కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా.. అనుకోనిది జరిగితే రూ.5 లక్షలు

Updated on: Nov 21, 2026 | 4:00 PM

తెలంగాణ ప్రభుత్వం కోటి నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తీసుకొస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాల్లో ఒక సంపాదించే వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా అందనుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, అవసరమైన పత్రాలు, నమోదు విధానం గురించి తెలుసుకుందాం.

తెలంగాణలో కోటి నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి.. జీవిత బీమా మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే అమల్లో ఉన్న రూ.10 లక్షల ప్రమాద బీమాను కూడా యథాతథంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 19న సిద్దిపేటలో సీఎం ఈ పథకం దరఖాస్తు ఫారాలను విడుదల చేయనున్నారు. అయితే ఈ ఇందిరమ్మ బీమా ఎవరికి వర్తిస్తుంది? కుటుంబంలో ఎంతమందికి బీమా లభిస్తుంది? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ప్రతి కుటుంబంలో సంపాదించే వ్యక్తుల్లో ఒక్కరికి మాత్రమే ఈ బీమా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సంపాదిస్తున్నప్పటికీ.. ఎవరికి బీమా చేయించాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు. ఆ బీమా పొందిన వ్యక్తి మరణిస్తే.. ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ఈ పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న సంపాదించే వ్యక్తులు అర్హులు. అంటే 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించిన వారు ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. జనన తేదీ నిర్ధారణకు ఆధార్ కార్డులోని తేదీనే పరిగణనలోకి తీసుకుంటారు. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఒకసారి నమోదు పూర్తయిన తర్వాత.. బీమా పొందిన వ్యక్తి గరిష్ఠ వయోపరిమితిని దాటినా కనీసం ఏడాది పాటు బీమా రక్షణ కొనసాగుతుంది. మరి ఈ పథకంలో ఎలా నమోదు చేసుకోవాలి? ఇందుకోసం గ్రామాలు, పట్టణాలు, వార్డుల స్థాయిలో ప్రత్యేక సహాయక నమోదు శిబిరాలు నిర్వహించనున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో వార్డు అధికారి శిబిరాల బాధ్యతలు చూస్తారు. ఆహార భద్రత కార్డుల డేటా ఆధారంగా కుటుంబాల వివరాలు నమోదు చేస్తారు. రేషన్ కార్డు ఉన్నవారు వాటి వివరాల ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేని కుటుంబాల కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంచుతారు. ఇందులో బీమా పొందే వ్యక్తి వివరాలతోపాటు ఆధార్, కుటుంబ సభ్యులు, నామినీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను నమోదు చేసినప్పుడు రూ.5 లక్షల బీమా మొత్తంలో వారికి ఎంత వాటా అందుతుందనే విషయాన్ని కూడా అధికారులు ముందుగానే వివరించాలి. ఇతర జిల్లాలకు చెందిన రేషన్ కార్డులు ఉన్నవారు కూడా సమీపంలోని నమోదు శిబిరాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రస్థాయిలో హెల్ప్ డెస్క్, జిల్లాల స్థాయిలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తంగా చూస్తే.. ఇప్పటికే వివిధ పథకాల ద్వారా బీమా పొందుతున్న వారిని మినహాయించకుండా.. అందరికీ ఒకే విధమైన ఆర్థిక భద్రత కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం. కోటి కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే ఈ పథకం అమలు ఎలా సాగుతుంది? అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా ప్రయోజనం అందుతుందా? అనేది ఇప్పుడు కీలకంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇతను కదా.. అసలైన ఓటరు అంటే

Toll Plaza: వాహనదారులకు గుడ్‌ న్యూస్‌.. రూ.1500కే వార్షిక లోకల్ పాస్‌

రెండు చేతులూ కోల్పోయినా ధైర్యం వీడలేదు..

Inspiring Mother: చెత్త బండే అమ్మ ఒడి!..బిడ్డల కోసం స్టీరింగ్ పట్టిన యువతి!

NHAI: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు భారీగా ఫైన్!

Loading...
Unable to load recommendations.
Follow Us