ఇదేందయ్యా ఇదీ.. నటి సన్నీ లియోన్‌కు ప్రభుత్వ పథకం.. ప్రతి నెలా అకౌంట్లో రూ. 1000 జమ!

|

Dec 24, 2024 | 9:38 AM

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ అకౌంట్లో ప్రభుత్వ పథకం కింద ప్రతీనెల రూ.1000 జమ కావడం చర్చణీయాంశంగా మారింది. ఇలా దాదాపు పది నెలల నుంచి ఆమె పేరిట బ్యాంకు ఖాతాలో ప్రభుత్వ పథకం కింద డబ్బు పడుతున్నాయి. వివాహిత మహిళలకు ప్రభుత్వం అందించే పథకం కింద లబ్ధి పొందేందుకు..

ఇదేందయ్యా ఇదీ.. నటి సన్నీ లియోన్‌కు ప్రభుత్వ పథకం.. ప్రతి నెలా అకౌంట్లో రూ. 1000 జమ!
Actress Sunny Leone
Follow us on

జగదల్‌పుర్‌, డిసెంబర్‌ 24: మహిళల కోసం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహతారీ వందన్‌ యోజన’ పథకంలో ప్రముఖ నటి సన్నీ లియోన్‌ పేరు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం కింద సన్నీలియోన్‌ ప్రతీనెల రూ. వెయ్యి లబ్ధి పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయం నిర్ధారణ చేసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగగా అసలు బండారం బయటపడింది. ఓ వ్యక్తి ఏకంగా నటి సన్నీ లియోన్‌ పేరిట ఖాతా తెరచి అందులో వివాహిత మహిళల కోసం ప్రభుత్వ పథకం కింద ప్రతీ నెల డిపాజిట్‌ అవుతున్న రూ.1000 అక్రమంగా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం చత్తీస్‌ఘడ్‌లో వెలుగులోకి వచ్చింది.

బస్తర్‌ జిల్లా తాలూర్‌ గ్రామానికి చెందిన వీరేంద్ర జోషీ అనే వ్యక్తి సన్నీ లియోన్‌ పేరుతో మహతారీ వందన్ యోజన పథకం కింద ఖాతా తెరిచాడు. దీంతో ఈ ఖాతాలో నెలకు రూ.1,000 చొప్పున పది నెలల నుంచి లబ్ధి పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా లబ్ధిపొందుతున్న నిందితుణ్ని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పైగా అర్హులైన లబ్ధిదారులను నిర్ధారించే బాధ్యత నిర్వహిస్తున్న అధికారులపై కూడా చర్యలకు ఉపక్రమించారు. స్థానిక అంగన్‌వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్ల నిర్లక్ష్యం కారణంగా గత 10 నెలలుగా నిందితుడు అక్రమంగా లబ్ధిపొందుతున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఆయా ప్రాంతాలకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తను ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు, ప్రాజెక్టు అధికారి, సూపర్‌వైజర్‌లపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటువేసింది. దీనిపై క్షుణ్ణంగా విచారణ జరిపి డబ్బుల రికవరీ కోసం బ్యాంకు ఖాతాను సీజ్ చేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను జిల్లా కలెక్టర్ కోరారు.

మరోవైపు సన్నీ లియోన్‌ పేరుతో ప్రభుత్వ పథకం డబ్బులు ఖాతాలో పడుతున్నాయన్న అంశం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇంత మోసానికి పాల్పడిన నిందితుడు వీరేంద్ర జోషీ మాత్రం తాను నిరపరాధినని, తన ఆధార్, బ్యాంకు వివరాలతో ఎవరో దుర్వినియోగం చేసి తనను ఇరికించారని చెప్పడం విడ్డూరంగా మారింది. సన్నీ లియాన్‌ పేరుతో దరఖాస్తు చేసినట్లు తనకు తెలియదని చెప్పసాగాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.