Balapur Laddu: బాలాపూర్ లడ్డూ వేలం.. సరికొత్త రికార్డులు?

Updated on: Sep 24, 2026 | 9:58 PM

హైదరాబాద్‌లో వినాయక లడ్డూ వేలం పాటలు ఈసారి కూడా భారీగా సాగాయి. కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లో లడ్డూ కోటి రూపాయలు దాటగా, మై హోమ్‌ మంగళలో రూ.21.11 లక్షలు పలికింది. మరోవైపు సెప్టెంబర్‌ 25న జరిగే బాలాపూర్‌ లడ్డూ వేలంపై ఆసక్తి నెలకొంది. అదే రోజు నిమజ్జన శోభాయాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది పోలీసులతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్లు, షీ టీమ్స్‌, రెస్క్యూ బోట్లను సిద్ధం చేశారు.

భాగ్యనగరంలో వినాయక నవరాత్రుల వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో.. ఆ బొజ్జ గణపయ్య లడ్డూ వేలం పాటలు కూడా అంతే హోరాహోరీగా సాగుతాయి! ఆ విఘ్నేశ్వరుడి పవిత్ర ప్రసాదాన్ని దక్కించుకోవడానికి భక్తులు లక్షలు, కోట్లు వెచ్చించేందుకు కూడా వెనకాడటం లేదు. ఈ ఏడాది హైదరాబాద్‌లోని పలు గేటెడ్ కమ్యూనిటీల్లో లడ్డూల వేలం పాత రికార్డులను తిరగరాసింది. అసలు ఏ కమ్యూనిటీలో లడ్డూ ఎంత పలికింది? కోటి రూపాయలు దాటిన ఆ లడ్డూ ఏది? తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలాపూర్ లడ్డూ వేలం విశేషాలేంటి? అలాగే లక్షలాది మంది పాల్గొనే నిమజ్జన శోభాయాత్రకు పోలీసులు చేసిన 3-అంచెల భద్రతా ఏర్పాట్లేంటి? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం! హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలలో లడ్డూ వేలం పాట అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక వేడుకగా మారిపోయింది. నగరంలోని రాజేంద్రనగర్‌ పరిధి కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో లడ్డూ వేలం సరికొత్త సంచలనం సృష్టించింది! శక్తిమాన్ బృంద సభ్యులు ఏకంగా కోటి లక్ష రూపాయలకు ఈ లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది ఇక్కడ లడ్డూ వేలం రెండు కోట్ల 31వేలు పలకడం విశేషం. కొండాపూర్‌లోని మై హోమ్ మంగళలో జరిగిన వేలంలో తీవ్ర పోటీ నడిచింది. పోటాపోటీగా సాగిన వేలంలో సాంబశివరావు, నవీన్ అనే భక్తులు 21లక్షల 11వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఇటు ప్రగతి నగర్‌లోని రఘుపతి కౌంటీలో జరిగిన లడ్డూ వేలంలో నరేన్ చౌదరి బృందం 13లక్షల 66వేలతో సొంతం చేసుకున్నారు. అటు కొండాపూర్ ఇండిస్ వివా సిటీలో రామ్‌శ్రీ గౌతమ్, వైశాలి దంపతులు 13లక్షల 21వేలతో గణపతి లడ్డూను కైవసం చేసుకున్నారు. కూకట్‌పల్లిలోని దేవస్థాన్ హోమ్స్‌లో జరిగిన లడ్డూ వేలంలో 10లక్షల 5వేలు పలికింది. మరోవైపు బండ్లగూడ జీకేఆర్‌ఎస్ పలాసియో విల్లాస్ నివాసి రమేష్ 4లక్షల 50వేలకు దక్కించుకున్నారు. ఇవే కాకుండా సికింద్రాబాద్‌ ఆలుగడ్డ బావిలో జై భవానీ యూత్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపంలో తొలిసారిగా లడ్డూ వేలం నిర్వహించారు. గణనాథుడి లడ్డూ ప్రసాదం దక్కించుకోవటానికి భక్తులు, స్థానికులు పోటీ పడ్డారు. చివరకు స్నేహగణేష్ దంపతులు లక్షా 36వేలకు స్వామివారి ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు. నానక్‌రాంగూడలోని గోల్ఫ్ వ్యూలో 2లక్షల 60 వేలు, చందానగర్ అపర్ణ సైబర్ కమ్యూన్‌లో 45వేలకు లడ్డూ వేలాలు సాగాయి. అయితే, ఈ వేలం పాటల ద్వారా వచ్చే లక్షల రూపాయల నిధులను నివాసితులు కేవలం ఉత్సవాలకే పరిమితం చేయడం లేదు. అందులో సగం మొత్తాన్ని సామాజిక సేవలకు, పేదలకు సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. మిగిలిన సగం సొమ్మును వచ్చే ఏడాది వినాయక చవితి నిర్వహణకు కేటాయిస్తున్నారు. ఈ విధంగా లడ్డూ వేలం అనేది భక్తితో పాటు కమ్యూనిటీ ప్రజలను ఒకతాటిపైకి తెచ్చే సామాజిక వేడుకగా నిలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం సెప్టెంబర్ 25న జరగనుంది. నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమయ్యే ముందు ఉదయన్నే ఈ వేలం నిర్వహిస్తారు. ఈసారి బాలాపూర్ మండపాన్ని ఎంతో అద్భుతంగా పూరీ జగన్నాథ ఆలయ నమూనాలో తీర్చిదిద్దారు. ఇక్కడ వేలం వేసే లడ్డూ బరువు సుమారు 21 కిలోలు ఉంటుంది. 1994లో కేవలం 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం, గడిచిన 30 ఏళ్లలో లక్షల రూపాయలకు చేరుకుంది. మరి ఈసారి 2026 వేలంలో బాలాపూర్ లడ్డూ కొత్త రికార్డు సృష్టిస్తుందో లేదో చూడాలి! మరోవైపు బాలాపూర్ నుంచి ఖైరతాబాద్ మహాగణపతి వరకు నగరం అంతటా జరిగే వినాయక నిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. 20 వేల మంది బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బందితో పాటు RAF, CRPF కంపెనీలను సున్నితమైన ప్రాంతాల్లో మోహరించారు. ప్రధాన రహదారులు, చెరువుల వద్ద ఏర్పాటు చేసిన 10 వేలకు పైగా సీసీ కెమెరాలను బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. శోభాయాత్ర సాగే తీరును ఆకాశ మార్గం నుంచి పర్యవేక్షించేందుకు డ్రోన్లను, భవనాలపై హైరైజ్ కెమెరాలను ఉంచారు. ఇక.. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న 100 హైరైజ్ సీసీ కెమెరాల ద్వారా విగ్రహాల లెక్కను కూడా పక్కాగా చెప్తామని అంటున్నారు అధికారులు. ఇక నిమజ్జన సమయాల్లో అధికారులకు అతిపెద్ద సవాల్ ట్రాఫిక్ కంట్రోల్. దీనికోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఈ నెల 25న ఉదయం ఆరు గంటల నుంచే ట్రాఫిక్ మళ్లింపుతో పాటు ఆంక్షలు అమల్లోకి వస్తాయి. గణేష్ నిమజ్జన యాత్ర రూట్లలో ఇతర వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు. మహిళల భద్రత కోసం 26 షీ టీమ్స్, మఫ్టీ పోలీసులు గస్తీ కాస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద ఇండియన్ ఆర్మీ, టూరిజం శాఖకు చెందిన ఈతగాళ్లు, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం శోభాయాత్రలో డీజేలు, బాణసంచాను పూర్తిగా నిషేధించారు. శాంతియుత వాతావరణంలో, గంగా-జమునా తెహజీబ్ సంప్రదాయాన్ని కాపాడుతూ ఉత్సవాలను జరుపుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ఇదీ భాగ్యనగరంలో లడ్డూల వేలం హంగామా, నిమజ్జన భద్రతా ఏర్పాట్ల విశేషాలు! మరి మీ ప్రాంతంలో లడ్డూ ఎంత ధర పలికిందో మాతో షేర్‌ చేయండి..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కూల్లో పాములు.. భయాందోళనలో విద్యార్ధులు

Loading...
Unable to load recommendations.
Follow Us