రూ.1.1 లక్షల కోట్లు.. ఈ డబ్బుకు వారసులెవరు?
దేశవ్యాప్తంగా బ్యాంకులు, బీమా సంస్థలు, స్టాక్ మార్కెట్లలో కలిపి రూ.1.1 లక్షల కోట్లకు పైగా క్లెయిం చేయని ఆస్తులు పేరుకుపోయాయి. పాత బ్యాంక్ ఖాతాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, నామినీ వివరాల లేమి, కేవైసీ సమస్యల వల్ల ఈ నిధులు యజమానులకు చేరడం లేదు. మీ ఇంట్లో ఉన్న పాత పాస్‌బుక్ లేదా పాలసీ పత్రం లక్షల రూపాయల వారసత్వ సంపదకు దారి చూపే అవకాశం ఉంది.
మీ ఇంట్లో ఎప్పుడో మర్చిపోయిన బ్యాంక్ పాస్‌బుక్… లేదా పాత ఇన్సూరెన్స్ బాండ్ దొరికిందా? ఒకవేళ దొరికితే, దాన్ని సాధారణ కాగితంలా తీసిపారేయకండి… ఎందుకంటే అది మీ కుటుంబానికి సంబంధించిన లక్షల రూపాయల వారసత్వ సంపద అయ్యే అవకాశం ఉంది. అవును, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఎవరికీ తెలియకుండా ₹1.1 లక్షల కోట్ల డబ్బు మన బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల ఖాతాల్లో మూలన పడి ఉంది. అసలు ఈ భారీ డబ్బు ఎవరిది? ఎందుకు ఇప్పటికీ యజమానులకు చేరలేదు? దీనికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ఎవరూ క్లెయిం చేయకుండా మిగిలిపోయిన ఆర్థిక ఆస్తులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి క్లెయిం చేయని ఆస్తుల విలువ ఏకంగా రూ.1.1 లక్షల కోట్లకు చేరింది. బ్యాంకులు, బీమా సంస్థలు, ఈక్విటీ మార్కెట్లలో యజమానుల వివరాలు అందుబాటులో లేకపోవడంతో భారీగా నిధులు పేరుకుపోతున్నాయి. కేంద్రం ‘మీ డబ్బు-మీ హక్కు’లాంటి ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా, క్లెయింలు ఆశించినంత స్థాయిలో పెరగడం లేదు. గతంలో మీ కుటుంబ సభ్యులు ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్లు లేదా మర్చిపోయిన ఇన్సూరెన్స్ పాలసీలు… ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఆర్థిక సమస్యగా మారాయి. క్లెయిం చేయకుండా మిగిలిపోయిన ఆస్తుల విలువ ఏకంగా ₹1.1 లక్షల కోట్లకు చేరిందంటే ఒక్కసారి ఆలోచించండి. బ్యాంకులు, బీమా సంస్థలు, స్టాక్ మార్కెట్లలో యజమానుల వివరాలు లేక లక్షల కోట్ల రూపాయలు ‘అన్ క్లెయిమ్డ్’గా నిలిచిపోయాయి. ఇక మొత్తం రూ.1.1 లక్షల కోట్లలో అత్యధికంగా రూ.83,000 కోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. వీటితోపాటు రూ.10,000 కోట్లు ఈక్విటీ పెట్టుబడులు, మరో రూ.14,000 కోట్లు జీవిత బీమా పాలసీల రూపంలో క్లెయిం చేయకుండా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నిధులు వివిధ నియంత్రణ సంస్థల ఆధీనంలో ఉన్నాయి. ఆర్‌బీఐ తన పరిధిలోని నిధులను ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్’లో ఉంచగా, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, ఈక్విటీ నిధులను ‘ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (ఐపీఈఎఫ్)లో భద్రపర్చింది. ఈ సమస్యకు ప్రధాన కారణం ‘పాత కాలపు రికార్డులు’. పాన్-ఆధార్ అనుసంధానానికి ముందు, ఖాతాలను చేతిరాతతో నమోదు చేశారు. ఇప్పుడు లబ్ధిదారులు ఆ నిధులను ఉపసంహరించుకోవడానికి