
బాత్రూమ్‌లో కనిపించిన ఓ సాలీడును తరిమేందుకు పర్యాటకుడు చేసిన చిన్న పని భారీ ప్రమాదానికి దారితీసింది. సాలీడును భయపెట్టేందుకు మండుతున్న కాగితాన్ని ఉపయోగించగా ఆ మంటలు విల్లా మొత్తాన్ని దహనం చేశాయి. దీంతో సుమారు రూ.కోటి విలువైన భవనం కాలి బూడిదైంది. ఇండోనేషియాలోని బాలిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నేపాల్‌కు చెందిన 45 ఏళ్ల గౌరప్ రాణా బాలిలోని ఓ విల్లాలో బస చేసాడు. ఆ ప్రాంతం పర్యాటకులకు ఎంతో ప్రసిద్ధి. తన బాత్రూమ్‌లో సాలీడు గూడును గమనించి దానిని తరిమేయాలని భావించాడు. ఓ కాగితాన్ని వెలిగించి సాలీడును భయపెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి విల్లాలోని మరో గదికి వెళ్లిపోయాడు. అయితే అతను కాల్చిన కాగితం గాలికి ఎగిరి విల్లా పైకప్పుపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ విల్లా పైకప్పును ‘అలంగ్ అలంగ్’ అనే గడ్డితో తయారు చేశారు. గడ్డి త్వరగా మంటలు అంటుకునే స్వభావం కలిగి ఉండటంతో అగ్ని వేగంగా వ్యాపించింది. బలమైన గాలులు, పొడి వాతావరణం మంటలు మరింత వేగంగా వ్యాపించడానికి కారణం కావడంతో చూస్తుండగానే మంటలు భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రమాదాన్ని గుర్తించిన గౌరప్ రాణా విల్లా నుంచి పరుగు పరుగున బయటకు రావడంతో ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, మంటల ధాటికి భవనం పూర్తిగా దెబ్బతింది. ఆ విల్లా విలువ సుమారు 1,12,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు కోటి రూపాయలు. విల్లాలో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భవనం నుంచి దట్టమైన పొగలు ఆకాశంలోకి ఎగసిపడటం చూసి కొందరు నీటి పైపులతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
బాలిలో విషపూరిత సాలీళ్లు అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా భవనాల్లో కనిపించే సాలీళ్లలో చాలా వరకు మనుషులకు హాని చేయనివే ఉంటాయి. గౌరప్ రాణా కంటపడిన సాలీడు విషపూరితమా? ప్రమాదకరమైంది కాదా అనే విషయం మాత్రం తెలియరాలేదు. దాదాపు రూ. కోటి విలువైన విల్లా అగ్నికి ఆహుతి కావడంతో గౌరప్ రాణాపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు? జరిగిన నష్టానికి ఆయన పరిహారం చెల్లించాల్సి వస్తుందా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.