
భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో మారుతి 800 కారుకు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పట్లో మధ్యతరగతి కుటుంబాల సొంత కారు కలను నిజం చేస్తూ, భారత రోడ్లపై సరికొత్త విప్లవాన్ని సృష్టించిన ఘనత ఈ చిన్న కారుకే దక్కుతుంది. తాజాగా దశాబ్దాల నాటి మారుతి 800 కారు కొనుగోలు బిల్లు ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ రోజుల్లో కార్ల ధరలు ఎంత చౌకగా ఉండేవో చూసి నేటి తరం నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని namma_mysuru1994 అనే యూజర్ జూలై 12, 1984 నాటి ఒక పాత కారు కొనుగోలు బిల్లు షేర్ చేశారు. ఆ బిల్లు వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని బగన్ గ్రామానికి చెందిన శ్యామ్ రావు అనే కస్టమర్ అప్పట్లో ఈ మారుతి 800 కారును కొనుగోలు చేశారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం ఏంటంటే.. ఆ బిల్లులో కారు ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 47,500 మాత్రమే ఉంది. ఇన్సూరెన్స్, రోడ్ టాక్స్, ఇతర ఛార్జీలన్నీ కలుపుకున్నా కూడా అప్పట్లో ఈ కారు మొత్తం ఆన్ రోడ్ ధర సుమారు రూ.60,000 లోపే కావడం విశేషం.
ఈ బిల్లుపై ఉన్న ధరను చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నప్పటికీ, ఆర్థిక నిపుణులు మాత్రం ఇందులో మరో కోణాన్ని గుర్తు చేస్తున్నారు. 1984 నాటి రూ.60,000 అనేది నేటి ద్రవ్యోల్బణం, రూపాయి విలువ లెక్కల ప్రకారం చూస్తే ప్రస్తుతం సుమారు రూ.5 నుండి 6 లక్షలకు సమానం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆ రోజుల్లో అంత బడ్జెట్ పెట్టి కొన్న మారుతి 800 కారులో కనీసం ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం కూడా ఉండేది కాదు. అయినప్పటికీ నాటి భారత మార్కెట్లో మారుతి 800 కారు కలిగి ఉండటం అనేది ఒక పెద్ద హోదాకు, సంపదకు చిహ్నంగా భావించేవారు.
Maruti 800 Old Bill Viral
ఈ వైరల్ బిల్లు చాలా మందికి పాత రోజుల తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చినప్పటికీ, కొంతమంది నెటిజన్లు మాత్రం దీని ప్రామాణికతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రసీదులో ఉపయోగించిన ఫాంట్ స్టైల్, బోర్డర్ డిజైన్, చట్రం వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన కొందరు టెక్ ప్రియులు.. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఫోటోషాప్ ఉపయోగించి సృష్టించిన ఫేక్ బిల్లు కావచ్చని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ చిత్రాన్ని పోస్ట్ చేసిన అసలు ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుండి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.
ఈ బిల్లు నిజమా కాదా అనే ముచ్చట పక్కన పెడితే.. ఒక్కప్పుడు భారతీయ మధ్యతరగతి గుండెల్లో మారుతి 800 చెరిపేయలేని ముద్ర వేసిందన్నది మాత్రం పచ్చి నిజం. నేడు మార్కెట్లోకి ఎన్ని అత్యాధునిక లగ్జరీ కార్లు వచ్చినా, నాటి మారుతి 800 కారు తెచ్చిన క్రేజ్ అమోఘం అని చెప్పక తప్పదు!