డిజిటల్ కేవైసీని అనుసంధానించాలని చూసినప్పుడు, పాత రికార్డులకు ప్రస్తుత వివరాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలు పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. అలాగే కొన్ని పేర్లలో అక్షర దోషాలు, అడ్రస్ మారడం వంటి కారణాల వల్ల ఇప్పుడు అసలైన వారసులు డబ్బును వెనక్కి తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా, ఎన్నో అఫిడవిట్లు, NOCలు సమర్పించాల్సి వస్తోంది. ఇది ఒక పెద్ద ‘ప్రూఫ్ ఆఫ్ ఎంటైటిల్మెంట్’ సమస్యగా మారింది. ముఖ్యంగా పాత ఖాతాల్లో నామినీ వివరాలు లేకపోవడం వల్ల, యజమాని మరణించాక వారసులు కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వస్తోంది. ఇది కేవలం బ్యాంక్ ఖాతాలు ఉపయోగించకపోవడం వల్ల వచ్చిన సమస్య మాత్రమే కాదు. ప్రస్తుతం అర్హత నిరూపణే అసలు సమస్యగా మారింది. అంటే ఆ డబ్బు వారిదేనని నిరూపించుకోవడం చాలా కష్టంగా మారుతోందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. వారసులకు హక్కు ఉన్నప్పటికీ, గుర్తింపు కొనసాగింపును, అర్హతను నిరూపించుకునేందుకు అఫిడవిట్లు, ఇండెమ్నిటీ పత్రాలు సమర్పించడం వారికి భారంగా మారుతోంది. ముఖ్యంగా అసలైన ఖాతాదారులు ఉన్నా, వయసు పైబడటం వల్ల సంతకాలు మారడం, వేలిముద్రలు సరిగా పడకపోవడం, మతిమరుపు, వంటివి సీనియర్ సిటిజన్లకు పెద్ద సవాలుగా మారుతున్నాయి. వాస్తవ ఖాతాదారులు మరణిస్తే, వారి వారసులకు ఆయా పెట్టుబడుల వివరాలు తెలియకపోవడం, వివరాల్లో పొరపాట్ల వల్ల కేవైసీకి సరిపోకపోవడంతో.. వాటి గురించి తెలియడం లేదని చెబుతున్నారు. అందుకే, ఈ సమస్య భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం విధానాలను సరళతరం చేస్తూ.. క్లెయింలను ప్రోత్సహించేందుకు ఉద్గమ్ వంటి ప్రత్యేక డిజిటల్ వేదికలను అందుబాటులోకి తెచ్చింది. గతేడాది ఆర్‌బీఐ, సెబీ సంయుక్తంగా చేపట్టిన ‘మీ డబ్బు-మీ హక్కు’ పేరిట దేశ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. దీనిద్వారా సుమారు రూ.5,777 కోట్ల విలువైన ఆస్తులను లబ్ధిదారులకు అప్పగించగలిగినా, క్లెయిం చేయని నిధులను వెలికితీయడం ఇంకా పెద్ద సవాలుగానే మిగిలింది. మొత్తానికి చూస్తే, ఇది కేవలం డబ్బు మర్చిపోవడమే కాదు… డిజిటల్ రికార్డులు లేకపోవడం, పాత KYC సమస్యలు, నామినీ వివరాల లోపం వల్ల ఏర్పడిన పెద్ద వ్యవస్థాగత సమస్యగా మారింది. ప్రభుత్వం అవగాహన పెంచుతున్నా, ఇంకా కోట్ల రూపాయల ఆస్తులు వారి అసలైన యజమానుల చేతికి చేరలేదు. కాబట్టి మీ కుటుంబంలో కూడా ఎవరైనా పాత బ్యాంక్ ఖాతాలు లేదా ఇన్సూరెన్స్ పాలసీల వివరాలు మర్చిపోయి ఉంటారేమో ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే వారసత్వంగా వచ్చే మీ సంపదను పొందేందుకు బ్యాంకులు ఇప్పుడు డిజిటల్ పద్ధతుల్లో సులభతరమైన అవకాశాలు కల్పిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్షలు ఖర్చు పెట్టే ఏసీ ఎందుకు..? కూలర్ అనే బెస్ట్ ఆప్షన్ ఉండగా అంటున్న నిపుణులు
తినడం రాంగ్ టైమ్ లో.. పడుకోవడం రాంగ్ టైమ్ లో.. దెబ్బతింటున్నపేగు ఆరోగ్యం
