Bermuda Triangle: 3 కోట్ల ఏళ్ల బెర్ముడా దీవి మిస్టరీని.. ఛేదించిన శాస్త్రవేత్తలు

Updated on: May 19, 2026 | 5:13 PM

దశాబ్దాలుగా ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తున్న బెర్ముడా ట్రయాంగిల్ రహస్యంపై శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. సముద్ర గర్భంలో తక్కువ సాంద్రత కలిగిన భారీ రాతి పొర కారణంగా బెర్ముడా దీవులు ఎత్తుగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఇదే సమయంలో విమానాలు, ఓడల అదృశ్యాల వెనుక ఎలియన్స్, మీథేన్ వాయువు, మేగ్నెటిక్ ఫోర్స్ వంటి థియరీలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.

ఈ భూమ్మీద ఇప్పటి వరకూ అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రశ్నలకు ఆలవాలమైన ప్రాంతాలు కూడా మరెన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి బెర్ముడా ట్రయాంగిల్. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఫ్లోరిడా, ప్యూర్టోరికో, బెర్ముడా దీవి.. ఈ మూడింటినీ కలిపి బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ చోటు చేసుకున్న ఘటనల కారణంగా దీన్నొక మిస్టరీ ప్రాంతంగా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యధికంగా షిప్పులు, విమానాలు ప్రయాణించే బిజీ లేన్లలో దీనిని ఒకటిగా చెబుతారు. ఈ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తూ కొన్ని ఓడలు, విమానాలు అదృశ్యమయ్యాయి. ఇవి సముద్రంలో మునిగిపోయాయా? అందుకు గల కారణాలేంటి? అనేది మిస్టరీగానే ఉండిపోయింది. దీంతో, బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతం మిస్టీరియస్ ఏరియాగా పాపులర్ అయ్యింది. అక్కడ ఏదో నిగూఢ శక్తి ఉందన్న ప్రచారం దశాబ్దాల తరబడి సాగుతోంది. కానీ, పరిశోధకులు దీనిని కొట్టిపారేస్తుంటారు. ఈ విమానాలు, ఓడల అదృశ్యాలను పక్కన పెడితే, బెర్ముడా ప్రాంతంలో మరో విషయం కూడా సైంటిస్టులకు అంతుచిక్కకుండా ఉంది. దీనిపై దశాబ్దాల తరబడి పరిశోధనలు సాగిస్తున్నారు. తాజాగా, ఆ రహస్యాన్ని ఛేదించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. బెర్ముడా దీవులు సాగరగర్భం కన్నా ఎత్తైన ప్రదేశంపై ఉన్నాయి. అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగినప్పుడు మాత్రమే ఇలా ఎత్తైన ప్రదేశాలు ఉద్భవిస్తాయి. కానీ, గత 3 కోట్ల సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అగ్నిపర్వతాలు విస్పోటనం చెందిన దాఖలాలు లేవు. మరి, ఎలా ఈ దీవులు ఎత్తైన ప్రాంతంలో ఉన్నాయో పరిశోధకులకు అర్థం కాలేదు. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తున్నారు. హవాయ్‌ లాంటి అనేక అగ్నిపర్వత దీవుల సమూహాలు ఏర్పడడానికి కారణముంది. భూమిలోని మ్యాంటిల్‌ పొర నుంచి పైకి చొచ్చుకొచ్చే హీట్ పదార్థం పైకి వస్తున్నకొద్దీ అగ్నిపర్వతాలు పుట్టుకొస్తాయి. తద్వారా అక్కడి సాగరగర్భం ఉబ్బెత్తుగా తయారవుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి అగ్నిపర్వత చర్య చల్లారి, ఉబ్బెత్తుగా ఉన్న ప్రదేశం కూల్ అయిపోతుంది. అలా ఎత్తైన ప్రదేశాలు ఏర్పడుతాయి. కానీ, బెర్ముడాలో మాత్రం అలా జరగలేదు. పరిసర ప్రాంతాల కన్నా దాదాపు 1,600 అడుగుల ఎత్తైన ప్రదేశం ఏర్పడింది. 