
అమెరికాలోని నార్త్ డకోటాలో జసోండ్రా ష్మిత్, ఆమె భర్త జేసన్ ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నారు. జసోండ్రా కుటుంబానికి చెందిన ఓ పాత ఇల్లు అమ్మకానికి వచ్చింది. 1914లో ఆమె ముత్తాత ఫ్రెడెరిచ్ ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు.
ఫేస్బుక్లో బంధువులు రెండు అంతస్తులున్న ఓ పాత ఇంటి గురించి చర్చించడం జసోండ్రా చూసింది. అది తన కుటుంబానికి చెందిన ఇల్లేనని ఆమె గుర్తించింది. వెంటనే బంధువులను సంప్రదించి ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది.
ఇంటి వెడల్పు 30 అడుగులు, పొడవు 60 అడుగులు కావడంతో ఇంటిని కూల్చకుండా మరో చోటుకు తరలించడం అనుకున్నంత సులభం కాలేదు. మొదట ఇంటిని పాత పునాది నుంచి వేరు చేశారు. అనంతరం ఇంటి కింద భారీ స్టీల్ బీమ్ లు అమర్చి, జాక్ల సాయంతో పైకి లేపారు. ఆ బీమ్లకు రోలర్లను అమర్చి, ఇంటిని కదిలిస్తూ కొత్త ప్రదేశానికి తరలించారు. ఆ ప్రయాణం దాదాపు 9.7 కిలోమీటర్లు సాగింది. ఇంటిని తరలిస్తున్న అరుదైన దృశ్యాన్ని చూసేందుకు చాలా మంది అక్కడికి చేరుకున్నారు.
Woman Shifts Ancestral Home By Road
ప్రస్తుతం జసోండ్రా, జేసన్ ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారు. కాలక్రమేణా ఇంటికి చేసిన ఆధునిక మార్పులను తొలగించి, అసలు ఇంట్లో ఉన్న చెక్క పనులు, పాతకాలపు డిజైన్ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంటిని కాపాడుకోవడం వెనుక కేవలం పాత భవనంపై ఉన్న ఇష్టంతో పాటు.. ఒకవైపు జసోండ్రా కుటుంబానికి చెందిన ఐదు తరాల జ్ఞాపకాలు.. మరోవైపు జేసన్ తాతయ్య, నానమ్మ కొనుగోలు చేసిన భూమితో ఉన్న అనుబంధం ఉండటం విశేషం. ఒక ఇంటిని నిర్మించడానికి డబ్బు సరిపోతుంది. కానీ తరతరాల జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటిని కాపాడుకోవడానికి ప్రేమ, ఓపిక, పట్టుదల అవసరమని ఈ కుటుంబ కథ చెబుతోంది.