ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు.. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు!
ఏలూరు జిల్లాకు చెందిన వెంకటరత్నం కేవలం ఎకరన్నర పొలంలో సమగ్ర ప్రకృతి వ్యవసాయంతో ఏడాదికి రూ.3.29 లక్షల నికర లాభం ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వరి సాగుతో పాటు కందకాల్లో చేపల పెంపకం, గట్లపై 50 రకాల పండ్లు, పూలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులను పూర్తిగా వదిలి జీవామృతం, పంచగవ్య వంటి సహజ పద్ధతులతో పెట్టుబడిని తగ్గించి బహుముఖ ఆదాయం పొందుతున్నారు.
రసాయన ఎరువుల మోతాదు పెరిగి, పెట్టుబడులు తడిసిమోపెడై అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు ఆశాకిరణంగా నిలుస్తున్నారు. సంప్రదాయ మూస ధోరణికి స్వస్తి పలికి, ఆధునిక ఆలోచనలతో సమగ్ర ప్రకృతి వ్యవసాయాన్ని చేపడితే స్వల్ప విస్తీర్ణంలోనే స్థిరమైన ఆర్థిక భరోసా పొందవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. కేవలం ఎకరన్నర పొలంలో ఏడాదికి రెండు పంటలు వరి పండిస్తూ, ఇంటి అవసరాలకు సరిపడా పండ్ల చెట్లను, చేపలను పెంచుతూ వినూత్నమైన ఇండోనేషియా మోడల్ వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామానికి చెందిన వెంకటరత్నం అనే రైతు కేవలం ఒకటిన్నర ఎకరం పొలంలో సమగ్ర సాగు పద్ధతులను అవలంభిస్తూ ఏడాదికి రూ. 3,29,300 నికర లాభాన్ని ఆర్జిస్తున్నారు. తద్వారా ఉమ్మడి గోదావరి జిల్లాల రైతు లోకానికి ఆదర్శంగా నిలిచారు. 2015లో హైదరాబాద్‌లో రైతు సాధికార సంస్థ నిర్వహించిన సదస్సులో ఇండోనేషియాకు చెందిన సమగ్ర నమూనా ఆయనను ఎంతగానో ఆకర్షించింది. మెట్ట ప్రాంతం, బోరుబావి ఆధారిత భూమిలోనే పట్టుదలతో ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. మొత్తం ఎకరంన్నర విస్తీర్ణంలో మధ్య భాగంలోని 70 సెంట్లలో సంప్రదాయ దేశవాళీ వరి సాగు చేస్తున్నారు. పొలం చుట్టూ 5 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతుతో భారీ కందకాన్ని నిర్మించి, అందులో నీటి పొరలకు అనుగుణంగా శీలావతి, కట్ల, కొరమీను, రూప్‌చంద్ వంటి నాలుగు రకాల చేపలను బహుళ అంచెల పద్ధతిలో పెంచుతున్నారు. అదే సమయంలో చెరువు గట్లపై ఏమాత్రం స్థలం వృథా కాకుండా దాదాపు 50 రకాల పండ్లు, పూలు, కూరగాయల మొక్కలను పెంచుతూ బహుముఖ ఆదాయాన్ని పొందుతున్నారు. 2007 నుంచే రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులను పూర్తిగా నిషేధించిన వెంకటరత్నం, స్వయంసిద్ధ పద్ధతులతోనే నేలను సారవంతం చేసుకుంటున్నారు. మొక్కల పోషణకు ఘన, ద్రవ జీవామృతాలు, పంచగవ్య, చేప-బెల్లం ద్రావణం, కోడిగుడ్డు-నిమ్మరసం మిశ్రమాలను వాడుతున్నారు. తెగుళ్ల నివారణకు మేకలు తినని 33 రకాల ఔషధ ఆకులతో ఆవు మూత్రం కలిపి కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. సాధారణ రసాయన సాగులో ఎకరానికి రూ. 35,000 నుంచి రూ. 36,000 వరకు ఖర్చు వస్తుండగా, ఈ ప్రకృతి సేద్యం ద్వారా పెట్టుబడిని రూ. 18,000 నుంచి రూ. 20,000 లోపే పరిమితం చేసుకున్నారు. మార్కెట్లో లభించే హైబ్రిడ్ విత్తనాలకు దూరంగా ఉంటూ నవార, తులసిబాసో, కూజిపటాలియా, మైసూరు మల్లిక, ఇంద్రాణి వంటి దేశవాళీ వరి రకాలను మాత్రమే ఆయన పండిస్తున్నారు. చెరువు గట్లపై సాగుతున్న పంటల్లోనూ అరుదైన వైవిధ్యం కనిపిస్తుంది. మధుమేహ బాధితులకు ఉపయోగపడే రకాలతో పాటు తైవాన్, సఫేదా, గులాబీ, బీట్‌రూట్ వర్ణాల్లో ఉండే 6 రకాల జామలను పెంచుతున్నారు. అరటిలోనూ గెలకే వెయ్యి కాయలు కాసే ‘సహస్రవల్లి’, చక్రకేళి, మహారాష్ట్ర రకాలను సాగు చేస్తున్నారు. వీటితో పాటు మునగ, సపోటా, మామిడి, నేరేడు, కొబ్బరి చెట్లు నిరంతరం రాబడిని అందిస్తున్నాయి. రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే పంటను ముడి సరుకుగా కాకుండా విలువ జోడించి నేరుగా వినియోగదారుడికి అందించడమే మార్గమని ఆయన నమ్ముతున్నారు. ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా, మరపట్టించి కిలో రూ. 80 చొప్పున బియ్యాన్ని విక్రయిస్తున్నారు. ట్రెంచ్‌లో పెరిగే చేపలకు సాధారణ మార్కెట్ కంటే అదనపు ధర లభిస్తోంది. భవిష్యత్తులో చేపల పచ్చళ్ల తయారీ యూనిట్ ఏర్పాటుతో పాటు, నీటిపై పందిళ్లు, నాటుకోళ్లు, మేకల పెంపకాన్ని అనుసంధానించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్! భారీగా తగ్గిన ఎయిర్‌పోర్ట్ ఫీజు
ఇస్రో సంచలన నిర్ణయం.. ఇకపై రాకెట్ల తయారీకి గుడ్ బై
Sugar Price: ఘాటెక్కిన చక్కెర.. పండగ వేళ సామాన్యులకు చుక్కలు
