వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ అనే ప్రమాదకర పరాన్నజీవి ఈగ మళ్లీ కలకలం రేపుతోంది. పశువుల గాయాల్లో గుడ్లు పెట్టి, వాటి నుంచి బయటకు వచ్చే లార్వాలు మాంసాన్ని తింటూ పెరగడం వల్ల పాడి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈగల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం స్టెరిలైజ్ చేసిన మగ ఈగలను విడుదల చేసే చర్యలు చేపట్టింది.
ప్రపంచ దేశాలను భయపెట్టే అమెరికాను ఓ ఈగ హడలెత్తిస్తోంది. కొద్ది రోజులగా టెక్సాస్‌లోని పాడి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. న్యూ వరల్డ్ స్క్రూవార్మ్‌గా పిలిచే ఈగ పాడి రైతులను నష్టాల పాలు చేస్తోంది. దాంతో ఈగ కోసం ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి స్టెరిలైజ్ చేసిన మగ ఈగలను సిద్దం చేస్తోంది. ఆ ఈగలు పరాన్న జీవులు కావడంతో ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెలపై వాలుతున్నాయి. పూర్తిగా ఎదిగిన స్క్రూవార్మ్ పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతాయి. పశువుల పుండే వాటికి ఆవాసం. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతాయి. మరో పశువుపై వాలి సంతతిని వృద్ధి చేస్తాయి. టెక్సాస్‌లో ప్రాణాంతక స్క్రూవార్మ్ ఈగ ఓ దూడను గాయపరచడంతో అధికారులు అలర్టయ్యారు. ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. టెక్సాస్ నుంచి పశువులు, గుర్రాల దిగుమతిని కెనడా నిషేధించింది. అమెరికాకు స్క్రూవార్మ్ కొత్తదేమీ కాదు. ఈ ప్రమాదకర పరాన్నజీవి మళ్లీ కనిపించి పశుసంవర్థక రంగానికి పెనుముప్పుగా మారింది. ఈ వ్యాధి ప్రధానంగా పశువులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, అరుదుగా మనుషులకు కూడా సోకుతుంది. గతంలో ఓ వ్యక్తికి సోకిన కేసులో శస్త్రచికిత్స ద్వారా పురుగులను తీసేసి మందులతో నయం చేశారు. పశువుల రక్తమాంసాలు రుచి మరిగిన ప్రాణాంతక ఈగలను అంతం చేయడం అంత ఈజీ కాదు. ఇది చాలా వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి జాగిలాలను ఉపయోగిస్తున్నారు. ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి. స్క్రూవార్మ్ ఈగలను అరికట్టడానికి పెద్ద తతంగమే ఉంటుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లుగా ఈగలను ఈగలతోనే నియంత్రిస్తారు. మగ ఈగలను సేకరించి, ప్రయోగశాలలో స్టెరిలైజ్ చేస్తారు. ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకడతాయి. దాంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అమెరికాలో ఇలాంటి ఈగల బెడద ఇదే మొదటిసారి కాదు. 1960, 1970వ దశకంలోనూ ఈగలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఇంట్లో పెంచుకొనే కుక్కలు, పిల్లులకు కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా! అంబానీ కోడలు రాధిక ఏం చెప్పారో తెలుసా?
పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. మొసలి నోటికి చిక్కాడు..
రండి బాబూ రండి.. ప్రభుత్వ స్కూల్లో చేరండి.. గ్రామాల బాట పట్టిన బడిపంతుళ్లు.. డప్పు కొడుతూ..