బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఓ బావిలో ఐదు రోజులుగా భారీ అలల మాదిరిగా నీళ్లు ఎగసిపడటం స్థానికుల్లో భయాందోళనలు రేపింది. భూకంపానికి సంకేతమని గ్రామస్థులు ఆందోళన చెందినా, అధికారులు అలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరగడం, రాళ్ల మధ్య చిక్కుకున్న గాలి నీటి ఒత్తిడితో బయటకు రావడం వల్లే ఈ అలజడి ఏర్పడి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు.
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో అరుదైన, వింత సంఘటన జరిగింది. వీర్‌పార్థ గ్రామంలోని ఓ బావిలో గత ఐదు రోజులుగా భారీ అలలుగా నీళ్లు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి . ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే ఇది భూకంపానికి సంకేతం కాదని, భూగర్భంలో జరిగే సహజమైన ప్రక్రియేనని జిల్లా అధికారులు ప్రాథమికంగా స్పష్టం చేశారు. సుమారు 18 అడుగుల లోతుగల ఈ బావిని 3 నెలల క్రితం ప్రాంజీవన్ సదరియా అనే రైతు తన పొలంలో తవ్వించారు. ఆగస్టు 2వ తేదీనే ఉన్నట్టుండి బావిలోని నీటిలో కదలికలు రావడం గమనించారు. నీళ్లు నిరంతరం అలలలా ఎగసిపడుతూ, బావి అంచుల నుంచి బయటకు పొంగిపొర్లడం మొదలైంది. దీంతో ప్రజల్లో రకరకాల ప్రచారాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. బావిలో నీళ్లు ఎగసిపడుతుండటంతో.. ఇక్కడ భూకంపం వచ్చే అవకాశం ఉందని మొదట గ్రామస్థులు భయపడ్డారు. దీనిపై జిల్లా భూగర్భ శాస్త్రవేత్త జేఎస్ వధేర్ స్పందిస్తూ.. ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే సూచనలు ఏమీ లేవని గాంధీనగర్‌లోని భూకంప పరిశోధనా సంస్థ స్పష్టం చేసిందన్నారు. ఈ ఘటనపై మరింత క్లారిటీ ఇస్తూ “ఈ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భూగర్భ జలాలు వేగంగా నిండుతున్నాయి. ఈ క్రమంలో రాళ్ల మధ్య ఖాళీ ప్రదేశాలలో చిక్కుకున్న గాలి, నీటి ఒత్తిడికి బయటకు విడుదల కావడం వల్లే బావిలోని నీటిలో ఈ అలజడి ఏర్పడుతోందని ప్రాథమికంగా భావిస్తున్నామని ఆయన వివరించారు. మరోవైపు గాంధీనగర్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్’ కూడా దీనిపై ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంతంలో ఎలాంటి క్రియాశీలక భూపాత రేఖలు లేవని, ఇటీవల భూప్రకంపనలు ఏవీ నమోదు కాలేదని ధ్రువీకరించింది. మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖరే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, సమగ్ర విచారణ కోసం గాంధీనగర్ నుంచి నిపుణుల బృందం త్వరలోనే విర్పర్ద గ్రామానికి రానుందని తెలిపారు. ఆ నిపుణుల పరిశోధనల తర్వాతే ఈ వింత వెనుక ఉన్న అసలు కారణంపై పూర్తి స్పష్టత రానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
యూపీఐ సేవలు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. కేంద్రం కీలక ప్రకటన
Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో వారం పాటు వర్షాలు!
