కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో తొమ్మిది వివాహిత జంటలు మరోసారి పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. మొదటి వివాహ సమయంలో ముహూర్తం సరిగా లేకపోవడం వల్లే కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వారు నమ్ముతున్నారు. ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్టు సూచనతో శుభముహూర్తంలో మరోసారి మాంగళ్యధారణ చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన జంటలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇదేంటి.. ఒక్క వివాహంతోనే అనేక సమస్యలతో సతమతమవుతుంటే.. మళ్లీ పెళ్లిచేసుకోమంటున్నారు? అనుకుంటున్నారా.. ఆగండాగండి.. మేం చెప్పిందీ..రెండోపెళ్లి చేసుకోమని కాదు.. రెండోసారి పెళ్లిచేసుకోమని.. అర్థం కాలేదా.. అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని సన్నిధిలో విచిత్రమైన, ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే పెళ్లయి, సంసార జీవితాన్ని గడుపుతున్న తొమ్మిది జంటలు మరోసారి వివాహం చేసుకున్నాయి. మొదటి పెళ్లి సమయంలో ముహూర్త గడియలు బాగోలేకపోవడం వల్లే కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వీరు నమ్ముతున్నారు. మంచి ముహూర్తంలో రెండోసారి పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలు తొలగిపోతాయనే ప్రగాఢ విశ్వాసంతో ఈ వివాహాలు చేసుకున్నారు. ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్టు సలహా మేరకు ఇలా మరోసారి పెళ్లి చేసుకున్నామని ఈ జంటలు చెబుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ, సంప్రదాయబద్ధంగా శ్రీసత్యనారాయణస్వామివారి సన్నిధిలో మరోసారి భార్యాభర్తలు మాంగళ్యధారణ గావించుకుని ప్రత్యేక వ్రతాలు ఆచరించారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం నుండి 6 జంటలు, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల నుంచి 3 జంటలు ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే, ఈ జంటలలో కొందరికి ఇప్పటికే పిల్లలు ఉండగా, మరికొందరి పిల్లలు పెద్ద వయసులో ఉండటం విశేషం. ఒకసారి పెళ్లయిన వారు మళ్లీ పెళ్లి చేసుకోవడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి
