బండికి స్ట్రాంగ్ కౌంటర్.. హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉంటే కేంద్రం ఏం చేస్తుంది? : వినోద్

జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..

  • Ram Naramaneni
  • Publish Date - 1:24 pm, Wed, 25 November 20
బండికి స్ట్రాంగ్ కౌంటర్.. హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉంటే కేంద్రం ఏం చేస్తుంది? : వినోద్

జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తాము జీహెచ్ఎంసీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉన్నారని, దీనికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే అని కూడా వ్యాఖ్యానించిన విషయం విధితమే. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు సహా కాంగ్రెస్, టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అసలు తెలంగాణ ప్రభుత్వానికి, రోహింగ్యాలకు సంబంధం ఏంటని బీజేపీ నేతలను ఆయన నిలదీశారు.

ఇతర దేశస్తులు మన దేశంలో ఎక్కడ ఉన్నా వారిని గుర్తించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని, ఆ విషయం పార్లమెంట్ సభ్యుడైన సంజయ్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ఎంపీ బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది.. ఏది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందనే విషయం కూడా తెలియకపోవడం దారుణం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోహింగ్యాలు ఉన్నారని, వారిని గుర్తించే పని ఆయా దేశాలపై ఉంటుందని పేర్కొన్న వినోద్.. ఒకవేళ హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉంటే కేంద్ర భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. మీరు చేసిన వ్యాఖ్యల ఆధారంగా రా, ఇంటెలిజెన్స్ సంస్థలు విఫలం అయ్యాయని ఒప్పుకున్నట్లేనా? అని రాష్ట్ర బీజేపీ నేతలను ఆయన నిలదీశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విఫలం అయ్యారని అంగీకరించినట్లేనా? అని అన్నారు. రోహింగ్యాల అంశంపై పార్లమెంట్‌లో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలను బీజేపీ ఎంపీలు మరిచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు కొరివితో తమ తల తామే గోక్కుంటున్నారని, రోహింగ్యాల అంశం బీజేపీ మెడకు చుట్టుకుందని వినోద్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉందని, ఆ ప్రశాంతతను చెడగొట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బీజేపీ నేతలను ఆయన హెచ్చరించారు.