చక్రపాణి ‘చక్రవ్యూహం’ అదిరిపోయిందిగా.. ఏకంగా రూ. 2.65 కోట్లు స్వాహా..
నల్గొండ జిల్లా దేవరకొండలోని SBI బ్రాంచ్‌లో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కోట్లాది రూపాయల భారీ బ్యాంక్ మోసానికి పాల్పడ్డాడు. చక్రపాణి అనే అటెండర్, బ్యాంకు సిబ్బంది ఐడీలు ఉపయోగించి, లావాదేవీలు లేని ఖాతాలను లక్ష్యంగా చేసుకున్నాడు. వాటికి తన ఫోన్ నంబర్ అనుసంధానించి, నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బును తన మిత్రుల ఖాతాలకు, అక్కడి నుంచి తన ఖాతాకు బదిలీ చేశాడు. కస్టమర్ ఫిర్యాదుతో మోసం బయటపడగా, నిందితుడు పరారీలో ఉన్నాడు.
కంచే చేను మేసిన చందంగా.. తాను కూర్చున్న కొమ్మ తానే నరుక్కున్నట్టుగా తను పనిచేసే బ్యాంకులోనే కన్నమేసి ఏకంగా కోట్ల రూపాయలు కాజేశాడు ఓ అటెండర్. ఈ కిలాడీ అటెండర్ తెలివితేటలకు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. నల్లగొండ జిల్లా దేవరకొండ SBI బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగింది. నల్లగొండ జిల్లా దేవరకొండ SBI బ్రాంచ్‌లో చక్రపాణి అనే వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. డిగ్రీ చదువుకునన చక్రపాణికి కంప్యూటర్ పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. బ్యాంకు సిబ్బంది తమ పనుల కోసం అతనికి ఐడీలు, పాస్‌వర్డ్‌లు ఇచ్చేవారు. ఇదే అతనికి వరంగా మారింది. సిబ్బంది భోజనానికి వెళ్లిన సమయంలో వారి సిస్టమ్స్‌లో లాగిన్ అయ్యి.. ఏళ్ల తరబడి లావాదేవీలు లేని, మొబైల్ నంబర్లు లింక్ అవ్వని స్తబ్దుగా ఉండే ఖాతాల వివరాలను సేకరించాడు. హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల్లోని ఖాతాలను గుర్తించి, కేవైసీ కోసం అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి, వాటికి తన మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేశాడు. నెట్ బ్యాంకింగ్ ద్వారా హైదరాబాద్, వరంగల్ శాఖలలోని కొందరి ఖాతాల నుండి డబ్బును తన మిత్రుల ఖాతాల్లోకి మళ్లించి, అక్కడి నుంచి తన అకౌంట్‌కు బదిలీ చేసుకున్నాడు. ఇలా విడతల వారీగా కోట్లాది రూపాయలు స్వాహా చేశాడు. అయితే, హైదరాబాద్‌కు చెందిన ఓ కస్టమర్ ఖాతా నుంచి నగదు బదిలీ అయినప్పుడు అతనికి మెసేజ్ వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. ఆ ఖాతాదారుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆపరేషన్ అంతా దేవరకొండ బ్రాంచ్ నుంచే జరిగినట్లు గుర్తించి షాక్ తిన్నారు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ ఫణీంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో దేవరకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి స్నేహితుడి ఖాతాలో ఉన్న రూ. 89 లక్షలను ఫ్రీజ్ చేశారు. ప్రస్తుతం నిందితుడు చక్రపాణి పరారీలో ఉండగా, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఈ మోసానికి ఒక కారణమని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్
రహదారిపై ఒంటరి ఏనుగు హల్చల్.. భయంతో వణికిపోయిన జనం
చోరీ చేయడం ఈజీగా దొరికిపోవడం ఈ దొంగ ప్రత్యేకత
తల్లిదండ్రులు తినే చపాతీలలో ఎలుకల మందు కలిపిన కూతురు..
JD Chakravarthy: స్లో పాయిజన్ ఇచ్చారు.. చావు అంచులదాకా వెళ్లా..
