కిరాణా వ్యాపారికి ఫోన్‌ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే

Updated on: Apr 03, 2026 | 3:43 PM

కృష్ణా జిల్లా కంకిపాడులో నకిలీ ఫోన్‌పే స్క్రీన్‌తో వ్యాపారికి బురిడీ కొట్టించాడు ఓ కేటుగాడు. రూ.10,000 విలువైన సరుకును అపహరించాడు. పేమెంట్ రాలేదని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులు కేవలం కస్టమర్ చూపించే స్క్రీన్‌ను కాకుండా, తమ మొబైల్‌కు వచ్చిన బ్యాంక్ ఎస్ఎంఎస్‌ను ధృవీకరించుకోవాలని పోలీసులు సూచించారు. జాగ్రత్తలు పాటించకుంటే ఇలాంటి మోసాలకు గురయ్యే అవకాశం ఉంది.

టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కేటుగాళ్లు సామాన్య వ్యాపారుల పొట్ట కొడుతున్నారు. ఫేక్ ఫోన్‌పే స్క్రీన్ చూపించి బురిడీ కొట్టించిన ఒక ఘరానా మోసం కృష్ణా జిల్లా కంకిపాడులో వెలుగుచూసింది. వ్యాపారికి మాయమాటలు చెప్పి, పదివేల రూపాయల విలువైన సరుకుతో ఉడాయించిన కేటుగాడి ఉదంతం ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టించింది. కంకిపాడు రైతుబజార్ సమీపంలోని అమీర్ కిరాణా షాప్ కి బుధవారం రాత్రి ఒక వ్యక్తి బైక్‌పై వచ్చాడు. మంచి క్వాలిటీ బియ్యం బస్తాలు కావాలంటూ యజమానితో రేటు విషయంలో బేరసారాలు సాగించి నమ్మకం కలిగించాడు. చివరకు మూడు బియ్యం బస్తాలు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బులు ఫోన్‌పే ద్వారా చెల్లిస్తానని చెప్పి, యజమాని మొబైల్ నంబర్ తీసుకున్నాడు. కొద్దిసేపటికే తన మొబైల్‌లో ‘పేమెంట్ సక్సెస్’ అని కనిపిస్తున్న స్క్రీన్‌ను యజమానికి చూపించాడు. ఆ స్క్రీన్‌ను నిజమని నమ్మిన దుకాణదారుడు ఎలాంటి ధృవీకరణ చేసుకోకుండానే బియ్యం బస్తాలను అప్పగించాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన కాసేపటికి తన బ్యాంక్ ఖాతాను తనిఖీ చేయగా, పైసా కూడా జమ కాలేదని తెలిసి యజమాని షాకయ్యాడు. సుమారు రూ.10,000 నష్టపోయానని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. దుకాణంలోని సీసీ కెమెరాల్లో నిందితుడి కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు తీసుకునే వ్యాపారులు కేవలం కస్టమర్ చూపించే స్క్రీన్ లేదా మెసేజ్‌లను చూసి నమ్మవద్దని, మీ స్వంత మొబైల్‌లో బ్యాంక్ నుండి ఎస్ఎంఎస్ వచ్చిందో లేదో చూసుకున్న తర్వాతే సరుకు ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎవరేమనుకున్నా.. ఈ ఎన్నికల్లో నా సపోర్ట్‌ విజయ్‌కే

రోజా కూతురికి అరుదైన గౌరవం.. వావ్ !! గ్రేట్ అఛీవ్‌మెంట్ ఇది

Ram Charan: హీరో చెప్పినా నమ్మకుంటే ఎలా ?? ఆలస్యం కాదు

Telangana: అన్నదాతకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Follow Us