మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు.. ఫుల్, హాఫ్‌గా ఎందుకు పిలుస్తారు..?
సాధారణంగా పాలు, నూనె, నీళ్లు వంటి ద్రవ పదార్థాలన్నింటినీ మనం లీటర్లు లేదా మిల్లీలీటర్లలో కొలుస్తాం. లీటరు అంటే 1000 ml కాగా, అందులో సగం అంటే 500 ml అని మనకు తెలుసు. కానీ, మద్యం సీసాల విషయానికి వస్తే ఈ కొలతలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో 1000 ml కాకుండా 750 ml ఉన్న సీసాను ఫుల్ అని, 375 ml ని హాఫ్ అని, 180 ml ని క్వార్టర్ అని పిలుస్తారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం.

మద్యం ఒక ద్రవపదార్థం. ద్రవాలను లీటర్లు లేదా మిల్లీలీటర్లలో కొలుస్తారు. ద్రవాలను కొలవడానికి ఇది అంతర్జాతీయ ప్రమాణం. దీని ప్రకారం, 1000 మిల్లీలీటర్లు, లేదా ఒక లీటరు, ఒక పూర్తి యూనిట్, దానిలో సగం, అర యూనిట్. అయితే, మద్యం విషయంలో ఈ లెక్కలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో ఫుల్, హాఫ్, క్వార్టర్ సీసాల మద్యం కొలతలు పూర్తిగా వేర్వేరుగా ఉంటాయి. దీని వెనుక అసలు కారణం ఏంటంటే..
బ్రిటిష్ కాలం నాటి పెగ్ వ్యవస్థ:
భారతదేశంలో మద్యం విక్రయాలు, సేవించే సంస్కృతిపై బ్రిటిష్ వారి ప్రభావం ఎక్కువగా ఉంది. అంతర్జాతీయంగా ఆల్కహాల్‌ను ఔన్సులలో కొలుస్తారు. ఒక ఔన్సు అంటే సుమారుగా 29.5 ml, దీనిని రౌండ్ ఫిగర్‌గా 30 ml గా పరిగణిస్తారు.
బ్రిటిష్ వారు మద్యం తాగేటప్పుడు పెగ్ కొలతలను క్రింది విధంగా నిర్ణయించారు:
స్మాల్ పెగ్: 30 ml (1 ఔన్సు)
లార్జ్ పెగ్: 60 ml లేదా 90 ml
750 ml సీసా లెక్కల రహస్యం:
మద్యం సీసాలను తయారుచేసేటప్పుడు, అందులో ఉండే మొత్తం ద్రవం పెగ్గుల సంఖ్యకు సరిగ్గా సరిపోవాలనే ఉద్దేశంతో కొలతలను రూపొందించారు. 30 ml, 60 ml, 90 ml గణితాలను గమనిస్తే:
క్వార్టర్ (180 ml): 180 ml సీసాలో సరిగ్గా 6 స్మాల్ పెగ్‌లు (30ml) లేదా 3 లార్జ్ పెగ్‌లు (60ml) వస్తాయి.
హాఫ్ (375 ml): 375 ml సీసాలో దాదాపు 12 స్మాల్ పెగ్‌లు లేదా 6 లార్జ్ పెగ్‌లు వస్తాయి.
ఫుల్ (750 ml): 750 ml సీసాలో సరిగ్గా 25 స్మాల్ పెగ్‌లు (30ml) లేదా 12.5 లార్జ్ పెగ్‌లు (60ml) వస్తాయి.
ఒకవేళ సీసా 1000 ml (1 లీటరు) ఉంటే, పెగ్గుల లెక్కలు పాయింట్లలో వచ్చి లెక్కించడం కష్టమవుతుంది. అందుకే లీటరు కాకుండా, పెగ్గుల లెక్కలకు సులభంగా ఉండేలా 750 ml ని ఫుల్ బాటిల్ కొలతగా ఖరారు చేశారు. హిందీ, స్థానిక భాషల్లో వీటిని ఖంభా (ఫుల్), అధా (హాఫ్), పౌవా (క్వార్టర్) అని కూడా పిలుస్తుంటారు.




