చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయిగూడ గ్రామంలో ఓ ఉపాధ్యాయుడికి విద్యార్థులు, గ్రామస్థులు అపూర్వ వీడ్కోలు పలికారు. రాయిగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పనిచేసిన నైతం ప్రభాకర్ రావు అక్టోబర్ 31న పదవీ విరమణ పొందారు. ఆయన సేవలకు గుర్తుగా ఎడ్లబండిపై కూర్చోబెట్టి గ్రామంలో ఊరేగింపుగా పాఠశాలకు తీసుకెళ్లారు. శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ భావోద్వేగ ఘటన గురుశిష్య బంధానికి నిదర్శనంగా నిలిచింది.
గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు.. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే మార్గదర్శి.. అక్షరజ్ఞానంతో పాటు జీవిత పాఠాలు నేర్పించే దిక్సూచి.. అలాంటి గురువు సేవలకు పదవీ విరమణతో ముగింపు పలకవచ్చేమో కానీ.. ఆయన అందించిన విద్య, చూపిన మార్గం, పంచిన ఆప్యాయత మాత్రం తరతరాల పాటు గుర్తుండిపోతాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచింది ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయిగూడ గ్రామంలో జరిగిన ఓ అపూర్వ వీడ్కోలు వేడుక. రాయిగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన నైతం ప్రభాకర్ రావు అక్టోబర్ 31న పదవీ విరమణ పొందారు. ఎన్నో ఏళ్లుగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తుకు పునాదులు వేసిన ఆయనకు గ్రామస్థులు, విద్యార్థులు వినూత్న రీతిలో వీడ్కోలు పలికారు. ఆదివారం గ్రామస్థులు, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులంతా ఒక్కటై.. తమ అభిమాన గురువును ఘనంగా ఎడ్లబండిపై కూర్చోబెట్టి పాఠశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. పల్లె వాతావరణంలో సాగిన ఈ ఊరేగింపు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తమ గురువుపై ఉన్న గౌరవాభిమానాలను చాటుకుంటూ పలువురు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ప్రభాకర్ రావును శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఒక ఉపాధ్యాయుడు సంపాదించుకునే అసలైన ఆస్తి డబ్బు కాదని, విద్యార్థుల ప్రేమాభిమానాలేనని ఈ ఘటన మరోసారి నిరూపించింది. తరగతి గదులు, వేలాది జ్ఞాపకాలతో సాగిన ఆయన ప్రయాణానికి ఉద్యోగ రీత్యా ముగింపు పలికినా, విద్యార్థుల హృదయాల్లో ఆయన స్థానం శాశ్వతం. నేటి తరానికి గురుశిష్య బంధం గొప్పతనాన్ని చాటిన ఈ వీడ్కోలు వేడుక అందరికీ ఆదర్శంగా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
1 కిలో వెండి ధర 10 గ్రాముల బంగారంతో సమానమవుతుందా?
దొంగ స్వాముల మోసం.. బుద్ధి చెప్పిన గ్రామస్తులు
కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి మళ్లీ చెమటలు!
EPFO: ఇకపై వాట్సప్ నుంచే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు!
Charan-Sukumar Film: చరణ్ హీరోయిన్గా తెలుగమ్మాయి.. ఇంతకీ ఎవరీ బ్యూటీ.. అంటే..