వెయ్యేళ్ల నాటి నిధి లభ్యం.. అంతా స్వచ్ఛమైన బంగారమే

Updated on: May 16, 2026 | 12:59 PM

డెన్మార్క్‌లోని రోల్డ్ స్కోవ్ అడవిలో వైకింగ్ యుగానికి చెందిన అరుదైన బంగారు నిధి వెలుగులోకి వచ్చింది. 10వ శతాబ్దానికి చెందిన ఆరు బంగారు కడియాలు లభించగా, ఇవి వైకింగ్ రాజు హరాల్డ్ బ్లూటూత్ కాలం నాటివని నిపుణులు గుర్తించారు. సుమారు వెయ్యేళ్ల నాటి ఈ ఆభరణాలు అప్పటి సామాజిక స్థితిగతులు, సంపదపై కీలక సమాచారం అందించే అవకాశముంది.

డెన్మార్క్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన యుగంగా పరిగణించే ‘వైకింగ్’ కాలం నాటి అద్భుతమైన బంగారు నిధి బయటపడింది. హిమ్మర్‌ల్యాండ్ ప్రాంతంలోని ‘రోల్డ్ స్కోవ్’ అడవిలో లభించిన ఈ పురాతన ఆభరణాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతత్వ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. డానిష్ చరిత్రలో ఇప్పటివరకు దొరికిన వైకింగ్ నిధుల్లో ఇది మూడవ అతిపెద్ద నిధి కావడం విశేషం. మెటల్ డిటెక్టర్లతో జరిపిన గాలింపులో సుమారు 762.5 గ్రాముల బరువున్న ఆరు బంగారు కడియాలు లభ్యమయ్యాయి. ఇవి 10వ శతాబ్దానికి చెందినవని, ప్రఖ్యాతిగాంచిన వైకింగ్ రాజు ‘హరాల్డ్ బ్లూటూత్’ కాలం నాటివని నిపుణులు నిర్ధారించారు. సాధారణంగా ఆ కాలంలో వెండి ఆభరణాలు ఎక్కువగా ఉండేవని, ఇంత స్వచ్ఛమైన, భారీ మొత్తంలో బంగారం లభించడం అత్యంత అరుదని నార్త్ జట్‌లాండ్ మ్యూజియం ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ ఆభరణాలు ఏవైనా సమాధుల వద్ద కాకుండా, అటవీ మార్గంలో దొరకడంపై శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన విశ్లేషణలు చేస్తున్నారు. ఆ కాలంలో శత్రు దాడుల భయంతో వీటిని భూమిలో దాచిపెట్టడం లేదా దేవుళ్లకు మొక్కుబడిగా సమర్పించి ఉండవచ్చని పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఆరు కడియాలు ఒకే రకమైన కళా నైపుణ్యంతో తయారు చేయడం చూస్తుంటే, ఇవి అప్పట్లో అత్యంత శక్తివంతులైన ప్రభువులకు చెందినవని అంచనా వేస్తున్నారు. డెన్మార్క్ చట్టం ప్రకారం, ఇలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న వస్తువులను వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలి. ఈ కడియాలను డెన్మార్క్ నేషనల్ మ్యూజియంకు తరలించారు. అక్కడ నిపుణులు వీటి తయారీలో ఉపయోగించిన లోహ మిశ్రమాలు, ఆ కాలం నాటి కళాఖండాల నైపుణ్యాన్ని పరిశోధిస్తున్నారు. 1000 సంవత్సరాల నాటి ఈ బంగారం ద్వారా నాటి సామాజిక స్థితిగతులు, సంపద పంపిణీపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా శవాన్ని అమ్మానాన్నలకు చూపించొద్దు.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్

డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్తే హెయిర్‌కట్! వైరల్ అవుతున్న ‘సెలూన్ ఏటీఎం’ కథ

Follow Us