3 కోట్ల ఏళ్లుగా అక్కడ అగ్నిపర్వతాల చర్యలు లేకున్నా, ఆ ప్రాంతం ఇప్పటికీ ఎందుకు కిందకు దిగడం లేదనే విషయమై సైంటిస్టులు పరిశోధనలు ప్రారంభించారు. కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ సైన్స్‌కు చెందిన విలియం ఫ్రేజర్, యేల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త జెఫ్రీ పార్క్‌ ఆధ్వర్యంలో పరిశోధకుల బృందం రీసెర్చ్ స్టార్ట్ చేసింది. భారీ భూకంపాల వల్ల ప్రొడ్యూస్ అయిన సీస్మిక్‌ తరంగాల ఆధారంగా వారు పరిశోధనలు సాగించారు. ఈ తరంగాలు భూమి గుండా చొచ్చుకెళతాయి. ఈ క్రమంలోనే ఎదురయ్యే పదార్థ సాంద్రత, అందులోని మూలకాలను బట్టి వాటి వేగం పెరగడమో తగ్గడమో జరుగుతుంది. బెర్ముడాపై ఉన్న ఒక భూప్రకంపన అధ్యయన కేంద్రంలో నమోదైన డేటాను పరిశోధకులు విశ్లేషించారు. తద్వారా ఆ దీవి కింద 25 కిలోమీటర్ల వరకూ విస్తరించిన భూ అంతర్భాగ చిత్రాన్ని ఆవిష్కరించారు. అందులో అనూహ్య అంశం వెలుగుచూసింది. అక్కడ భూపైపొర కింద 12 మైళ్ల మందం ఉన్న ఒక శిలాపొరను గుర్తించారు. ఈ శిల, పరిసరాల్లోని మ్యాంటిల్‌ భాగం కన్నా తక్కువ సాంద్రతను కలిగి ఉందట. అందువల్లే అసాధారణ స్థాయిలో తేలియాడే తత్వాన్ని సొంతం చేసుకుందని తేల్చారు. అది ఒక బల్లకట్టులా ఉంటూ.. సబెర్ముడాను తేలియాడేలా చూస్తోందని కనుగొన్నారు. ఈ రాతిపొరను అండర్‌ప్లేటింగ్‌ అంటున్నారు. కోట్ల ఏళ్ల క్రితం బెర్ముడా ప్రాంతంలో క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నప్పుడు, భూమి లోతుల్లో నుంచి చొచ్చుకొచ్చిన శిలాద్రవం చల్లబడి ఇది తయారై ఉండొచ్చని అంచనావేస్తున్నారు. భూమి లోపల ఇంకా మనిషికి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని ఈ పరిశోధన మరోసారి నిరూపించింది. ఒక చిన్న ద్వీపం వెనుక ఇంత పెద్ద సీక్రెట్ ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ పరిశోధన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ద్వీపాలపై కూడా శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. మరి బెర్ముడా ఒక్కటే ఇలానా? లేక ఇంకా ఎన్నో ద్వీపాల కింద ఇలాంటి రహస్య రాతి నిర్మాణాలు దాగి ఉన్నాయా? అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. బెర్ముడా ట్రయాంగిల్ గుండా ప్రయాణం అంటే నావికులు పైలట్లు భయపడతారు.. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ ప్రాంతానికి వెళ్లకుండా విమానాలు, ఓడలు తప్పించుకుంటాయి. ఎందుకంటే దాదాపు 200 విమానాలు, ఓడలు రహస్యంగా ఈ ప్రాంతంలో మాయమయ్యాయి. దశాబ్దాలుగా అణ్వేషణ జరుగుతున్నా వాటి జాడ తెలియలేదు. అసలీ ప్రాంతంలో ఏం జరుగుతోంది, ఎందుకు విమానాలు, ఓడలు మాయమౌతున్నాయని ప్రశ్నించినప్పుడు ఎలియన్స్ థియరీ ఒకటి వెలుగు చూసింది. ఆ ప్రాంతంలో విమానాలు , ఓడల మాయం వెనుక యూఎఫ్ఓ హస్తముందని కొందరు అనుమానిస్తారు. ది సన్‌లో ప్రచురితమైన రిపోర్ట్‌ ప్రకారం ఎలియన్స్ రీసెర్చ్ చేసేందుకు ఆ ప్రాంతంలో విమానాలు, ఓడలను మాయం చేస్తున్నారని ఉంది. సముద్రగర్భంలో బెర్ముడా ప్రాంతంలో ఎలియన్స్ సంచారం ఉందనే థియరీ వినిపించింది. బెర్ముడా ట్రయాంగిల్‌కు సంబంధించి మరో థియరీ ఏంటంటే ఆ ప్రాంతంలో ఉండే ప్రవాహం కారణంగా నలువైపులా భయంకరమైన తుపాన్లు సంభవిస్తుంటాయి. 100 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడతాయనీ మేగ్నెటిక్ ఫోర్స్‌కు సంబంధించిన మరో థియరీ వినిపిస్తుంది. ఇక్కడి గురుత్వాకర్షణ శక్తికి ఈ ప్రాంతంలో అన్నీ ఆకర్షితమౌతుంటాయనీ పైలట్ లేదా కెప్టెన్‌కు దీని గురించి అర్ధం కాకపోవడంతో చిక్కుకుంటారనీ కొందరంటారు. 2016 అధ్యయనం ప్రకారం సముద్రగర్భంలో ఉత్పన్నమయ్యే మీథేన్ వాయువు కారణంగా విస్ఫోటనం లాంటిది జరగడం విమానాల అదృశ్యానికి కారణంగా చెబుతారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? 3 రోజుల వెదర్ రిపోర్ట్

సముద్రం అడుగున పైప్‌లైన్.. గ్యాస్ కష్టాలకు చెక్ పడేనా

కోమా నుంచి మేల్కొన్న యువతి.. లేని పిల్లల కోసం ఆరాటం

500 బ్రెడ్‌లతో భారీ డ్రెస్.. బేకరీ ప్రమోషన్ కోసం నటి వినూత్న ప్రయోగం

అరుదైన దృశ్యం.. ఒకే చోట మూడు పాముల ‘సయ్యాట’

Follow Us