9 నెలల్లో రూ. 18 కోట్ల నిధుల కుంభకోణం.. టీవీ 9 మాజీ సిఈఓ రవి ప్రకాష్ అరెస్ట్

ఏబీసిపీఎల్ డైరెక్టర్ల అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ 9 నెలల కాలంలో రూ. 18 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై బంజారాహిల్స్ పీఎస్ లో చీటింగ్ కేసు నమోదయింది. ఆయనను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. ఆయనతో బాటు మాజీ సీఎఫ్ఓ ఎం.కె.వి.ఎన్.మూర్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంస్థ డైరెక్టర్ల అనుమతి లేకుండా వీరు ఇలా నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు సంస్థకు, షేర్ హోల్డర్లకు భారీ […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 1:46 pm, Sat, 5 October 19

ఏబీసిపీఎల్ డైరెక్టర్ల అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ 9 నెలల కాలంలో రూ. 18 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై బంజారాహిల్స్ పీఎస్ లో చీటింగ్ కేసు నమోదయింది. ఆయనను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. ఆయనతో బాటు మాజీ సీఎఫ్ఓ ఎం.కె.వి.ఎన్.మూర్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంస్థ డైరెక్టర్ల అనుమతి లేకుండా వీరు ఇలా నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు సంస్థకు, షేర్ హోల్డర్లకు భారీ నష్టం వాటిల్లినట్టు అలంద మీడియా అండ్ ఎంటర్టెయిన్ మెంట్స్ పోలీసులకు ఇఛ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అలంద మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ మొత్తం ఈక్విటీ షేర్ లో 90.54 శాతం వాటాను కలిగి ఉంది. అంటే ఇది మెజారిటీ షేర్ హోల్డింగ్.. 2018 ఆగస్టు 27 నాటికి కంపెనీ మేజర్ షేర్ హోల్డరయింది. రికార్డుల వెరిఫికేషన్ లో ఈ భారీ కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణానికి పాల్పడినవారిపై గట్టి చర్యలు తీసుకోవాలని ఈ సంస్థ యాజమాన్యం పోలీసులకు ఇఛ్చిన ఫిర్యాదులో అభ్యర్థించింది. వారిపై సెక్షన్ 409, 418, 420, 509 కింద కేసులు నమోదయ్యాయి.

అలందా మీడియా సంస్థ ఇచ్చిన వివరాలు ప్రకారం రవిప్రకాష్ 2018 సెప్టెంబర్ 18న కోటి 80 లక్షలు విత్ డ్రా చేయగా.. ఇందుకు కోటి 15 లక్షల 41 వేలకు పైగా టీడీఎస్ చెల్లింపులు జరిగాయి. అలాగే 2019 మార్చి 3న కోటి 56 లక్షలు విత్ డ్రా చేయగా. ఇందుకు కోటికి పైగా టీడీఎస్ చెల్లింపులు జరిగాయి. 2019 మే 8న మూడు కోట్లు విత్ డ్రా చేయగా దాదాపు 2 కోట్ల టీడీఎస్ చెల్లింపులు జరిగాయి.

ఇక మూర్తికి సంబంధించి 2018 అక్టోబర్ 24 అదే ఏడాది డిసెంబర్ మధ్య కాలంలో 3,97,87,500 రూపాయలు విత్ డ్రా చేయగా.. ఇందుకు 85,00,000 టీడీఎస్ చెల్లింపులు జరిగాయి. మళ్ళీ 2019 మే8న 2,00,00,000 రూపాయలు విత్ డ్రా చేశారు. ఇందుకు టీడీఎస్ చెల్లింపులు 1,28,24,000 రూపాయలు జరిగాయి. మళ్ళీ 2019 మే 8న 2,00,00,00 విత్ డ్రా చేయగా.. టీడీఎస్ చెల్లింపులు 1,28,24,000.

కాగా రవిప్రకాష్ కు సంబంధించి గ్రాస్ అమౌంట్ క్లెయిమ్ చేశారని బోనస్, ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్లు ఇంత మొత్తం చూపారని పేర్కొన్నారు. ఇది మొదట 1,80,00,000.. అనంతరం 1,56,00,000.. ఆ తర్వాత 3,00,00,000గా ఉంది. మూర్తికి సంబంధించి మొదట 3,97,87,500 అనంతరం 2,00,00,000గా ఉంది. మాజీ డైరెక్టర్ క్లిఫర్డ్ పెరెరా 2018 అక్టోబర్ 24 నుంచి అదే ఏడాది డిసెంబర్ 10 వరకు 3,97,87,500 సొమ్ము ముట్టింది. మొత్తం మీద 18,31,75,000, గ్రాస్ అమౌంట్ 11,74,51,808, టీడీఎస్ చెల్లింపులు 11,74,51,808గా పేర్కొన్నారు.

2019 జూన్ నుంచిడైరెక్టర్ల కొత్త బోర్డు ఈ రికార్డులను, అకౌంట్ స్టేట్ మెంట్లను వెరిఫై చేసింది. వీరు మోసపూరితంగా ఇలా భారీ నిధుల దుర్వినియోగానికి పాల్పడి క్లిఫర్డ్ పెరీరా అనే మాజీ డైరెక్టర్ కు కూడా సొమ్ము చెల్లించారని పేర్కొంది.
ఆయా సొమ్ములు, వాటి విత్ డ్రాల్స్ ఎప్పుడెప్పుడు చేశారో, అందుకు టీడీఎస్ చెల్లింపులు ఎంత ఉన్నాయో కూడా ఈ ఫిర్యాదులో వివరించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.