు. తాము జాతీయత లేదా చర్మం రంగు ఆధారంగా కాకుండా, పని పట్ల శ్రద్ధ, నేర్చుకోవాలనే తపన, నమ్మకం వంటి లక్షణాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. స్థానిక సమాజంలోని వారికి, ముఖ్యంగా విద్యార్థులు, సింగిల్ మదర్స్, రిటైర్ అయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆమె అన్నారు. తమ సిబ్బందిలో కొందరికి భారతీయ ఆహారం గురించి మొదట తెలియకపోయినా, ఇప్పుడు వారే ఇష్టంగా కస్టమర్లకు వంటకాలను వడ్డిస్తున్నారనీ ఆమె తెలిపారు . రష్మీ భట్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తూ, స్కిల్‌కి ప్రాధాన్యత ఇవ్వడం సరైనదేనని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం, భారతీయ వంటకాల అసలైన రుచి, వాటిపై అవగాహన భారతీయ సిబ్బందికి మాత్రమే ఉంటుందని, వారిని నియమించుకోకపోవడం సరైన పద్ధతి కాదని విమర్శిస్తున్నారు. మొత్తంమీద, రెస్టారెంట్లలో తమ దేశం కాని వారిని నియమించడం, వ్యాపార అవసరాలకు సంబంధించిన చర్చను ఆమె లేవదీసినట్లయింది.

Published on: Jun 11, 2026 11:18 AM
Follow Us